పృథ్వీ షా డోప్‌ టెస్ట్‌లో కొత్త కోణం | Sakshi
Sakshi News home page

పృథ్వీ షా డోప్‌ టెస్ట్‌లో కొత్త కోణం

Published Sun, Aug 11 2019 12:18 PM

Another Twist in Prithvi Shaw Dope Test - Sakshi

న్యూఢిల్లీ:  భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా డోప్‌ టెస్ట్‌లో కొత్త కోణం. దగ్గు, జలుబుకు పృథ్వీ వాడిన సిరప్‌లో నిషేధిత డ్రగ్‌ ఉందని తేలడంతో అతడిపై ఎనిమిది నెలల నిషేధం విధించామని ఇటీవల బీసీసీఐ వెల్లడించింది. కానీ ముంబై జట్టు కోచ్‌ వినాయక్‌ సామంత్‌, ఫిజియో దీప్‌ తోమర్‌ చెప్పిన విషయాలు షా డోపింగ్‌ టెస్ట్‌పై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ సమయంలో షా.. దగ్గు, జలుబుతో బాధపడలేదని వినాయక్‌, దీప్‌ వెల్లడించడం సంచలనం రేపుతోం ది. ‘ఆ టోర్నీ సమయంలో షాకు స్వల్ప జ్వరం వచ్చింది. అంతే తప్ప దగ్గు, జలుబుతో బాధపడలేదు. అలాగే దగ్గు నివారణ కోసం మందు ఇవ్వాలని కూడా అతడు మమ్మల్ని అడగలేదు’ అని వారు స్పష్టం చేశారు.

అయినా ఏ మందు తీసుకోవాలో, ఏది తీసుకోకూడదో స్పష్టంగా తెలిసిన ఓ భారత క్రికెటర్‌... మెడికల్‌ షాప్‌నకు వెళ్లి దగ్గు తగ్గేందుకు సిరప్‌ తీసుకుంటాడా అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంచితే, బీసీసీఐ యాంటీ డోపింగ్‌ మేనేజర్‌ అభిజత్‌ సాల్వి చెప్పిన వివరాలు మాత్రం మరోలా ఉన్నాయి.  దగ్గు, జలుబు కోసం తన తండ్రిని సలహా కోరగా ఫార్మసీకి వెళ్లి మెడిసిన్‌ తీసుకోమన్నాడని, దాంతో ఇండోర్‌లోని తన బస చేసిన హోటల్‌కు దగ్గరగా ఉన్న మెడికల్‌ షాపుకు వెళ్లి షా సిరప్‌ తీసుకున్నాడని పేర్కొన్నారు. తొందరగా రిలీఫ్‌ ఇవ్వడం కోసం ఫార్మాసిస్ట్‌ ఇచ్చిన సిరప్‌ వాడిన కారణంగానే షా డోపింగ్‌ టెస్టులో విఫలమయ్యాడని అభిజిత్‌ సాల్వి తెలిపారు.

Advertisement
Advertisement