మరోసారి బంగ్లాలోనే ఆసియా కప్ | Sakshi
Sakshi News home page

మరోసారి బంగ్లాలోనే ఆసియా కప్

Published Thu, Oct 29 2015 7:59 PM

గతేడాది ఆసియా కప్ ను గెలిచిన శ్రీలంక జట్టు(ఫైల్)

ఢాకా: మరోసారి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఆతిథ్యాన్నిబంగ్లాదేశ్ దక్కించుకుంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఆసియా కప్ క్రికెట్ టోర్నీని నిర్వహించిన బంగ్లాదేశ్.. మరోసారి ఈ టోర్నీ నిర్వహణకు సిద్ధమైంది.  ఈ మేరకు మంగళవారం సింగపూర్ లో జరిగిన సమావేశంలో సభ్యల దేశాల నుంచి బంగ్లాకు మద్దతు లభించింది.  తొలుత బంగ్లా పేరును పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు సభ్య దేశాలు అంగీ్కారం తెలిపాయి.  దీంతో బంగ్లాదేశ్  ఐదోసారి ఆసియా కప్ నిర్వహిస్తున్నట్లు అవుతుంది.  బంగ్లాదేశ్ తొలిసారి 1988 లో ఆసియా కప్  ను నిర్వహించింది.

 

ఈ టోర్నీలో టెస్టు హోదా కల్గిన భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లతో పాటు ఒక అసోసియేట్ దేశం కూడా  పాల్గొంటుంది.  దీనిలో భాగంగా  నవంబర్ లో జరిగే  క్వాలిఫయింగ్  టోర్నమెంట్ లో అసోసియేట్ దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, ఓమాన్, హాంకాంగ్, యూఏఈ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.  ఇందులో అర్హత సాధించిన ఒక జట్టు..  ఐదో జట్టుగా ఆసియా కప్ బరిలో దిగుతుంది.  ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వ తేదీ మొదలుకొని మార్చి 6 వ తేదీ వరకూ జరుగనుంది.  సరిగ్గా ట్వంటీ 20 వరల్డ్ కప్ కు ప్రారంభం కావడానికి ఐదు రోజుల ముందు ఆసియా కప్ ముగియనుంది. గతేడాది ఆసియా కప్ ను శ్రీలంక చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement