కోచ్ కావలెను.. హిందీ రావలెను! | Sakshi
Sakshi News home page

కోచ్ కావలెను.. హిందీ రావలెను!

Published Thu, Jun 2 2016 9:34 AM

కోచ్ కావలెను.. హిందీ రావలెను!

టీమిండియా కోచ్‌గా పగ్గాలు చేపట్టేందుకు తగిన అర్హతలున్న అభ్యర్థులు కావాలంటూ బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యదేశం నిర్వహించిన సర్టిఫికేషన్ పరీక్ష పాసై, సర్టిఫికెట్ ఉన్నవాళ్లు అర్హులని అందులో తెలిపింది. అయితే.. భారతజట్టు తరఫున ఇంతకుముందు ఆడిన వాళ్లయితే ఇలాంటి సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదని చెప్పింది. దాంతో టీమిండియా మాజీ కెప్టెన్లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ లాంటివాళ్లకు మార్గం సుగమమైంది. ఐసీసీ సభ్యదేశాలలో ఏదైనా జట్టుకు ఫస్ట్‌క్లాస్ లేదా అంతర్జాతీయ స్థాయిలో విజయవంతంగా కోచ్ పదవి నిర్వహించి ఉండాలని కూడా బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది.

వీటన్నింటితో పాటు.. కోచ్‌గా వచ్చేవాళ్లు క్రీడాకారులతో మంచి ఇంగ్లిషులో చెప్పగలిగేలా ఉండాలని పేర్కొంది. దాంతోపాటు హిందీలోను, ఇతర ప్రాంతీయ భాషల్లోను కూడా మాట్లాడగలిగి ఉంటే మంచిదని చెప్పింది. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలోను (టెస్టు, వన్డే, టి20) టీమిండియాకు సమర్థ నాయకత్వం అందించాలని, ఆటగాళ్ల వ్యక్తిగత పెర్ఫార్మెన్సును అంచనా వేయడంతో పాటు బోర్డుకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని, బోర్డు మొత్తం జట్టు సామర్థ్యాన్ని అంచనా వేస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. టీమిండియాను అగ్రస్థానానికి చేర్చేందుకు కావల్సిన అన్ని ప్రణాళికలు రచించాలని చెప్పారు. అయితే.. ఇంతకుముందు గానీ, ఇప్పుడు గానీ సదరు అభ్యర్థి ఐసీసీ, దాని అనుబంధ బోర్డుల సభ్య దేశాలతో ఎలాంటి వివాదాల్లోను ఉండి ఉండకూడదని, రికార్డు క్లీన్‌గా ఉండాలని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement