ఆసియా చెస్‌ చాంప్స్‌ జిషిత, అర్జున్‌ | Sakshi
Sakshi News home page

ఆసియా చెస్‌ చాంప్స్‌ జిషిత, అర్జున్‌

Published Sun, Apr 9 2017 1:33 AM

ఆసియా చెస్‌ చాంప్స్‌ జిషిత, అర్జున్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ చెస్‌ వేదికపై మరోసారి తెలుగు క్రీడాకారులు మెరిశారు. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి డి.జిషిత... తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌ చాంపియన్స్‌గా అవతరించారు. స్టాండర్డ్‌ విభాగంలో అండర్‌–14 బాలికల విభాగంలో జిషిత... అండర్‌–14 ఓపెన్‌ విభాగంలో అర్జున్‌ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు నెగ్గారు.

నిర్ణీత తొమ్మిది రౌండ్‌లు ముగిశాక జిషిత 7.5 పాయింట్లు... అర్జున్‌ 8.5 పాయింట్లు స్కోరు చేసి టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. జిషిత ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. అర్జున్‌ ఎనిమిది గేముల్లో నెగ్గి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు.

భారత్‌కే చెందిన సాహితి వర్షిణి (తమిళనాడు) అండర్‌–10 బాలికల విభాగంలో, ఆకాంక్ష (మహారాష్ట్ర) అండర్‌–18 బాలికల విభాగంలో పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా స్టాండర్డ్‌ విభాగంలో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు లభించాయి. ఆదివారం బ్లిట్జ్‌ విభాగంలో పోటీలు జరుగుతాయి.

Advertisement
Advertisement