ట్వంటీ 20ల్లో అఫ్గన్ జైత్రయాత్ర | Sakshi
Sakshi News home page

ట్వంటీ 20ల్లో అఫ్గన్ జైత్రయాత్ర

Published Sat, Mar 11 2017 3:53 PM

ట్వంటీ 20ల్లో అఫ్గన్ జైత్రయాత్ర

గ్రేటర్ నోయిడా: ట్వంటీ 20 ఫార్మాట్ లో అఫ్గనిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. శుక్రవారం  ఇక్కడ ఐర్లాండ్ తో జరిగిన రెండోట్వంటీ 20 మ్యాచ్ లో అఫ్గన్ 17 పరుగుల తేడాతో గెలుపొంది తన వరుస విజయాల సంఖ్యను మరింత పెంచుకుంది. ఇది అఫ్గన్ కు వరుసగా పదో టీ 20 విజయం. దాంతో ట్వంటీ 20 ఫార్మాట్ లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన రికార్డును అఫ్గన్ సవరించుకుంది. గతంలో ట్వంటీ 20 ఫార్మాట్ లో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు వరుస ఎనిమిది విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అఫ్గన్ ఓపెనర్ నజీబ్ తరాకాయ్(90) రాణించగా, మొహ్మద్ నబీ(34) ఫర్వాలేదనిపించాడు.  అయితే 185 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఐర్లాండ్ ఆదిలో దూకుడుగా ఆడింది. తొలి ఆరు ఓవర్ల పవర్ ప్లే ఆటలో ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. ఆ తరువాత వర్షం కురవడంతో మ్యాచ్ కు అంతరాయం కల్గింది. దాంతో ఐర్లాండ్ విజయలక్ష్యాన్ని 11 ఓవర్లలో 111 పరుగులకు నిర్దేశించారు. అయితే ఐర్లాండ్ 93 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.


 

Advertisement
Advertisement