Sakshi News home page

షటిల్ సమరం

Published Fri, Jan 1 2016 11:55 PM

షటిల్ సమరం

నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
లీ చోంగ్ వీ విన్యాసాలు... సైనా నెహ్వాల్ స్మాష్‌లు... సింధు డ్రాప్ షాట్స్... మళ్లీ వచ్చేస్తున్నాయి.
ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులంతా భారత అభిమానులను తమ బ్యాడ్మింటన్ విన్యాసాలతో అలరించబోతున్నారు.
సైనాతో సింధు, శ్రీకాంత్‌తో లీ చోంగ్ వీ తలపడే అరుదైన సన్నివేశాలను భారత ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూడబోతున్నారు.
15 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వచ్చేసింది.

 
కొత్త సంవత్సరంలో భారత్‌లో క్రీడలు బ్యాడ్మింటన్ లీగ్‌తో ప్రారంభం కాబోతున్నాయి. భారీ అంచనాల మధ్య, అంతర్జాతీయ స్టార్ క్రీడాకారులు బరిలోకి దిగుతున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నేడు ముంబైలో ప్రారంభం కానుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవధ్ వారియర్స్... ముంబై రాకెట్స్‌తో తలపడుతుంది. జనవరి 17న ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో ముగిసే ఈ టోర్నీలో లీగ్ దశలో 15 టీమ్ మ్యాచ్‌లు జరుగుతాయి. హైదరాబాద్‌లో 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే 15న రెండో సెమీఫైనల్ కూడా భాగ్యనగరంలోనే నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఆరు నగరాల నుంచి ఆరు జట్లు లీగ్‌లో బరిలోకి దిగుతున్నాయి.                  
- సాక్షి క్రీడావిభాగం
 
జాక్వెలిన్ డ్యాన్స్
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సలీమ్-సులేమాన్ ద్వయం కూడా తమ పాటలతో హోరెత్తించనున్నారు. పీబీఎల్ పాటను కూడా వీరే రూపొందించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభోత్సవం మొదలవుతుంది. తొలి సీజన్ 2013 ఆగస్టులో జరిగింది.

ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) పేరుతో దీనిని నిర్వహించారు. ఆ సీజన్‌లో సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ హాట్‌షాట్స్ విజేతగా నిలిచింది. అయితే నిర్వాహకులతో గొడవల కారణంగా ఈ లీగ్ తర్వాత రెండేళ్లు జరగలేదు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తిరిగి అనేక రకాల ప్రయత్నాలు, ప్రతిపాదనలు చేసి ఎట్టకేలకు దీనిని తిరిగి తెచ్చింది. అయితే ఐబీఎల్ అనే పేరు తమదేనంటూ పాత నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో... ఈ సీజన్ నుంచి పీబీఎల్ పేరుతో నిర్వహించనున్నారు.
 
హైదరాబాద్ హంటర్స్
యజమాని: ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఆటగాళ్లు: లీ చోంగ్ వీ, కశ్యప్, సిరిల్ వర్మ (పురుషుల సింగిల్స్); సుపనిద (మహిళల సింగిల్స్); నందగోపాల్, సాయిసాత్విక్, మార్కిస్ కిడో, కార్‌స్టెన్, జ్వాల, మేఘన (డబుల్స్). 

కోచ్: రాజేంద్ర

వేలానికి ముందే రూ.65 లక్షలు చెల్లించేందుకు సిద్ధమై డ్రాలో లీ చోంగ్ వీని దక్కించుకున్న హైదరాబాద్... డబుల్స్‌లోనూ బలంగానే ఉంది. మార్కిస్ కిడో, జ్వాల మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడితే... కిడో, కార్‌స్టెన్ లేదా నందగోపాల్‌తో డబుల్స్ ఆడతాడు. మహిళల సింగిల్స్‌లో సుపనిద... సైనా, సింధులను మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులను ఓడించొచ్చు. మొత్తం మీద జట్టు సమతూకంతోనే ఉంది.
 
ఢిల్లీ ఏసర్స్
యజమాని: ఇన్‌ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్
ఆటగాళ్లు: అజయ్ జయరామ్, రాజీవ్ ఉసెఫ్, టామీ సుగియార్తో (పురుషుల సింగిల్స్); తులసి, శిఖా గౌతమ్ (మహిళల సింగిల్స్); అక్షయ్ దివాల్కర్, కూ కిట్ కీన్, టాన్ బూన్, అపర్ణా బాలన్, అడ్‌కాక్ (డబుల్స్). 

