ప్రతిసారీ పైచేయే! | Sakshi
Sakshi News home page

ప్రతిసారీ పైచేయే!

Published Fri, Mar 18 2016 12:03 AM

ప్రతిసారీ పైచేయే!

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటివరకూ ఏడు టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఆరుసార్లు గెలిస్తే పాక్ ఒక్కటి నెగ్గింది. అయితే వన్డే ప్రపంచకప్ తరహాలోనే టి20 ప్రపంచకప్‌లలోనూ భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనూ దాయాదిని చిత్తుచేసింది. మరోసారి ఈ రెండు దేశాల మధ్య రేపు (శనివారం) మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... టి20 ప్రపంచకప్‌లలో భారత్, పాక్ పోరులను ఒకసారి గుర్తు చేసుకుందాం.  
 
బౌల్ ‘అవుట్’  - 13 సెప్టెంబర్, 2007 (డర్బన్)
 మొదటి టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉతప్ప (50), ధోని (33) రాణించడంతో భారత్ 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. అనంతరం పాక్  7 వికెట్లకు సరిగ్గా 141 పరుగులే చేసింది. దీంతో ఫలితం కోసం బౌల్ అవుట్ పద్దతిని అనుసరించారు. దీనిని ఆటగాళ్లకు వివరించడం కూడా అప్పట్లో అంపైర్లకు పెద్ద పరీక్షలా మారింది. ముగ్గురు భారత బౌలర్లు హర్భజన్, సెహ్వాగ్, ఉతప్ప నేరుగా బౌలింగ్ చేసి స్టంప్స్‌ను పడగొట్టగా... పాక్ తరఫున అరాఫత్, గుల్, ఆఫ్రిది విఫలమయ్యారు. దాంతో 3-0తో చిరస్మరణీయ విజయం భారత్ సొంతమైంది. కెప్టెన్‌గా ధోని కెరీర్‌లో ఇదే మొదటి విజయం కావడం విశేషం.

టి20ల్లో కొత్త అధ్యాయం -24 సెప్టెంబర్, 2007 (జొహన్నెస్‌బర్గ్)
 
  
భారత్, పాక్ ఓ ప్రపంచకప్ మ్యాచ్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కూడా అనూహ్య మలుపులు తిరుగుతూ సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. గంభీర్ (75)కి రోహిత్ (30 నాటౌట్) అండగా నిలిచాడు. 2 వికెట్లు కోల్పోయినా 33 బంతుల్లో 53 పరుగులు చేసి పాక్ జోరుగా దూసుకుపోయింది. ఈ దశలో నజీర్‌ను ఉతప్ప అద్భుతంగా రనౌట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.  ఒత్తిడిలో పడి పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా (43) జట్టును గెలిపించేలా కనిపించాడు. చివరి 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో జోగీందర్ బౌలింగ్‌లో మిస్బా కొట్టిన స్కూప్ షాట్ టి20 క్రికెట్‌కు కొత్త అధ్యాయం సృష్టించింది. ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌తో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
 

పూర్తిగా ఏకపక్షం  - 30 సెప్టెంబర్, 2012 (కొలంబో)
    
 
శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో భారత్ పూర్తి సాధికారతతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 2 బంతులు మిగిలి ఉండగా 128 పరుగులకే ఆలౌటైంది. బాలాజీ  3 వికెట్లు తీశాడు. అనంతరం విరాట్ కోహ్లి (78 నాటౌట్) దూకుడుతో మూడు ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లకు 129 పరుగులు చేసి భారత్ ఏకపక్ష విజయం సాధించింది.
 

మరోసారీ అలవోకగా... -21 మార్చి, 2014 (మిర్పూర్)
     

బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో ఎక్కడా కనీస పోటీ కూడా కనిపించకుండా పాక్‌పై భారత్ మరోసారి అలవోకగా గెలిచింది. ముందుగా పాక్ 7 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపు సొంతం చేసుకుంది. 2 కీలక వికెట్లు తీసిన అమిత్ మిశ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Advertisement
Advertisement