ఆ ఇద్దరి తప్పేమీ లేదు | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి తప్పేమీ లేదు

Published Sat, Aug 2 2014 1:42 AM

Anderson, Jadeja not guilty in Trent Bridge row, finds ICC

జడేజా, అండర్సన్ నిర్దోషులే
 తేల్చిన జ్యుడీషియల్ కమిషనర్
 
 సౌతాంప్టన్: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత... ఇక ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై రెండు టెస్టుల వేటు ఖాయమని... ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవపై ఇప్పటిదాకా క్రికెట్ ప్రపంచం ఊహించింది. అయితే తొలి టెస్టులో జరిగిన ఈ ఘటనపై విచారణ కోసం ఏర్పడిన జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయిస్ ఈ వివాదంలో ఇద్దరూ నిర్దోషులే అని తేల్చారు. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. జడేజా, అండర్సన్ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించలేదని కమిషనర్ పేర్కొన్నట్టు స్పష్టం చేసింది. దీంతో జడేజాపై విధించిన మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత కూడా ఉపసంహరించుకున్నట్టయ్యింది. శుక్రవారం ఆరు గంటల  పాటు ధోని బృందం బస చేసిన గ్రాండ్ హార్బర్ హోటళ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణ జరిగింది.  కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్, జడేజా, గంభీర్ (సాక్షి) పాల్గొన్నారు. అటు అండర్సన్ తరఫున సాక్షులుగా ప్రయర్, బ్రాడ్ హాజరయ్యారు. అలాగే ఈసీబీ టీమ్ మేనేజర్ పాల్ డౌన్‌టన్, బీసీసీఐ తరఫున సుందర్ రామన్, ఎంవీ శ్రీధర్ హాజరయ్యారు.
 
 భారత వన్డే జట్టు ఎంపిక 7న
 ముంబై: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్టర్లు 7న సమావేశం కానున్నారు. ఐదు టెస్టుల సిరీస్ ముగిసిన తరువాత భారత్, ఇంగ్లండ్‌లు వన్డే సిరీస్‌తోపాటు ఏకైక టి20 మ్యాచ్ కూడా ఆడనున్నాయి.
 

Advertisement
Advertisement