కోచ్: మధుమితా బిస్త్

అజయ్ జయరామ్, రాజీవ్ ఉసెఫ్ ఇద్దరూ గత ఏడాది నిలకడగా ఆడటం వల్ల పురుషుల సింగిల్స్‌పై ఈ జట్టు ఆశలు పెంచుకుంది. ఇండోనేసియా క్రీడాకారుడు సుగియార్తో కూడా అందుబాటులో ఉన్నాడు. మహిళల సింగిల్స్‌లో తులసి, శిఖా ఏమేరకు పెద్ద క్రీడాకారిణులను నిలువరిస్తారో చూడాలి. డబుల్స్‌లో మలేసియా జోడి కూ కిట్, టాన్‌బూన్ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు. ఇంగ్లండ్‌కు చెందిన అడ్‌కాక్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రమాదకర క్రీడాకారిణి.
 
ముంబై రాకెట్స్
యజమాని: దేవయాని లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఆటగాళ్లు: ప్రణయ్, గురుసాయిదత్ (పురుషుల సింగిల్స్), రుత్విక శివాని, హన్ లీ, లియు డి (మహిళల సింగిల్స్), మను అత్రి, చాయుత్, ఇవనోవ్, మథియాస్ బో, కమిల్లా (డబుల్స్). 

కోచ్: రామ్ (కెనడా)

పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ క్రీడాకారులు ప్రణయ్, గురుసాయిదత్ ఇద్దరే ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో చైనా క్రీడాకారిణులు ఇద్దరు అందుబాటులో ఉన్నందున తెలుగమ్మాయి రుత్వికకు పెద్దగా అవకాశం రాకపోవచ్చు. డబుల్స్‌లో ఇవనోవ్, మథియాస్ బో ఈ జట్టుకు బలం.
 
చెన్నై స్మాషర్స్
యజమాని: ద వోన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఆటగాళ్లు: సోని కుంకురో, సాంటోసో, లెవర్డెజ్ (పురుషుల సింగిల్స్), సింధు, కృష్ణ ప్రియ (మహిళల సింగిల్స్), ప్రణవ్ చోప్రా, క్రిస్ అడ్‌కాక్, టోబీ, జెబాదియా, సిక్కిరెడ్డి (డబుల్స్). 

కోచ్: గంగుల ప్రసాద్

పురుషుల సింగిల్స్‌లో ఇండోనేసియా స్టార్స్ సోని కుంకురో, సాంటోసోలతో పాటు ఫ్రాన్స్ ఆటగాడు లెవర్డెజ్ అందుబాటులో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు మీద ఈ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నందున... డబుల్స్‌లో ప్రణవ్ చోప్రాను కచ్చితంగా ఆడించాల్సి రావచ్చు. సిక్కిరెడ్డి కూడా ఈ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తోంది.
 
బెంగళూరు టాప్‌గన్స్

యజమాని: బ్రాండ్‌ప్రిక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్
ఆటగాళ్లు: శ్రీకాంత్, సమీర్ వర్మ, ఆనంద్‌పవార్ (పురుషుల సింగిల్స్), సువో ది (మహిళల సింగిల్స్), సుమీత్ రెడ్డి, కిమ్ వా లిమ్, హూన్ తీన్, నెల్సీ, బ్లాయెర్, అశ్విని పొన్నప్ప (డబుల్స్).

కోచ్: అరవింద్ భట్

బెంగళూరు జట్టుకు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ రూపంలో ఒక విజయం సులభంగా లభించొచ్చు. అయితే రెండో సింగిల్స్‌లో సమీర్ వర్మ, ఆనంద్ పవార్‌లలో ఎవరు ఆడినా విజయం సాధించగలరా అనేది అనుమానమే. మహిళల సింగిల్స్‌లో ఇండోనేసియా క్రీడాకారిణి సువో దిని కూడా తక్కువ అంచనా వేయలేం. మలేసియా పురుషుల డబుల్స్ క్రీడాకారులు కిమ్ వా, హూన్‌తీన్ కూడా ప్రమాదరకమైన జోడి. అశ్విని పొన్నప్ప మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎవరితో ఆడుతుందో స్పష్టత లేదు.
 
అవధ్ వారియర్స్ (లక్నో)
యజమాని: సహారా
ఆటగాళ్లు: సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ, తనోంగ్‌సక్ (పురుషుల సింగిల్స్), సైనా నెహ్వాల్, వృశాలి (మహిళల సింగిల్స్), కెయ్ యున్, హెండ్రా గుణవన్, బొడిన్ ఇసార, మనీషా, క్రిస్టినా (డబుల్స్). 

కోచ్: అనూప్ శ్రీధర్

లీగ్ ఆరంభానికి ముందే సైనా నెహ్వాల్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా ఈ జట్టు అందరి దృష్టినీ ఆకర్షించింది. 65 లక్షల రూపాయలు భారత స్టార్ క్రీడాకారిణికి ఇస్తున్న ఈ జట్టు... పురుషుల సింగిల్స్‌లో ప్రధానంగా థాయ్‌లాండ్ క్రీడాకారుడు తనోంగ్‌సోక్‌పై ఆధారపడింది. మరో సింగిల్స్‌లో సాయిప్రణీత్, సౌరభ్ వర్మలలో ఒకరు ఆడొచ్చు. డబుల్స్ విభాగంలో మిగిలిన జట్లతో పోలిస్తే బలంగా లేకపోవడం ఈ జట్టుకు లోటు.
 
