విరాట్ సేనకు పోటీ ఇవ్వాలంటే.. | Sakshi
Sakshi News home page

విరాట్ సేనకు పోటీ ఇవ్వాలంటే..

Published Sun, Jan 8 2017 3:47 PM

విరాట్ సేనకు పోటీ ఇవ్వాలంటే..

సిడ్నీ:వచ్చే నెల్లో భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అప్పుడే తన ప్రణాళికలకు పదును పెడుతోంది. ఈసారి  టీమిండియాను వారి దేశంలో ఓడించి సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఇటీవల పాకిస్తాన్తో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఆస్ట్రేలియా.. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ ను ఆపేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా భారత్లో కచ్చితంగా అమలు చేయాల్సిన ప్రణాళికల్ని ఆటగాళ్లకు ఆసీస్ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ దిశా నిర్దేశం చేస్తున్నాడు. ప్రధానంగా భారత్కు గట్టి పోటీ ఇవ్వాలంటే సుదీర్ఘంగా క్రీజ్లో బ్యాటింగ్ చేయడమే ఒక్కటే సరైన మార్గమని ముందుగా స్టీవ్ స్మిత్ సేనను సిద్ధం చేస్తున్నాడు.

 

ఈ మేరకు  విరాట్ సేనతో జరిగిన టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ ఘోరంగా ఓడిపోవడానికి కారణాన్ని విశ్లేషించాడు. భారత్తో సిరీస్లో ఇంగ్లండ్ మంచి స్కోర్లు చేసినప్పటికీ వారు ఘోర పరాజయన్ని ఎదుర్కొన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. భారత్పై ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘంగా క్రీజ్లో నిలవకపోవడమే వారి ఓటమికి ప్రధాన కారణమని లీమన్ పేర్కొన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆసీస్ ఆడితేనే భారత్కు సరైన పోటీ ఇవ్వగలమని, లేని పక్షంలో మరోసారి ఘోర పరాభవం తప్పదంటూ హెచ్చరించాడు. 'స్వదేశంలో పాకిస్తాన్ జరిగిన టెస్టు  సిరీస్లో ఆసీస్ ఆకట్టుకుంది. ప్రధానంగా సిడ్నీలో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 135.0 ఓవర్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేసింది. అయితే ఇది మంచి ప్రదర్శనే. కానీ భారత్లో ఓవర్ రేట్ను మరింత పెంచుకోవాలి. కనీసం 150.0 ఓవర్లపాటు ఒక ఇన్నింగ్స్ ఆడితేనే భారీ స్కోరు వస్తుంది. అప్పుడే భారత్కు భారీ స్కోరును నిర్దేశించగలం. ప్రస్తుత యువ క్రికెటర్లకు ఇది ఒక ఛాలెంజ్.ఇక్కడ ఫిట్గా ఉండటంతో పాటు, సాధ్యమైనంతవరకూ ఎక్కువ సేపు క్రీజ్లో ఉండటానికి యత్నించండి'అని లీమన్ ఉపదేశం చేశాడు.

ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు పుణెలో ఫిబ్రవరి 23వ తేదీన జరుగనుంది. 2013లో చివరిసారి భారత్లో పర్యటించిన ఆసీస్.. ఆ సిరీస్ను 4-0 తేడాతో కోల్పోయింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement