ఏడాదికి రెండు ఐపీఎల్‌ లీగ్‌లు | Sakshi
Sakshi News home page

ఏడాదికి రెండు ఐపీఎల్‌ లీగ్‌లు

Published Thu, Jun 29 2017 3:14 PM

ఏడాదికి రెండు ఐపీఎల్‌ లీగ్‌లు

న్యూఢల్లీ‌: క్రికెట్‌ లీగుల్లో ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. అటు ఆటగాళ్లకు, ఇటు బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తోంది. భారత్‌లో నిర్వహించే ఈ టోర్నీ క్రికెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ టోర్నీని చూడటానికి పలు దేశాలనుంచి క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తునే వస్తారు.  ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మినీ ఐపీఎల్‌ టోర్నీని ప్రవేశపెట్టే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న ఐపీఎల్‌ని ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహించడం సబబుకాదని ఐపీఎల్‌ చీఫ్‌ రాజీవ్‌ శుక్లా అన్నారు.

గతంలో నిర్వహించిన ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 ఫెయిల్‌ అవడంతో, ఇప్పుడు ఆ స్థానంలో ఈ మినీ ఐపీఎల్‌ ప్రవేశపెట్టాలని బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.  ప్రస్తుతం మినీ ఐపీఎల్‌ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయని,  త్వరలోనే మినీ ఐపీఎల్‌ టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తామని  రాజీవ్‌ తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే దుబాయ్‌లో మినీ ఐపీఎల్‌  నిర్వహించే అవకాశం ఉందని రాజీవ్‌ అభిప్రాయపడ్డారు.

అంతే కాకుండా అభిమానుల రెట్టింపు ఆనందం  కోసం​ 2018లో జరగనున్న ఐపీఎల్‌లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. రానున్న పది ఏళ్లలో ఐపీఎల్‌ మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా, ఆకట్టుకునేలా ప్రణాళికలు చేస్తున్నట్లు శుక్లా తెలిపారు. ఫ్రాంచైజీ జట్టు, బీసీసీఐతో ఆదాయాన్ని పంచుకునే విధానం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఐపీఎల్‌-11వ సీజన్‌లో 8 జట్లే ఆడతాయని తెలిపారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ లాంటి టోర్నీకి ముందు ఐపీఎల్‌ ఆడటం ఆటగాళ్లకు ఎంతో లాభించిందని, ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకుని టోర్నీలో పాల్గొన్నారని శుక్లా తెలిపారు.

Advertisement
Advertisement