'నా కల నిజమైంది' | Sakshi
Sakshi News home page

'నా కల నిజమైంది'

Published Tue, Sep 22 2015 6:26 PM

'నా కల నిజమైంది'

న్యూఢిల్లీ: జీవితంలో సూపర్ సిరీస్ ఫైనల్ ఆడాలన్న కల నిజమైనందుకు భారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ ఆనందం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ లో వెనుకబడ్డ జయరామ్.. ఈమధ్య జరిగిన కొరియో ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ లో ఫైనల్ కు చేరాడు.  భారత స్టార్ ఆటగాళ్లు నిష్ర్కమించిన చోటే తన పూర్వవైభవాన్ని చాటుకుంటూ తుది రౌండ్ వరకూ వెళ్లాడు. అయితే టైటిల్ వేటలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)చేతిలో ఓటమి పాలయ్యాడు.

 

కాగా,  సూపర్ సిరీస్ ఫైనల్ కు చేరడం తన జీవితంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నానని.. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తాను చిన్నప్పట్నుంచి బ్యాడ్మింటన్ దిగ్గజాలైన పీటర్ గేడ్, లిన్ డాన్ ల ఆటతీరును చూస్తూ పెరిగినట్లు జయరామ్ తెలిపాడు. ఆ చాంపియన్ ఆటగాళ్లే స్ఫూర్తితోనే తన బ్యాడ్మింటన్ ఆటకు పదును పెట్టినట్లు పేర్కొన్నాడు. తాను గెలిచిన డచ్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నాడు. ఇప్పటివరకూ బ్యాడ్మింటన్ లో  ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన తనకు.. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో రన్నరప్ గా నిలవడంతో సరికొత్త శక్తి వచ్చినట్లు ఉందన్నాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్న వారిలో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement