‘యాషెస్’లో ఆసీస్ హవా | Sakshi
Sakshi News home page

‘యాషెస్’లో ఆసీస్ హవా

Published Mon, Dec 30 2013 1:32 AM

క్రిస్ రోజర్స్

మెల్‌బోర్న్: ఇంగ్లండ్‌లో జరిగిన ఘోర పరాభవానికి ఆస్ట్రేలియా దీటుగా ప్రతీకారం తీర్చుకుంటోంది. వరుసగా నాలుగో టెస్టులోనూ ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది. క్రిస్ రోజర్స్ (155 బంతుల్లో 116; 13 ఫోర్లు), వాట్సన్ (90 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) చెలరేగి ఆడటంతో నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
 
  231 పరుగుల లక్ష్యాన్ని క్లార్క్ సేన 51.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 30/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ జట్టులో ఓపెనర్ వార్నర్ (47 బంతుల్లో 25; 2 ఫోర్లు) విఫలమయ్యాడు. అయితే వాట్సన్ సమయోచితంగా స్పందిస్తూ మరో ఓపెనర్ రోజర్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
 
  ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోజర్స్ కెరీర్‌లో రెండో సెంచరీని పూర్తి చేశాడు. చివర్లో వాట్సన్, క్లార్క్ (6 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. స్టోక్స్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన ఆసీస్ కెప్టెన్ టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ రెండు కీలక క్యాచ్‌లు జారవిడిచి మూల్యం చెల్లించుకున్నాడు. స్టోక్స్, పనేసర్ చెరో వికెట్ తీశారు. జాన్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది.
 
 సంక్షిప్త స్కోర్లు
 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 255, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 204, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 179, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 231/2 (రోజర్స్ 116, వాట్సన్ 83 నాటౌట్).
 

Advertisement

తప్పక చదవండి

Advertisement