ఢిల్లీ ఏసర్స్‌ జోరు

9 Jan, 2017 00:17 IST|Sakshi
ఢిల్లీ ఏసర్స్‌ జోరు

స్మాషర్స్‌పై 5–2తో గెలుపు
చెన్నై పరువు నిలిపిన సింధు  
పీబీఎల్‌–2


బెంగళూరు: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–2)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఢిల్లీ ఏసర్స్‌ ధాటికి చెన్నై స్మాషర్స్‌ తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 5–2తో చెన్నైపై జయభేరి మోగించింది. ఒక్క చివరి మ్యాచ్‌ మినహా ఆరంభం నుంచి జరిగిన సింగిల్స్, మిక్స్‌డ్, పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లన్నీ ఏసర్స్‌ ఆటగాళ్లే గెలిచారు. ఢిల్లీ 5–0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న దశలో బరిలోకి దిగిన సింధు తమ ట్రంప్‌ మ్యాచ్‌లో గెలిచి చెన్నై స్మాషర్స్‌ పరువు నిలిపింది. ముందుగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో జాన్‌ ఒ జోర్గెన్సన్‌ (ఢిల్లీ) 10–12, 11–4, 11–6తో టామీ సుగియార్తో (చెన్నై)పై గెలిచాడు.

అనంతరం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వ్లాదిమిర్‌ ఇవనోవ్‌–గుత్తా జ్వాల (ఢిల్లీ) జోడీ 7–11, 11–4, 11–9తో క్రిస్‌ అడ్‌కాక్‌–సింధు (చెన్నై) జంటను కంగుతినిపించింది. పురుషుల సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లోనూ సన్‌ వాన్‌ హో (ఢిల్లీ) 12–10, 11–4తో పారుపల్లి కశ్యప్‌ (చెన్నై)పై గెలుపొందడంతో ఏసర్స్‌ ఆధిక్యం 3–0కు పెరిగింది. తర్వాత తమ ట్రంప్‌ మ్యాచ్‌లో ఢిల్లీ పురుషుల డబుల్స్‌ జంట ఇవనోవ్‌–సొజోనోవ్‌ జంట 11–6, 11–6తో క్రిస్‌ అడ్‌కాక్‌–మడ్స్‌ కోల్డింగ్‌ (చెన్నై) జోడీని ఓడించింది. దీంతో మరో 2 పాయింట్లు ఏసర్స్‌ ఖాతాలో చేరాయి. చివరగా జరిగిన చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌లో సింధు 11–6, 11–7తో తన్వీ లాడ్‌ (ఢిల్లీ)పై గెలిచి చెన్నైకి ఊరటనిచ్చింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో అవ«ద్‌ వారియర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్‌ తలపడుతుంది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు