రాహుల్ ద్రవిడ్ కు డబుల్ బొనాంజా! | Sakshi
Sakshi News home page

రాహుల్ ద్రవిడ్ కు డబుల్ బొనాంజా!

Published Sun, Jul 2 2017 3:39 PM

రాహుల్ ద్రవిడ్ కు డబుల్ బొనాంజా!

న్యూఢిల్లీ: భారత్‌ ‘ఎ’, అండర్‌–19 క్రికెట్‌ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలాన్ని బీసీసీఐ మరో రెండేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు మెంటార్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. భారత క్రికెట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నందుకుగానూ ద్రవిడ్ వార్షిక పారితోషికాన్ని రెట్టింపు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. భారత్‌ ‘ఎ’, అండర్‌–19 క్రికెట్‌ జట్ల కోచ్‌గా గతంలో రూ.2.4 కోట్లు అందుకున్న ద్రవిడ్ తర్వాతి కాంట్రాక్టులో ఇంతకు రెట్టింపు ఫీజు (రూ.5కోట్లు)ను అందుకోబోతున్నాడు. బీసీసీఐ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. భారీ పారితోకానికి ద్రవిడ్ అర్హుడేనని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) కలిగి ఉన్నాడని ద్రవిడ్ పై విమర్శలు రాగా, కొంతకాలం పాటు ఐపీఎల్ జట్టుగా మెంటార్, కోచ్ గా ఉంటేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు లేకపోవడం, అతడి కాంట్రాక్టు ముగియడంతో భారత్-ఏ, అండర్-19 జట్లకు మరోసారి పూర్తిస్థాయి శిక్షణ కోసం ఢిల్లీ జట్టు మెంటార్ బాధ్యతలకు స్వస్తి పలికిన విషయం తెలసిందే. తొలిసారిగా 2015లో భారత యువజట్లకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో.. మరో రెండేళ్లపాటు కోచ్‍ గా కొనసాగించనున్నట్లు ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ద్రవిడ్ శిక్షణలో కుర్రాళ్లు అండర్‌–19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచారు. మరోవైపు భారత్‌ ‘ఎ’  నాలుగు దేశాల సిరీస్‌లో విజేతగా నిలపడంతో ద్రవిడ్ పై నమ్మకం రెట్టింపయింది.

Advertisement
Advertisement