ఏడేళ్ల తర్వాత ఫైనల్‌కు... | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తర్వాత ఫైనల్‌కు...

Published Thu, Mar 16 2017 11:48 PM

ఏడేళ్ల తర్వాత ఫైనల్‌కు...

టైటిల్‌ పోరుకు తమిళనాడు అర్హత
సెమీస్‌లో బరోడాపై విజయం


న్యూఢిల్లీ: తొలుత బౌలర్లు... ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో... విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో తమిళనాడు జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తమిళనాడు మరో విజయం సాధిస్తే అత్యధికంగా ఐదుసార్లు ఈ టైటిల్‌ నెగ్గిన జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో తమిళనాడు 2002–03; 2004–05; 2008–09, 2009–10 సీజన్‌లలో విజేతగా నిలిచింది. బరోడా జట్టుతో గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో తమిళనాడు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బరోడా జట్టు 49.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.

ఒకదశలో రెండు వికెట్లకు 123 పరుగులతో పటిష్టంగా కనిపించిన బరోడా జట్టును తమిళనాడు బౌలర్‌ సాయికిశోర్‌ (4/59) దెబ్బతీయగా... అశ్విన్‌ క్రిస్ట్, వాషింగ్టన్‌ సుందర్, రాహిల్‌ షా రెండేసి వికెట్లు పడగొట్టారు. 220 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు జట్టు 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. దినేశ్‌ కార్తీక్‌ (77; 4 ఫోర్లు), విజయ్‌ శంకర్‌ (53 నాటౌట్‌; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి తమిళనాడు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. దినేశ్‌ కార్తీక్‌ అవుటయ్యాక వాషింగ్టన్‌ సుందర్‌ (26 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి విజయ్‌ శంకర్‌ తమిళనాడు విజయాన్ని ఖాయం చేశాడు. బరోడా బౌలర్లలో అతీత్‌ మూడు వికెట్లు తీసుకున్నాడు. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో బెంగాల్‌తో జార్ఖండ్‌ తలపడుతుంది. 

Advertisement
Advertisement