బంగ్లాదేశ్‌ చేజింగ్‌ రికార్డు | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ చేజింగ్‌ రికార్డు

Published Sun, Mar 11 2018 11:09 AM

Bangladesh pull off record chase against Sri Lanka - Sakshi

కొలంబో: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్ లో సంచలన విజయం నమోదైంది. శనివారం శ్రీలంక నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలీలగా చేధించిన బంగ్లాదేశ్‌ ‘టైగర్స్’ అన్న పేరుకు అతికినట్లు సరిపోతామని నిరూపించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసి 214 పరుగుల భారీ స్కోర్ ను చేసిన తర్వాత ఎవరైనా శ్రీలంక విజయాన్ని ఖరారు చేసుకుంటారు.

అది కూడా ప్రత్యర్ధి బంగ్లాదేశ్‌ కావడంతో, మరో ఆలోచనకు తావివ్వకుండా శ్రీలంకదే విజయమని అంతా భావించి ఉంటారు. కానీ బంగ్లాదేశ్‌ దాన్ని తలకిందులూ చేస్తూ.. చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. ఇక్కడ బంగ్లా ఓపెనర్‌ లిటాన్‌ దాస్‌ 19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో అదిరిపోయే ఆరంభం ఇవ్వగా, వికెట్‌ కీపర్‌ ముష్పికర్‌ రహీమ్‌ అద్భుతమైన ముగింపు ఇచ్చాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 72 పరుగులతో అజేయంగా నిలిచి ఇంకా రెండు బంతులుండగానే బంగ్లాకు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.

ఇది టీ 20ల్లో బంగ్లాదేశ్‌కు అత్యుత్తమ రికార్డు ఛేదన కాగా, ఓవరాల్‌ అంతర్జాతీయ టీ 20ల్లో నాల్గో సక్సెఫుల్‌ ఛేజింగ్‌ రికార్డుగా నమోదైంది. అంతకుముందు ఇదే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల ఛేజింగ్‌ కాగా,  వెస్టిండీస్‌(2015లో దక్షిణాఫ్రికా) 232 పరుగుల చేజింగ్‌తో రెండో స్థానంలో, ఇంగ్లండ్‌(2016లో దక్షిణాఫ్రికాపై) 230 పరుగుల్ని ఛేజ్‌ చేసి మూడో స్థానంలో ఉన్నాయి.  ఇదిలా ఉంచితే, భారత జట్టు టీ 20 సక్సెస్‌ఫుల్‌ ఛేజింగ్‌ 211 పరుగులు. 2009లో శ్రీలంకపై 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు  ఇది సాధించింది. కాగా, టీ 20ల్లో భారత జట్టు చేజింగ్‌ చేస్తూ నమోదు చేసిన అత్యుత్తమ స్కోరు 244.  2016లో వెస్టిండీస్‌ విసిరిన 246 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించే క్రమంలో భారత జట్టు పరుగు తేడాతో ఓటమి పాలైంది.

Advertisement
Advertisement