ఫించ్ సెంచరీ: తొలి వన్డే ఆసీస్‌దే | Sakshi
Sakshi News home page

ఫించ్ సెంచరీ: తొలి వన్డే ఆసీస్‌దే

Published Mon, Jan 13 2014 1:00 AM

ఫించ్ సెంచరీ: తొలి వన్డే ఆసీస్‌దే

మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌లో వరుసగా ఐదు టెస్టులు నెగ్గి జోరు మీదున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (128 బంతుల్లో 121; 12 ఫోర్లు) సెంచరీతో ఆసీస్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.

 
 ముందుగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 269 పరుగులు చేసింది. బాలెన్సీ (96 బంతుల్లో 79; 6 ఫోర్లు), మోర్గాన్ (47 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్సర్) మెరుగ్గా ఆడారు. ఓ దశలో 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను మెర్గాన్, బాలెన్సీ నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో బట్లర్ (24 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్), బ్రెస్నన్ (9 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) వేగంగా ఆడారు. మెక్‌కే 3, కోల్టర్‌నీల్, మాక్స్‌వెల్, డోహెర్టీ, ఫాల్క్‌నర్ తలా ఓ వికెట్ తీశారు.

 
  తర్వాత ఆస్ట్రేలియా 45.4 ఓవర్లలో 4 వికెట్లకు 270 పరుగులు చేసి గెలిచింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బాలెన్సీ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ఫించ్.. వార్నర్ (72 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి తొలి వికెట్‌కు 163 పరుగులు జోడించాడు. తర్వాత క్లార్క్ (42 బంతుల్లో 43; 6 ఫోర్లు) నిలకడగా ఆడుతూ ఫించ్‌తో కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించి జట్టును విజయం ముంగిట నిలిపాడు. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 

Advertisement
Advertisement