Sakshi News home page

యాషెస్‌ ఆసీస్‌ వశమైంది

Published Tue, Dec 19 2017 12:25 AM

Australia wins third Test to reclaim the Ashes  - Sakshi

ఆస్ట్రేలియా  సొంతగడ్డపై  గర్జించింది. మూడో టెస్టుతోనే ‘యాషెస్‌’ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మిగిలిందల్లా క్లీన్‌స్వీపే! మిగతా రెండు టెస్టులను గెలిస్తే 5–0తో  సగర్వంగా ట్రోఫీని అందుకోవచ్చు.

పెర్త్‌: ఆస్ట్రేలియా జోరును వర్షం కూడా అడ్డుకోలేకపోయింది. చివరి రోజు వెస్టర్న్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌ (వాకా) గ్రౌండ్‌లో వాన చినుకులు, పిచ్‌ వివాదం ఆటకు అంతరాయం కలిగించాయి కానీ... ఆసీస్‌ విజయాన్ని మాత్రం ఆపలేకపోయాయి. దీంతో మూడో టెస్టులో స్మిత్‌ సేన ఇన్నింగ్స్‌ 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఆసీస్‌కిది వరుసగా మూడో విజయం. మరో రెండు టెస్టులు ఉండగానే ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను స్మిత్‌ బృందం 3–0తో కైవసం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌ ఈనెల 26 (బాక్సింగ్‌ డే టెస్టు) నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది.  సోమవారం 132/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 72.5 ఓవర్లలో 218 పరుగుల వద్ద ఆలౌటైంది. డేవిడ్‌ మలాన్‌ (135 బంతుల్లో 54; 8 ఫోర్లు) ఒక్కడే కుదురుగా ఆడగా... ప్రత్యర్థి  పేసర్‌ హాజల్‌వుడ్‌ (5/48) ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. మరో సీమర్‌ కమిన్స్, స్పిన్నర్‌ లయన్‌ చెరో 2 వికెట్లు తీశారు. డబుల్‌ సెంచరీతో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా సారథి స్టీవెన్‌ స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

నిప్పులు చెరిగిన హాజల్‌వుడ్‌  
వర్షంతో మ్యాచ్‌ ఆలస్యంగా మొదలైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌ స్టో (14)ను క్రితం రోజు స్కోరు వద్దే హాజల్‌వుడ్‌ బౌల్డ్‌ చేశాడు. తర్వాత మొయిన్‌ అలీ (14), వోక్స్‌ (22) అండతో మలాన్‌  అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే మలాన్‌ను కూడా హాజల్‌వుడ్‌ పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లండ్‌ కుప్పకూలేందుకు ఎంతో సేపు పట్టలేదు.

ఇక క్లీన్‌స్వీపే 
మా వాళ్లు అద్భుతంగా ఆడారు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు పోరాడినా... మా జోరు ముందు వాళ్ల ఆటలు సాగలేదు. ఇక క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెడతాం. పిచ్‌పై అంపైర్లు తీసుకున్న నిర్ణయం సరైందే. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదికైన పిచ్‌పై నీళ్లు నిలవడం సిగ్గుచేటు. ఆరేదాకా ఆట సాగదని అంపైర్లు స్పష్టం చేయడంలో తప్పులేదు.   
 – స్మిత్, ఆసీస్‌ కెప్టెన్‌ 

‘తడి ఆరని’ డ్రామా
నాలుగో రోజులాగే చివరి రోజు కూడా వర్షం ఆటకు అడ్డు పడింది. చినుకులు తెరిపినిచ్చినప్పటికీ ఆట కొనసాగలేదు.  తడి ఆరని పిచ్‌పై ఆడించలేమని ఫీల్డ్‌ అంపైర్లు గఫానే, ఎరాస్మస్‌ స్పష్టం చేయడంతో ‘వాకా’ గ్రౌండ్‌ సిబ్బంది అదే పనిగా వికెట్‌ను పొడి బార్చేందుకు చెమటోడ్చారు. దీంతో తొలి సెషన్‌ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. లంచ్‌ తర్వాత కూడా  ఆలస్యంగానే  ఆట ఆరంభమైంది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement