ఆసియాకప్ ఫైనల్లో భారత్ | Sakshi
Sakshi News home page

ఆసియాకప్ ఫైనల్లో భారత్

Published Sat, Aug 31 2013 1:26 AM

ఆసియాకప్ ఫైనల్లో భారత్

ఇపో: అన్నీ కలసిరావడంతో భారత హాకీ జట్టు ఒకేసారి రెండు లక్ష్యాలను అందుకుంది. అటు ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించడంతోపాటు ఇటు ఆసియా కప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో భారత్ 2-0 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించగా... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా 2-1తో పాకిస్థాన్‌పై గెలిచింది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. కొరియా జట్టు ఇప్పటికే ప్రపంచ కప్‌కు అర్హత పొందడం... అడ్డుగా ఉన్న పాకిస్థాన్ సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో భారత్, మలేసియా జట్లకు మార్గం సుగమమైంది.
 
 ఈ రెండు జట్లూ వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్ బెర్త్‌లను దక్కించుకున్నాయి. 1971లో ప్రపంచ కప్ మొదలయ్యాక తొలిసారి పాకిస్థాన్ జట్టు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందలేకపోయింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిబంధనల ప్రకారం ఆసియా కప్ విజేత జట్టు గనుక ఇంతకుముందే ప్రపంచ కప్ బెర్త్ దక్కించుకుంటే... ఈ మెగా టోర్నీకి అర్హత టోర్నీగా  గత జూన్, జూలైలలో నిర్వహించిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ రౌండ్‌లో ఆసియా జోన్ నుంచి అత్యుత్తమ స్థానాలు పొందిన రెండు జట్లకు అవకాశం లభిస్తుంది.
 
 ఈ నిబంధన ప్రకారం ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన కొరియాకు ఇప్పటికే ప్రపంచ కప్ స్థానం ఖాయం కావడం... పాక్ జట్టు సెమీస్‌లోనే నిష్ర్కమించడం మూలంగా... హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ రౌండ్‌లో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన మలేసియా, భారత్ జట్లు ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచ కప్‌కు అర్హత పొందాయి. హాకీ వరల్డ్ లీగ్‌లో మలేసియా, భారత్ తర్వాత పాకిస్థాన్ ఏడో స్థానంలో నిలిచింది. ఫలితంగా పాకిస్థాన్ ప్రపంచకప్‌కు అర్హత పొందాలంటే కచ్చితంగా ఆసియా కప్ విజేతగా గెలవాల్సింది.
 
 సెమీఫైనల్లో పాక్ ఓడిపోవడంతో ప్రపంచ కప్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్... ఆతిథ్య మలేసియా జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీ వ్యూహంతో ఆడింది. సమన్వయంతో కదులుతూ అవకాశం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పైకి దాడులు చేసింది. ఈ క్రమంలో ఆట 8వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ గోల్‌గా మలిచాడు. విరామ సమయానికి భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ భారత్ పట్టుదలతో పోరాడింది. ఆట 60వ నిమిషంలో రమణ్‌దీప్ అందించిన పాస్‌ను మన్‌దీప్ సింగ్ లక్ష్యానికి చేర్చడంతో భారత ఆధిక్యం 2-0కు పెరగడంతోపాటు విజయమూ ఖాయమైంది.
 

Advertisement
Advertisement