4 బెర్త్‌లు... 6 రేసు గుర్రాలు! | Sakshi
Sakshi News home page

4 బెర్త్‌లు... 6 రేసు గుర్రాలు!

Published Sat, May 9 2015 1:36 PM

4 బెర్త్‌లు... 6 రేసు గుర్రాలు!

ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు వచ్చేస్తున్నాయి. అన్ని జట్లూ కనీసం పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నా ప్లే ఆఫ్‌కు వెళ్లే జట్ల విషయంలో స్పష్టత రాలేదు. పంజాబ్‌కు ఇప్పటికే నాకౌట్ అవకాశాలకు తెరపడింది. మరోవైపు ఢిల్లీకి కూడా దాదాపుగా అవకాశాలు లేవు. ప్రతి ఏటా లీగ్ మ్యాచ్‌ల ఆఖరి రోజే ప్లే ఆఫ్ జట్ల విషయంలో స్పష్టత వస్తోంది.

ఈసారి కూడా దాదాపుగా పరిస్థితి అలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏ జట్టూ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేదు. దీంతో నాలుగు బెర్త్‌లు అందుబాటులో ఉన్నట్లే. దీనికోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.  పంజాబ్, ఢిల్లీ మినహా మిగిలిన ఆరు జట్లూ రేసులో ఉన్నాయి. ప్రస్తుతం ఏఏ జట్ల పరిస్థితి ఏమిటి? ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఏం చేయాలో చూద్దాం.      -సాక్షి క్రీడావిభాగం
 
చెన్నై సూపర్ కింగ్స్
 ప్రస్తుతం 11 మ్యా చ్‌లు ఆడి 14 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉంది. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలున్నాయి. కనీసం ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరొచ్చు. రెండు గెలిస్తే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది.
 మిగిలిన మ్యాచ్‌లు: రాజస్తాన్ (10న), ఢిల్లీ (12న), పంజాబ్ (16న)
 
రాజస్తాన్ రాయల్స్
 గత ఏడాది చివరి మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ముందుకు వెళ్లే స్థితిలో అన్నీ ఓడి నాకౌట్‌కు చేరలేకపోయింది. ఈ ఏడాది కూడా సరిగ్గా అదే స్థితిలో ఉంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల ద్వారా 14 పాయింట్లతో ఉంది. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరొచ్చు. రెండూ గెలిస్తే టాప్-2లో ఉండొచ్చు. ఒకవేళ రెండూ ఓడిపోతే... ప్లే ఆఫ్ కోసం మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడాలి. మొత్తం మీద ఈ జట్టుకు కనీసం ఒక్క విజయం అవసరం.
 మిగిలిన మ్యాచ్‌లు: చెన్నై (10న), కోల్‌కతా (16న)
 
కోల్‌కతా నైట్‌రైడర్స్
 ప్రస్తుతం 11 మ్యాచ్‌ల ద్వారా 13 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ప్లే ఆఫ్‌కు వెళ్లొచ్చు. కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా ఆశలు సజీవంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్, మిగిలిన ప్రత్యర్థులను పరిశీలిస్తే గంభీర్ సేన ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
 మిగిలిన మ్యాచ్‌లు: పంజాబ్ (9న), ముంబై (14న), రాజస్తాన్ (16న)
 
బెంగళూరు రాయల్ చాలెంజర్స్
 10 మ్యాచ్‌లు ఆడి 11 పాయింట్లతో ఉంది. నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇందులో మూడు గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్‌కు వెళ్లొచ్చు. రెండు గెలిస్తే కూడా అవకాశాలు ఉం టాయి. కాకపోతే మిగిలిన జట్ల సమీకరణాలను పరిశీలించాల్సి ఉం టుంది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.
 మిగిలిన మ్యాచ్‌లు: ముంబై (10న), పంజాబ్ (13న), హైదరాబాద్ (15న), ఢిల్లీ (17న).
 
ముంబై ఇండియన్స్
 11 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిచినా ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్లే ఆఫ్ బెర్త్‌ల కోసం పోటీ పడుతున్న మూడు జట్లతో మ్యాచ్‌లు ఉండటం కాస్త ప్రతికూలాంశం. మూడూ గెలిస్తే టాప్-2లోకి వెళ్లడానికి కూడా అవకాశం ఉంటుంది.
 మిగిలిన మ్యాచ్‌లు: బెంగళూరు (10న), కోల్‌కతా (14న), హైదరాబాద్ (17న)

హైదరాబాద్ సన్‌రైజర్స్
 పది మ్యాచ్‌ల ద్వారా పది పాయింట్లతో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. బెంగళూరు, ముంబైలలో కనీసం ఒక్క జట్టుపై అయినా గెలవడం కీలకం. నాలుగులో మూడు హోమ్ మ్యాచ్‌లు (హైదరాబాద్) ఆడాల్సి ఉండటం కాస్త సానుకూలాంశం.
 మిగిలిన మ్యాచ్‌లు: ఢిల్లీ (9న), పంజాబ్ (11న), బెంగళూరు (15న), ముంబై (17న).
 
పంజాబ్ కింగ్స్ ఎలెవన్
 గతేడాది ఫైనలిస్ట్ పంజాబ్ ఈసారి అందరికంటే ముందు ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. అయితే మిగిలిన నాలుగు మ్యాచ్‌లూ ప్లే ఆఫ్ రేసులో ఉన్న జట్లతో ఆడాలి. పేలవమైన ఫామ్‌లో ఉన్న ఈ జట్టు ఎవరిమీద గెలిచినా వాళ్ల అవకాశాలు క్లిష్టంగా మారతాయి. ఈ జట్టు ఎవరి ‘పార్టీ’ని దెబ్బతీస్తుందో చూడాలి.
 మిగిలిన మ్యాచ్‌లు : కోల్‌కతా (9న), హైదరాబాద్ (11న), బెంగళూరు (13న), చెన్నై (16న)
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్
 11 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలతో 8 పాయింట్లు సాధించింది. మిగిలిన మూడూ గెలిచినా 14 పాయింట్లకే వస్తుంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల్లో 14 పాయింట్లతో ముందుకు వెళ్లడం కష్టం. పైగా మిగిలిన మూడు మ్యాచ్‌లూ తమకంటే బలమైన జట్లతో ఆడాల్సి ఉంది. కాబట్టి ఢిల్లీకి ప్లే ఆఫ్ ఆశలు లేనట్లే.
 మిగిలిన మ్యాచ్‌లు: హైదరాబాద్ (9న), చెన్నై (12న), బెంగళూరు (17న).

Advertisement
Advertisement