తేలిగ్గా తలొగ్గుతుందా?  | Sakshi
Sakshi News home page

తేలిగ్గా తలొగ్గుతుందా? 

Published Wed, Dec 5 2018 1:15 AM

Australian pace bowling very scandal - Sakshi

ఆస్ట్రేలియాతో సిరీస్‌ అంటే గతంలో మాటకు మాటతో మొదలయ్యేది. ఇప్పుడు దాని స్థానంలో ‘ఆట’ చర్చకు వస్తోంది. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో మైదానంలో కంటే ఆ జట్టు మానసికంగా ఎక్కువ కుదేలైంది. ఈ నేపథ్యంలో కంగారూలు బలహీన పడ్డారని, వారి సొంతగడ్డపై టీమిండియా తొలిసారి సిరీస్‌ నెగ్గేస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. మూలాలను విశ్లేషిస్తే మాత్రం ఇదేమంత సులువు కాదని తెలుస్తుంది. ఎందుకంటే...

సాక్షి క్రీడా విభాగం:సరిగ్గా రెండు నెలల క్రితం యూఏఈలో ఆస్ట్రేలియా–పాకిస్తాన్‌ టెస్టు మ్యాచ్‌. పరాజయం తప్పించుకోవాలంటే ఐదో రోజంతా ఆడాల్సిన పరిస్థితి ఆసీస్‌ది. అది కూడా మెరుగైన పాక్‌ బౌలింగ్‌ను కాచుకుంటూ! మిగతా జట్లయితే పరాజయం ఖాయం అనుకుని చేతులెత్తేసేవి. కానీ, కంగారూలు అదరలేదు. బెదరలేదు. ప్రత్యర్థి ఎంత గింజుకున్నా పట్టు వదల్లేదు. చివరకు ‘డ్రా’ చేసుకుని గాని మైదానం వీడలేదు. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ ఖాజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా ఆడగా, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ వీరోచితంగా నిలిచి పరాజయం తప్పించాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంత బలహీనపడినా... ఆస్ట్రేలియా తేలిగ్గా తలొగ్గదని చెప్పేందుకు ఈ తాజా ఉదాహరణ ఒక్కటి చాలు. తటస్థ వేదికపైనే ప్రత్యర్థిది పైచేయి కాకుండా చూసుకున్న ఆ జట్టు... సొంత గడ్డపై మరింత ధీమా గా ఆడుతుందనడంలో సందేహం లేదు.  

వారు లేకుంటేనేం..
పూర్తిగా కాకున్నా స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ లోటును భర్తీ చేయగల బ్యాట్స్‌మెన్‌ ఆసీస్‌కు ఉన్నారు. ఇందులో ఉస్మాన్‌ ఖాజా, షాన్‌ మార్‌‡్ష కీలకం కాగా, పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ అరోన్‌ ఫించ్, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్‌‡్ష నమ్మదగ్గవారు. ట్రావిస్‌ హెడ్‌ స్ట్రోక్‌ ప్లేయర్‌. పైన్‌ అచ్చమైన టెస్టు ఆటగాడు. అరంగేట్ర ఓపెనర్‌ మార్కస్‌ హ్యారిస్‌ ఇటీవల దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించి ఫామ్‌లో ఉన్నాడు. ఆగస్టులో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు సభ్యుడైన ఖాజా రెండు శతకాలు బాదాడు. అదే ఫామ్‌ను యూఏఈలోనూ కొనసాగించి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడి నిలకడకు మార్‌‡్ష సోదరుల ప్రతిభ తోడైతే జట్టుకు భారీ స్కోరు ఖాయం. వీరితో పాటు ఫించ్, హెడ్, హ్యారిస్‌ల అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటేనే టీమిండియాకు అవకాశాలుంటాయి. అయితే, గతంలో ఇక్కడ పర్యటించిన ఇషాంత్, షమీలకు తోడు భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ రూపంలో ఈసారి మరింత మెరుగైన పేస్‌ వనరులున్నందున కోహ్లి సేన ఏం చేస్తుందో చూడాలి. 

నిలవగలరా వీరి ధాటికి... 
మిషెల్‌ స్టార్క్, ప్యాట్‌ కమిన్స్, హాజల్‌వుడ్‌ వైవిధ్యమైన పేస్‌ త్రయం ఇది. యార్కర్లు, ఇన్‌ స్వింగర్లతో విరుచుకుపడే ఎడంచేతి వాటం స్టార్క్‌ ప్రపంచ స్థాయి బౌలర్‌. నాణ్యమైన బౌలరైన ఇతడిని దీటుగా ఎదుర్కొనగలిగే టెక్నిక్‌ భారత బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్‌ కోహ్లి ఒక్కడికే ఉంది. నిప్పులు చెరిగే స్టార్క్‌ బంతులు టీమిండియా ఓపెనర్లకు కఠిన సవాలే. రెండేళ్ల క్రితం పునరాగమనం చేసినప్పటి నుంచి కమిన్స్‌ పేస్‌ మరింత పదునెక్కింది. జట్టంతా తేలిపోయిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతడు విశేషంగా రాణించి మూడు టెస్టుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. పెర్త్‌లాంటి వేగవంతమైన పిచ్‌పై కమిన్స్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఇక హాజల్‌వుడ్‌ నిలకడైన వేగంతో పాటు కచ్చితమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను పరీక్షిస్తాడు. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌లో ఖాజాపై ఎంత అంచనాలున్నాయో బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌పై అంతే అంచనాలున్నాయి. 

చిన్నోడేనని చిన్నచూపొద్దు... 
ఆసీస్‌ జట్టులో అందరికంటే బలహీనంగా కనిపిస్తూ, పెద్దగా వార్తల్లోనూ నిలవని ఆటగాడు ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌. చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోయే అతడిని చిన్నచూపు చూస్తే పెద్ద దెబ్బ తినడం ఖాయం. గత పర్యటనలో అడిలైడ్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ప్రధాన బౌలర్లను దీటుగా ఎదుర్కొని విజయం దిశగా వెళ్తున్న భారత్‌ను లయన్‌ ఊహించని విధంగా కుప్పకూల్చాడు. కోహ్లి (141), విజయ్‌ (99), రహానే (0), రోహిత్‌ (6) సహా ఏకంగా ఏడుగురిని ఔట్‌ చేసి కంగారూలను గెలిపించాడు. దేశవాళీ, అంతర్జాతీయం కలిపి ఇటీవలి పది మ్యాచ్‌ల్లో ఒకటి, రెండింట్లో మినహా మిగతా వాటిలో లయన్‌ మూడు అంతకుపైనే వికెట్లు తీశాడు. ఈ విషయంలో భారత స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా అతడి ముందు దిగదుడుపే. మరి... గతం కంటే మరింత మెరుగైన లయన్‌ను ఈసారి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 

అప్పుడేం జరిగిందంటే... 
సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలో టీమిండియా 2003–04 సీజన్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. నాడు ఆసీస్‌ జట్టుకు తురుపుముక్కల్లాంటి పేసర్‌ మెక్‌గ్రాత్, స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ సేవలు సిరీస్‌ మొత్తానికి అందుబాటులో లేవు. నాలుగు టెస్టులకు గాను బ్రెట్‌లీ రెండే ఆడాడు. జాసన్‌ గిలెస్పీ, నాథన్‌ బ్రాకెన్‌లాంటి పేసర్లే వారికి పెద్ద దిక్కయ్యారు. అయినా సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లాంటి దిగ్గజాలున్న భారత్‌ను ఆస్ట్రేలియా నిలువరించింది. కొంత తడబడినా సిరీస్‌ను 1–1తో సమం చేసింది. దీన్నిబట్టి చెప్పేదేమంటే... ఆస్ట్రేలియా బయటకు ఎలాగైనా ఉండని, మైదానంలోకి దిగితే దాని ఆటే మారిపోతుంది.    

Advertisement
Advertisement