వందో టెస్టులో అదుర్స్ | Sakshi
Sakshi News home page

వందో టెస్టులో అదుర్స్

Published Sun, Mar 19 2017 4:07 PM

వందో టెస్టులో అదుర్స్ - Sakshi

కొలంబో: సంచలన విజయాలకు మారుపేరైన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తమ చారిత్రక టెస్టులో అదుర్స్ అనిపించింది. శ్రీలంకతో జరిగిన వందో టెస్టులో బంగ్లాదేశ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించి తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లా విజయంలో  తమీమ్ ఇక్బాల్(82), షబ్బిర్ రెహ్మాన్(41),కెప్టెన్ ముష్ఫికర్  రహీమ్(22 నాటౌట్) ముఖ్య  భూమిక పోషించారు.


అంతకుముందు 268/8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 319 పరుగుల వద్ద ఆలౌటైంది. కరుణ రత్నే(126), పెరీరా(50), లక్మాల్(42)లు ఆకట్టుకున్నారు.  దాంతో  సాధారణ లక్ష్యాన్ని మాత్రమే బంగ్లాకు నిర్దేశించింది.  ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ తొలుత తడబడింది. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన క్రమంలో తమీమ్ ఇక్బాల్ ఆదుకున్నాడు. మూడో వికెట్ కు షబ్బిర్ రెహ్మాన్ తో కలిసి 109 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత తమీమ్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత మిగతా పనిని షబ్బిర్, ముష్ఫికర్ లు పూర్తి చేశారు. ఈ తాజా విజయంతో రెండు టెస్టుల సిరీస్ సమం అయ్యింది. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

Advertisement
Advertisement