సఫారీలతో తెగతెంపులు! | Sakshi
Sakshi News home page

సఫారీలతో తెగతెంపులు!

Published Sat, Jan 7 2017 1:26 PM

సఫారీలతో తెగతెంపులు!

కేప్టౌన్:కేల్ అబాట్..దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో కీలక బౌలర్గానే చెప్పొచ్చు. జట్టులో పోటీ ఉన్న నేపథ్యంలో అతనికి తరచు అవకాశాలు రాకపోయినప్పటికీ, వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూనే ఉన్నాడు. వచ్చే నెలకు అతని టెస్టు కెరీర్ను ఆరంభించి మూడేళ్లు పూర్తవుతోంది. అయితే అతను దక్షిణాఫ్రికా జట్టు నుంచి అర్థాంతరంగా వైదొలిగినట్లే కనబడుతోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఆడిన అబాట్.. ఇంగ్లిష్ కౌంటీ లీగ్ హాంప్షైర్తో ఒప్పందం చేసుకుని దక్షిణాఫ్రికా క్రికెట్ యాజమాన్యానికి షాకిచ్చాడు.

తన కెరీర్ను దృష్టిలో పెట్టుకుని హాంప్షైర్ తో సుదీర్ఘ ఒప్పందం చేసుకోవద్దని సౌతాఫ్రికా క్రికెట్ చేసిన యత్నాలు విఫలయత్నమైయ్యాయి. అబాట్ కు ఎంత చెప్పినా వినిపించుకోకుండా  ముందు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డాడు.  దాంతో సఫారీలతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడ్డాడనే విషయం అర్ధమవుతుంది.  ఈ విషయంలో అబాట్ ఏజెంట్ వెబర్ వాన్తో దక్షిణాఫ్రికా క్రికెట్ పెద్దలు చేసిన ప్రయత్నాలు కూడా చివరకు ఫలించలేదు. దాంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితా నుంచి అబాట్ పేరును తొలగించారు.

నేను ఎప్పుడూ దక్షిణాఫ్రికాకే క్రికెట్ ఆడాను. ఈ ఫిబ్రవరితో కెరీర్ను ఆరంభించి నాలుగేళ్లవుతుంది. ఎప్పుడూ ఆటగాళ్ల కోటా పద్ధతిలో జట్టుకు ఆడుతూ వచ్చాను. అయితే ఇలా జరుగుతున్నందుకు ఎప్పుడూ బాధపడలేదు కూడా. అయితే అది ఇప్పుడు కాదు. నాకు పలు వస్తువుల్ని కొనడానికి డబ్బులు కావాలి. కొన్ని బిల్లుల్ని కూడా కట్టాలి. దాంతోనే హాంప్షైర్ ఒప్పందాన్ని చేసుకున్నా. ఇది కఠిన నిర్ణయమే కానీ.. తప్పదు'  అని అబాట్ పేర్కొన్నాడు.

కాగా, దీనిపై మాత్రం దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ భిన్నంగా స్పందించాడు. జట్టు నుంచి తప్పుకునే పద్దతి ఇది కాదని పేర్కొన్నాడు. అతని మనసును మార్చాలని చాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నాడు. అబాట్ ఏమి చేయాలనుకున్నాడో, చివరకు అదే చేశాడని డు ప్లెసిస్ తెలిపాడు. ఏది ఏమైనా అభద్రతా భావానికి లోనై మాత్రమే అబాట్ దక్షిణాఫ్రికా జట్టు నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. దాంతో పాటు ఆర్థిక అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అబాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవగతమవుతోంది.

 

హాంప్షైర్ తో ఒప్పందం అబాట్ కు ఫైనాన్షియల్ గా  పెద్దగా కలిసొచ్చేది కూడా కాదు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఇచ్చే జీతం కంటే హాంప్షైర్ అబాట్ కు చెల్లించే మొత్తం అధికమేమీ కాదు. అయితే ఐపీఎల్, విదేశాల్లో మిగతా టీ 20లీగ్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును వీడి వెళ్లిపోవడానికి అబాట్ సిద్ధపడినట్లు కనబడుతోంది. ముందుగా ఇంగ్లిష్ లీగ్ ల్లో సత్తాచాటుకుని మిగతా విదేశీ లీగ్ ల్లోకి రావాలనే ప్రణాళిక ప్రకారమే జాతీయ జట్టుకు అబాట్ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా తరపున 11 టెస్టు మ్యాచ్లు ఆడిన అబాట్ 39 వికెట్లు తీశాడు. తన కెరీర్లో మూడుసార్లు ఐదేసి వికెట్లను సాధించాడు.  అయితే 28 వన్డేలు ఆడి 34 వికెట్లను మాత్రమే అబాట్ తన ఖాతాలో  వేసుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement