Sakshi News home page

ఇదంతా ఆయన నిర్వాకమే!

Published Tue, Apr 28 2015 1:13 AM

ఇదంతా ఆయన నిర్వాకమే!

ఐసీసీ చైర్మన్‌పై అనురాగ్ ఠాకూర్ ధ్వజం  
ఘాటుగా లేఖ రాసిన బోర్డు కార్యదర్శి

 
న్యూఢిల్లీ: బీసీసీఐపై ఆధిపత్యం ప్రదర్శించే క్రమంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. తాను బుకీలతో సన్నిహితంగా ఉంటున్నానని, జాగ్రత్త పడాలంటూ ఐసీసీ రాసిన లేఖపై బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మండి పడ్డారు. ఇదంతా ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆదేశాలతోనే జరిగిందని ఆయన అన్నారు. శ్రీని సన్నిహితుడిని ఓడించి తాను కార్యదర్శి కావడం ఆయన ఇప్పటికీ జీర్ణించు కోలేకపోతున్నారని బీజేపీ ఎంపీ కూడా అయిన ఠాకూర్ విమర్శించారు. తనపై వచ్చిన విమర్శలకు సమాధానంతో పాటు ప్రతివిమర్శ చేస్తూ శ్రీనివాసన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

‘అనుమానిత బుకీ అంటూ ఐసీసీ చెబుతున్న కరణ్ గిల్హోత్రా పంజాబ్ తదితర రాష్ట్రాలలో అటు రాజకీయాల్లోనూ, ఇటు క్రికెట్‌లోనూ చురుకైన వ్య క్తిగా నాకు తెలుసు. అతను బుకీగా నిర్వహించే కార్యకలాపాలు ఏమిటో నాకు తెలీదు. అయినా ఐసీసీ లేఖలో కూడా నిర్ధారణ కాని సమాచారం అంటూ అనుమానంగానే రాశారు. మీరు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను బోర్డు సంయుక్త కార్యదర్శిగా కూడా పని చేశాను. దయచేసి మీ బోర్డు సహచరులకు ‘అనుమానితుల’ జాబితా ఇస్తే బాగుండేది. అప్పుడు వారి నుంచి దూరంగా ఉండేందుకు అవకా శం ఉంటుంది’ అని ఠాకూర్ అన్నారు.  నీరజ్ గుండే అనే వ్యక్తి శ్రీనివాసన్ తరఫున ఢిల్లీలో ఆయన ప్రత్యర్థులపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అనురాగ్ ఆరోపించారు. బుకీల సమాచారం బోర్డు సభ్యులతోనే కాదు... తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవాలని గురునాథ్ మెయప్పన్ తదితరులను ఉద్దేశించి ఠాకూర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
 
బోర్డులో చర్చ లేదు!

మరోవైపు ఠాకూర్‌కు బుకీలతో స్నేహంపై వచ్చిన వార్తలపై స్పందించరాదని బీసీసీఐ నిర్ణయించింది. చెన్నై జట్టు విలువ వివాదం చర్చకు వచ్చిన నేపథ్యంలో ప్రతిదాడిగా  ఐసీసీ ద్వారా శ్రీనివాసన్ ఈ లేఖ రాయించారని బోర్డు భావిస్తోంది. ‘ఐసీసీని ఎవరు నడిపిస్తున్నారో అందరికీ తెలుసు. ఆయన ఠాకూర్ పేరు ప్రతిష్టలు దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు వర్కింగ్ కమిటీలో దీనిపై అసలు చర్చించలేదు. ఇకపై కూడా ఎలాంటి చర్యా తీసుకో ము’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
 
అవసరమైతే నేనూ లేఖ రాస్తా!

మరోవైపు అనురాగ్ ఠాకూర్ లేఖపై శ్రీనివాసన్ స్పందించారు. అవసరమైతే తాను కూడా ఠాకూర్‌కు వ్యక్తిగతంగా లేఖ రాస్తానని... మీడియాలో వ్యాఖ్యలు చేయడం, ప్రతివ్యాఖ్యలు చేయడం అనవసరమని ఆయన అన్నారు. ‘మీడియాలో వచ్చిన ఠాకూర్ లేఖను నేనూ చూశాను. ఆయనేదో రాసుకొచ్చారు. అయితే దీనికి మళ్లీ మీడియా ద్వారా స్పందించడం సరైంది కాదు. నిజంగా దానిపై స్పందించాల్సిన అవసరం ఉంటే నేరుగా అతనికే లేఖ రాస్తాను’ అని స్పష్టం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement