కొట్టేస్తారా ఏడో సారి! | Sakshi
Sakshi News home page

కొట్టేస్తారా ఏడో సారి!

Published Fri, Sep 28 2018 1:44 AM

Asia Cup Final: India looks to remain king of Asia - Sakshi

నిన్న మొన్నటి ఉత్కంఠభరిత నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ను మరువకముందే... భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య మరో ఆఖరి పోరాటం. బలాబలాలను బేరీజు వేసినా, ఆటతీరును అంచనా కట్టినా పటిష్ఠంగా కనిపిస్తున్న టీమిండియా...! అవకాశం చిక్కితే సంచలనం సృష్టించగల బంగ్లా...! దుబాయ్‌ వేదికగా దుమ్మురేపేదెవరో...? కప్పును ఒడిసిపట్టేదెవరో...?  

దుబాయ్‌: సాదాసీదాగా సాగుతూ వచ్చిన ఆసియా కప్‌ తుది అంకానికి చేరింది. భీకర ఆటతీరుతో అదరగొడుతున్న భారత్‌ను... పడుతూ లేస్తూ వచ్చిన బంగ్లాదేశ్‌ శుక్రవారం జరిగే తుది సమరంలో ఢీ కొట్టనుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ బలాబలాల రీత్యా చూస్తే ఫైనల్లో టీమిండియానే హాట్‌ ఫేవరెట్‌. ప్రధాన బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి లేకున్నా మన జట్టు ఎదుట నిలవడం బంగ్లాకు సవాలే. అయితే,  సంచలనాలు సృష్టించే సత్తా ఉన్న మొర్తజా సేనను తక్కువ అంచనా వేస్తే అసలుకే ఎసరు వస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన అతి విశ్వాసానికి పోకుండా ఆడితే చాలు. తద్వారా ఆసియా కప్‌ ఏడోసారి భారత్‌ ఖాతాలో చేరిపోతుంది. వన్డే కెప్టెన్‌గా ఓ మేజర్‌ టోర్నీ నెగ్గిన ఘనత రోహిత్‌ సొంతమవుతుంది. 

‘మిడిల్‌’ ఒక్కటే బెంగ 
కోహ్లి లేకున్నా రోహిత్, ధావన్‌ల అద్భుత ఫామ్‌తో బ్యాటింగ్‌లో భారత్‌కు లోటు తెలియలేదు. వన్‌డౌన్‌లో అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌ సైతం తమవంతు పాత్ర సమర్థంగా పోషించారు. కానీ, ప్రధాన ఆందోళనంతా మిడిల్‌ ఆర్డర్‌ గురించే. భారత్‌ను ఎప్పటినుంచో ఇబ్బందిపెడుతున్న 5, 6 స్థానాల సమస్యకు ఈ టోర్నీ సైతం పరిష్కారం చూపలేకపోయింది. ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్‌ కీలక సమయంలో విఫలమవుతున్నారు. ఈ కారణంగానే అఫ్గానిస్తాన్‌తో చివరి సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌ ‘టై’ అయింది. అయితే, ఫైనల్‌కు పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగుతున్నందున ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, బుమ్రా తమ స్థాయికి తగ్గట్లుగా రాణించారు. టోర్నీలో ఏ బ్యాట్స్‌మెనూ వారిని ఎదుర్కొని పరుగులు సాధించలేకపోయారు. ఆల్‌రౌండర్‌ జడేజాకు తోడుగా చహల్, కుల్దీప్‌ స్పిన్‌ బాధ్యతలు చూసుకుంటారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగితే భారీ స్కోరు సాధించి ప్రత్యర్థి అందుకోలేనంత లక్ష్యాన్ని నిర్దేశించడం, బౌలింగ్‌కు దిగితే లక్ష్యం 250 మించకుండా ఉండేలా చూసుకోవాలి. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న ఐదుగురు ఆటగాళ్లు ఫైనల్లో బరిలో దిగడం ఖాయం. 

అతడిని ఆపాలి... 
బంగ్లాదేశ్‌ టోర్నీలో ఇక్కడివరకు వచ్చిందంటే అది పూర్తిగా ముష్ఫికర్‌ రహీమ్‌ ఘనతే. కీలక ఆటగాళ్లు తమీమ్‌ ఇక్బాల్, షకీబుల్‌  దూరమైనా జట్టును అతను ఒంటిచేత్తో ఫైనల్‌ చేర్చాడు. ఓపెనర్లు లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్‌ సహా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమవుతున్నా యువ ఆటగాడు మొహమ్మద్‌ మిథున్‌తో కలిసి ముష్ఫికర్‌ పోరాడుతున్నాడు. పాకిస్తాన్‌తో సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లో ఈ ఇద్దరి భాగస్వామ్యమే ఫలితాన్ని మార్చింది. ఫైనల్లోనూ బ్యాటింగ్‌ భారమంతా వీరిపైనే పడనుంది. సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ మహ్ముదుల్లా, ఇమ్రుల్‌ కైస్‌ రాణిస్తే అదనపు బలంగా మారుతుంది. మరో వైపు బౌలింగ్‌లో పేసర్‌ ముస్తఫిజుర్‌ లయ అందుకోవడం బంగ్లాకు అనుకోని వరం. అతడితో పాటు కెప్టెన్‌ మొర్తజా, రూబెల్‌ హుస్సేన్‌లతో జట్టు పేస్‌ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. మెహదీ హసన్‌ మెరుగ్గానే ఉన్నా... గత మ్యాచ్‌లో షకీబ్‌ లోటు కనిపించింది. దీంతో పార్ట్‌ టైమర్‌ మహ్ముదుల్లాపై ఆధారపడాల్సి వచ్చింది. మ్యాచ్‌ సాగే కొద్దీ నెమ్మదించే దుబాయ్‌ పిచ్‌లపై... భారత్‌ వంటి నాణ్యమైన స్పిన్‌ వనరులున్న జట్టును ఎదుర్కొనడం సవాలే. ఏదేమైనా  బ్యాట్స్‌మెన్‌ అంచనాలకు మించి రాణిస్తే తప్ప ఫైనల్లో టీమిండియాను నిలువరించడం బంగ్లా శక్తికి మించిన పనే.

►ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరడం బంగ్లాదేశ్‌కిది మూడోసారి. 2012లో పాకిస్తాన్‌ చేతిలో, 2016లో (టి20 ఫార్మాట్‌) భారత్‌ చేతిలో ఓడింది. 
►భారత్‌ ఇప్పటివరకు ఆరుసార్లు (1984, 1988, 1990–91, 1995, 2010, 2016) ఆసియా కప్‌ను గెల్చుకుంది. 1997, 2004, 2008లలో రన్నరప్‌గా నిలిచింది.

పిచ్‌–వాతావరణం 
దుబాయ్‌లో 40 డిగ్రీలకు తక్కువ కాకుండా ఎండ కాస్తోంది. ఈ నేపథ్యంలో విపరీతమైన వేడిమిని తప్పించుకునేందుకు టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌కే మొగ్గుచూపొచ్చు. టోర్నీలో పిచ్‌ల తీరు చూస్తే 250పై స్కోరే భారీగా కనిపిస్తోంది. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, దినేశ్‌ కార్తీక్, ధోని, కేదార్‌ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్, బుమ్రా 
బంగ్లాదేశ్‌: మొర్తజా (కెప్టెన్‌), లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, మోమినుల్‌ హక్, ముష్ఫికర్, మొహమ్మద్‌ మిథున్, ఇమ్రుల్‌ కైస్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, రూబెల్‌ హుస్సేన్, ముస్తఫిజుర్‌  

Advertisement
Advertisement