ఇప్పటికీ కూనలే...! | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ కూనలే...!

Published Tue, Mar 14 2017 11:57 PM

ఇప్పటికీ  కూనలే...!

100వ టెస్టు ఆడనున్న బంగ్లాదేశ్‌ 
నేటి నుంచి శ్రీలంకతో మ్యాచ్‌   

‘తొలిసారి ఇద్దరు బెంగాలీలు ఒకే టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న వేళ, మనకందరికీ ఇది పండుగ సమయం’... 2000లో నవంబర్‌లో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌ దేశమంతా కనిపించిన బ్యానర్లు ఇవి. ఆ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌కు తొలి టెస్టు కాగా, సౌరవ్‌ గంగూలీకి కూడా కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.

నిజంగా కూడా ఆ జట్టు, అభిమానులకు సంబంధించి అదో చారిత్రక ఘట్టం, చిరస్మరణీయ క్షణం. ఇది జరిగి 16 ఏళ్ల నాలుగు నెలలు దాటింది. కానీ ఇన్నేళ్లలో ఆ జట్టు టెస్టు క్రికెట్‌ ఆటతీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి... అన్న చందంగానే ఉండిపోయింది. ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయిన బంగ్లా టైగర్స్‌ ఇప్పుడు తమ 100వ టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు సన్నద్ధమయ్యారు.
 


కొలంబో: 99 టెస్టులలో కేవలం 8 విజయాలు... ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ సాధించిన ఘనత ఇది. ఏకంగా 76 పరాజయాలతో ఆ జట్టు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ఇతర జట్లతో పోలిస్తే అత్యంత వేగంగా వంద టెస్టుల మైలురాయికి చేరుకున్న బంగ్లా, ఆటలో మాత్రం ఆ జోరును చూపించలేకపోతోంది. వన్డేలు, టి20ల్లో అప్పుడప్పుడు సంచలన విజయాలతో ఆకట్టుకుంటున్నా... టెస్టుల వద్దకు వచ్చేసరికి బంగ్లా పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఆ జట్టు సాధించిన 8 విజయాల్లో 5 తమకంటే బాగా బలహీనమైన జింబాబ్వేపై రాగా, ప్రభ కోల్పోయి దైన్యంగా మారిపోయిన స్థితిలో ఉన్న వెస్టిండీస్‌పై 2 విజయాలు దక్కాయి. ఇటీవలే ఇంగ్లండ్‌పై సాధించిన విజయం ఒక్కటే బంగ్లాదేశ్‌ సంబరాలు చేసుకునేందుకు సరిపోయింది. ఇది మినహా మరో పెద్ద జట్టుపై గెలవలేకపోయింది.

ఈ బలహీనతను అధిగమించడంలో బంగ్లా విఫలమవుతోంది. పెద్ద జట్లతో ఎక్కువ మ్యాచ్‌లలో తలపడే అవకాశం రాకపోవడం, దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నాణ్యత లేకపోవడం కూడా అందుకు కారణం. ఇన్నేళ్లలో షకీబ్, తమీమ్, ముష్ఫికర్‌లాంటి కొందరు క్రికెటర్లు మాత్రం వ్యక్తిగతంగా తమదైన ముద్ర వేయడంలో సఫలమయ్యారు. అయితే జట్టు ఎలాంటి పరాజయాలు ఎదుర్కొంటున్నా, ఏ మాత్రం తమ ఆశలు నిలబెట్టకపోయినా ఆ దేశ వీరాభిమానులు మాత్రం తమవాళ్లను అక్కున చేర్చుకుంటూనే ఉన్నారు. అభిమానుల ఆదరణే బంగ్లా క్రికెట్‌ను బతికిస్తోందనేది వాస్తవం.

బ్యాటింగ్‌లో నిలకడ, ప్రతిభావంతులైన బౌలర్లు వెలుగులోకి రావడంతో ఇటీవల జట్టు ప్రదర్శన కాస్త మెరుగుపడింది. అయితే విదేశాల్లో ఒక భారీ టెస్టు విజయం సాధించి మేమూ పోటీలో ఉన్నామని గుర్తు చేయాల్సిన బాధ్యత ఆ జట్టుపై ఉంది. శ్రీలంకతో సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టును కోల్పోయి 0–1తో వెనుకబడిన బంగ్లా, బుధవారం నుంచి జరిగే తమ వందో టెస్టులో ఎలాంటి ఫలితం సాధిస్తుందనేది ఆసక్తికరం. 

Advertisement
Advertisement