‘డివి’లయతాండవం | Sakshi
Sakshi News home page

‘డివి’లయతాండవం

Published Mon, Jan 19 2015 12:39 AM

‘డివి’లయతాండవం - Sakshi

4, 2, 1, 1, 4, 6, 4, 6, 6, 0, 2, 2, 0, 1, 6, 6   6, 4, 6, 1, 4, 1, 1, 0, 4, 4, 0, 6, 4, 6, 6  6, 0, 6, 1, 6, 6, 4, 6, 6, 2, 2, 0,  
 
 తొలి 16 బంతుల్లో అర్ధ సెంచరీ   (0-51) తర్వాతి 15 బంతులకు సెంచరీ పూర్తి   (52-104) మిగిలిన 13 బంతుల్లో 45 పరుగులు  (105-149)
 
 31 బంతుల్లోనే సెంచరీతో ప్రపంచ రికార్డు
 
 క్రికెట్ మానవమాత్రుల క్రీడ. కానీ ఇంత అమానవీయంగా బౌలర్లపై విరుచుకు పడటం చూస్తే మానవ హక్కుల సంఘాలు కూడా కేసు పెట్టేందుకు సిద్ధమైపోతాయేమో! ఈ ఊచకోత గురించి గిల్‌క్రిస్ట్‌కు అప్పుడే తెలిసినట్లుంది. అందుకే నాలుగు రోజుల ముందే ప్రమాద హెచ్చరిక జారీ చేశాడు.
 
 అద్భుతం, అద్వితీయం, అసాధారణం, అనితరసాధ్యం లాంటి విశేషణాలు కూడా అబ్రహం బెంజమిన్ (ఏబీ) డివిలియర్స్ ఆటను చూస్తే చిన్నబుచ్చుకుంటాయి. వాటన్నింటికీ అతీతమైన ప్రదర్శన ఇది. తన బ్యాట్‌తో అతను విలయ తాండవం చేసిన తీరు క్రికెట్ ప్రేమికులకు పండగ చూపిస్తే, విండీస్‌కు చుక్కలు చూపించింది.
 
 వేగంగా ఆడితే రికార్డు, అతి వేగంగా ఆడితే రికార్డు బద్దలు, ఇవన్నీ పాత మాటలు... ఇప్పుడు డివిలియర్స్ ఎలా ఆడినా అదో కొత్త రికార్డుకు నాందిగా నిలుస్తోంది. మైదానంలో అతను వేసిన ప్రతీ అడుగు, తీసిన ప్రతీ పరుగు సంచలనంగా మారింది. కొత్త సంవత్సరంలో క్రికెట్ చరిత్రను తిరగరాసింది.
 
 జొహన్నెస్‌బర్గ్: ఏబీ డివిలియర్స్ (44 బంతుల్లో 149; 9 ఫోర్లు, 16 సిక్సర్లు) ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. వన్డే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీతో కొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ బౌలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 31 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ సెంచరీలో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. దాదాపు ఏడాది క్రితం న్యూజిలాండ్ ఆటగాడు అండర్సన్ (36 బంతుల్లో, వెస్టిండీస్‌పై) నెలకొల్పిన రికార్డును డివిలియర్స్ బద్దలు కొట్టాడు. ఐదు బంతుల తేడాతో అతను పాత రికార్డును సవరించడం విశేషం. ఈ క్రమంలో ఏబీ అనేక మైలురాళ్లు దాటాడు. 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడంతో 1996 నాటి జయసూర్య (17 బంతుల్లో) రికార్డు కూడా డివిలియర్స్‌కు దాసోహమంది.
 
అగ్నికి వాయువు తోడైనట్లు ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా శతకాలు బాది రికార్డు స్కోరులో తామూ భాగం పంచుకున్నారు. హషీమ్ ఆమ్లా (142 బంతుల్లో 153 నాటౌట్; 14 ఫోర్లు), రిలీ రోసో (115 బంతుల్లో 128; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు చేయడంతో దక్షిణాఫ్రికా 148 పరుగులతో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 439 పరుగులు చేయగా, అనంతరం విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 291 పరుగులకే పరిమితమైంది. సరిగ్గా వారం క్రితం ఈ మైదానంలో టి20ల్లో అత్యధిక ఛేదనతో దక్షిణాఫ్రికాకు వెస్టిండీస్ షాక్ ఇవ్వగా... ఇప్పుడు సఫారీలు వన్డేలో దానికి బదులు తీర్చుకున్నారు.

2006లో ఆసీస్ (434/4), దక్షిణాఫ్రికా(438/9)ల మధ్య ఇదే వాండరర్స్‌లో రసవత్తర పోరు జరిగింది.
 విధ్వంసం సాగిందిలా: దక్షిణాఫ్రికా స్కోరు 38.3 ఓవర్లలో 247... అప్పుడు బరిలోకి దిగాడు డివిలియర్స్. 11.3 ఓవర్లు మిగిలిన ఈ దశలో కొత్త బ్యాట్స్‌మన్ సెంచరీ సాధించగలడని ఊహించడం కూడా అసాధ్యం. కానీ డివిలియర్స్ 40 నిమిషాల విధ్వంసానికి ఆ 69 బంతుల్లో 44 బంతులే సరిపోయాయి. తొలి బంతికి మిడాన్ మీదుగా ఫోర్‌తో ఆ పరుగుల ప్రవాహం మొదలైంది. తర్వాతి ఓవర్లో 5 బంతులు ఆడితే 21 పరుగులు... మరుసటి ఓవర్లో ఒక సిక్స్ కొట్టినా కాస్త ప్రశాంతత.

అయితే ఆ వెంటనే మరో ఓవర్లో 5 బంతుల్లో 23 పరుగులు... కొద్ది సేపటికి 4 బంతులు ఆడితే మరో 22 పరుగులు... ఈ క్రమంలో అర్ధ సెంచరీ దాటినా, సెంచరీని పూర్తి చేసినా ఎక్కడా తగ్గని జోరు... ఫినిషింగ్ టచ్ అన్నట్టుగా డ్వేన్ స్మిత్ వేసిన ఓవర్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సహా ఏకంగా 30 పరుగులు! ఆఫ్ స్టంప్ వైపుగా కాస్త జరిగి స్క్వేర్‌లెగ్ మీదుగా సిక్స్, మోకాలిపై కూర్చొని ఆఫ్ స్టంప్ నుంచి ఆడితే బ్యాక్‌వర్డ్ స్క్వేర్ వైపు సిక్సర్, లాంగాన్, లాంగాఫ్, డీప్ మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్, డీప్ పాయింట్ వైపుగా మరో ఛక్కా... ఒకటా రెండా, ఎన్ని అద్భుతమైన షాట్లు, ఎన్ని కొత్త తరహా షాట్లు... అవన్నీ డివిలియర్స్‌కు మాత్రమే సాధ్యమనేలా అతని ఇన్నింగ్స్ సాగింది. చివరి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 16.3 రన్‌రేట్‌తో 163 పరుగులు చేయగా, డివిలియర్స్, ఆమ్లా భాగస్వామ్యంలో 67 బంతుల్లోనే 192 పరుగులు వచ్చాయి. ఇందులో ఏబీ 149 పరుగులు చేస్తే, ఆమ్లా చేసినవి 39 పరుగులే. ఎట్టకేలకు 50వ ఓవర్లో నాలుగో బంతికి డివిలియర్స్ వెనుదిరగ్గా, తర్వాతి రెండు బంతులకు పరుగులు రాలేదు.
 
 రొమ్ము క్యాన్సర్‌పై ప్రచారం, నిధుల సేకరణలో భాగంగా ఈ వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గులాబీ దుస్తులతో బరిలోకి దిగి తమ సంఘీభావం తెలిపారు. ఇందులో ఆటగాడు కొట్టే ప్రతీ సిక్సర్‌కు రూ. 10 వేల ర్యాండ్ల (దక్షిణాఫ్రికా కరెన్సీ) చొప్పున సేవాసంస్థకు వెళుతుంది. 16 సిక్సర్లు బాదిన డివిలియర్స్ అలా ఒకే మ్యాచ్‌తో 1 లక్షా 60 వేల ర్యాండ్లు (దాదాపు రూ. 85 లక్షలు) తన తరఫున అందించడం విశేషం.
 
  1     ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం వన్డే చరిత్రలో ఇదే తొలిసారి.
  1     ఈ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ 338.63 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఒక బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్‌లో కనీసం 50 పరుగులు చేసిన సందర్భాల్లో ఇదే ఎక్కువ స్ట్రయిక్ రేట్ కాగా, 300కు పైగా స్ట్రయిక్ రేట్‌తో సెంచరీ నమోదు కావడం ఇదే మొదటిసారి.
  1     ఒకే ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై) రికార్డును డివిలియర్స్ సమం చేశాడు.
  2     వన్డేల్లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు శ్రీలంక (443/9, నెదర్లాండ్స్‌పై) పేరిట ఉండగా, ఇప్పుడు దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది.
 12     వన్డేల్లో 400కు పైగా స్కోరు నమోదు కావడం ఇది 12వ సారి. భారత్ ఐదుసార్లు... దక్షిణాఫ్రికా మూడుసార్లు 400 పరుగులు దాటాయి.
 
 స్కోరు వివరాలు
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (నాటౌట్) 153; రోసో (సి) బెన్ (బి) టేలర్ 128; డివిలియర్స్ (సి) కార్టర్ (బి) రసెల్ 128; మిల్లర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 2 వికెట్లకు) 439.
 వికెట్ల పతనం: 1-247; 2-439.

 బౌలింగ్: టేలర్ 10-0-95-1; హోల్డర్ 9-0-91-0; బెన్ 10-0-49-0; రసెల్ 10-0-78-1; డారెన్ స్యామీ 4-0-26-0; శామ్యూల్స్ 3-0-28-0; డ్వేన్ స్మిత్ 4-0-68-0.

 వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) డుమిని (బి) బెహర్దీన్ 64; గేల్ (సి) బెహర్దీన్ (బి) మోర్కెల్ 19; జాన్సన్ (ఎల్బీ) (బి) ఫిలాండర్ 1; శామ్యూల్స్ (సి) బెహర్దీన్ (బి) ఫిలాండర్ 40; రామ్‌దిన్ (సి) డు ప్లెసిస్ (బి) మోర్కెల్ 57; కార్టర్ (సి) (సబ్) పార్నెల్ (బి) స్టెయిన్ 40; రసెల్ (సి) డు ప్లెసిస్ (బి) తాహిర్ 0; స్యామీ (నాటౌట్) 25; హోల్డర్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 291.
 వికెట్ల పతనం: 1-36; 2-63; 3-122; 4-148; 5-231; 6-232; 7-253.
 బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 10-0-43-2; ఫిలాండర్ 10-0-69-2; స్టెయిన్ 10-0-29-1; డుమిని 4-0-39-0; ఇమ్రాన్ తాహిర్ 10-0-60-1; బెహర్దీన్ 6-0-39-1.
 
    ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడంతో నేను చెలరేగడానికి అవకాశం దక్కింది. మరోవైపు ఆమ్లా చక్కగా ఆడి నాపై ఒత్తిడి తగ్గించాడు. క్రీజ్‌లోకి రాకముందే నా ఆట గురించి ఆలోచిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా సేపు వార్మప్ చేశాను. నిజానికి మూడో స్థానంలో మిల్లర్‌ను పంపాలని నేను భావిస్తే, కోచ్ మాత్రం నన్నే వెళ్లమన్నారు. అది అద్భుతంగా పని చేసింది. ఈ రోజు దూకుడుగా ఆడాలని ముందే అనుకున్నా.  92 వద్ద ఉన్నప్పుడు రికార్డు గురించి ఆలోచన ఉంది. కాబట్టి ఆ దశలో సింగిల్స్ తీయవద్దని నిర్ణయించేసుకున్నా.                         - ఏబీ డివిలియర్స్
 
 ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0తో ఆధి క్యంలో ఉంది. మూడో వన్డే 21న జరుగుతుంది.
 
 వన్డేల్లో టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు
 ఆటగాడు               జట్టు            బంతులు             ప్రత్యర్థి
 డి విలియర్స్        దక్షిణాఫ్రికా        31             విండీస్    
 కోరె అండర్సన్      న్యూజిలాండ్    36            విండీస్
 షాహిద్ ఆఫ్రిది        పాకిస్తాన్        37             శ్రీలంక
 బౌచర్                 దక్షిణాఫ్రికా        44            జింబాబ్వే
 లారా                    వెస్టిండీస్        45             బంగ్లాదేశ్
 
 
 
 వన్డేల్లో టాప్-5 ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీలు
 ఆటగాడు            జట్టు          బంతులు         ప్రత్యర్థి
 డి విలియర్స్        దక్షిణాఫ్రికా        16             విండీస్
 జయసూర్య           శ్రీలంక            17             పాకిస్తాన్
 ఒడెనల్                 ఆసీస్             18             శ్రీలంక
 షాహిద్ ఆఫ్రిది        పాకిస్తాన్        18             శ్రీలంక
 షాహిద్ ఆఫ్రిది        పాకిస్తాన్        18             నెదర్లాండ్స్
 
 వన్డేల్లో టాప్-5 జట్టు స్కోర్లు
 జట్టు        స్కోరు        ఎవరిపై             ఎప్పుడు
 శ్రీలంక        443/9        నెదర్లాండ్స్        2006
 దక్షిణాఫ్రికా    439/2        వెస్టిండీస్        2015
 దక్షిణాఫ్రికా    438/9        ఆస్ట్రేలియా        2006
 ఆస్ట్రేలియా    434/4        దక్షిణాఫ్రికా        2006
 దక్షిణాఫ్రికా    418/5        జింబాబ్వే        2006

Advertisement
Advertisement