ప్రైజ్ మనీ: విజేతకు రూ.65 లక్షలు
 
ట్రంప్ మ్యాచ్
ప్రతి ప్రత్యర్థితోనూ పోరుకు ముందు తమ ఐదు మ్యాచ్‌లలో ఒక మ్యాచ్‌ను ఆ జట్టు ట్రంప్ మ్యాచ్‌గా ప్రకటించాలి. సాధారణంగా మ్యాచ్ గెలిస్తే ఒక పాయింట్ వస్తుంది. కానీ ట్రంప్ మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు సాధించవచ్చు. ఇదే సమయంలో ట్రంప్ మ్యాచ్‌లో ఓడిపోతే ఒక మైనస్ పాయింట్ వస్తుంది.   అయితే ట్రంప్ మ్యాచ్ ప్రతిసారీ ఒక్క ప్లేయరే ఆడటానికి లేదు. అంటే ఉదాహరణకు లక్నో తరఫున అన్ని సైనా మ్యాచ్‌లనే ట్రంప్ మ్యాచ్‌లుగా ఎంచుకునే అవకాశం లేదు.

ఒక్క ప్లేయర్ లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే ట్రంప్ మ్యాచ్‌లు ఆడాలి. నాకౌట్ దశలో ఒక మ్యాచ్‌లోనే ఈ అవకాశముంటుంది.   ఒక జట్టు ట్రంప్ మ్యాచ్‌గా ఒక మ్యాచ్‌ను ఎంచుకుంటే... ప్రత్యర్థి జట్టుకు అది మామూలు మ్యాచ్ మాత్రమే. అంటే ప్రత్యర్థి గెలిస్తే ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఒకవేళ రెండు జట్లు ఒకే మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎం చుకుంటే మాత్రం గెలిచిన వాళ్లకు రెండు పాయింట్లు, ఓడినవాళ్లకు మైనస్ పాయింట్ వస్తాయి.
 
టోర్నీ నుంచి ఒక్క ఆటగాడు కూడా వైదొలగలేదు. అందరూ వస్తున్నారు. ప్రారంభోత్సవంతో పాటు ముంబై లెగ్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భారత బ్యాడ్మింటన్‌కు మేలు చేసే పీబీఎల్... ట్రంప్ మ్యాచ్ నిబంధన కచ్చితంగా ప్రేక్షకులకు ఆసక్తి పంచుతుందని భావిస్తున్నాం. దేశంలో బ్యాడ్మింటన్‌ను మరింత విస్తరించడానికి పీబీఎల్ ఉపయోగపడుతుంది.     
- ‘సాక్షి’తో పున్నయ్య చౌదరి (పీబీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ డెరైక్టర్)
 
ఫార్మాట్
* ఒక్కో జట్టు ఒక్కో ప్రత్యర్థితో ఒక్కసారి ఆడుతుంది. ఒక్క పోరులో ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో పురుషుల సింగిల్స్ రెండు, మహిళల సింగిల్స్ ఒకటి, పురుషుల డబుల్స్ ఒకటి, మిక్స్‌డ్ డబుల్స్ ఒక మ్యాచ్ ఉంటుంది.   
* ప్రతి మ్యాచ్ కూడా బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్ పద్ధతిలో జరుగుతుంది. ఒక్కో గేమ్‌లో ముందుగా ఎవరు 15 పాయింట్లు సాధిస్తే వాళ్లు గెలిచినట్లు. రెండు పాయింట్లు తేడా ఉండాలనే నిబంధన లేదు.
* ఒక్కో మ్యాచ్ గెలిస్తే ఒక్క పాయింట్. అయితే ‘ట్రంప్’ మ్యాచ్‌ల వల్ల ఒక్క ప్రతర్థిపై ఒకే జట్టు ఐదు మ్యాచ్‌ల ద్వారా ఆరు పాయింట్లు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది.
* పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి. ఒకటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడవు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లను ‘డ్రా’ తీయడం ద్వారా తొలి రెండు స్థానాల జట్లకు ప్రత్యర్థులను నిర్ణయిస్తారు.
* ఒక వేళ లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండు జట్లు సమంగా నిలిస్తే... ఆ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు ముందుకు వెళుతుంది.
* ప్రతి జట్టూ తమ ఐదు మ్యాచ్‌లలో కనీసం రెండింటిలో భారత క్రీడాకారులు ఆడేలా చూసుకోవాలి. అలాగే ఏ ప్లేయర్ కూడా రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడకూడదు. పురుషుల సింగిల్స్‌లో రెండు మ్యాచ్‌లు వేర్వేరు క్రీడాకారులు ఆడాలి.

Advertisement
Advertisement