మాటల ‘మాంత్రికుడు’

20 Apr, 2016 08:35 IST|Sakshi
మాటల ‘మాంత్రికుడు’

కామెంటరీలో స్టార్ హర్షా భోగ్లే
క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు
ఐపీఎల్‌లో వినిపించని గొంతు

 
అతని మాటల్లో మత్తు ఉంటుంది, మండే స్వభావం ఉంటుంది... పదాల రసాయనం ఎంత మోతాదులో కలిపితే పేలుతుందో, పరిమితుల్లో ఉంటుందో అతనిలోని కెమికల్ ఇంజినీర్‌కు బాగా తెలుసు.  ఎలా మాట్లాడితే ప్రేక్షకులకు చేరువవుతామో, అక్షరాల అల్లికతో ఏ విధంగా ఒక కార్యక్రమాన్నిహిట్ చేయవచ్చో అతనికి బాగా తెలుసు.

దానికి మార్కెటింగ్ రంగు అద్ది సక్సెస్‌ఫుల్‌గా మార్చడంలో అతనిలోని ఐఐఎం విద్యార్థి తెలివితేటలు కనిపిస్తాయి.నాకు క్రికెట్ పరిజ్ఞానం ఉన్నా అతనితో మాట్లాడితే ఇంకేదో కొత్త విషయం తెలుస్తుంది’ అంటూ స్వయంగా సచిన్ నుంచి ప్రశంసలు అందుకున్నా... అది హర్షాభోగ్లేకే సాధ్యమైంది. అందుకే కావచ్చు ఒక్క టోర్నీకి అతడిని దూరం పెట్టగానే ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడి అతనికి మద్దతుగా నిలిచింది.
 
 
సాక్షి, హైదరాబాద్:
‘లార్డ్స్ మైదానంలో సచిన్ సెంచరీ చేయలేదు నిజమే. కానీ దాని వల్ల అక్కడి ఆనర్స్ బోర్డ్‌కే నష్టం తప్ప సచిన్‌కు కాదు’... ‘ఈ రోజు సెహ్వాగ్ అదృష్టం ఎలా ఉందంటే గంతలు కట్టుకొని హైవేపై వెళ్ళినా యాక్సిడెంట్ జరగదు’... ‘అవతలి ఎండ్‌కి చేరాలనే రూల్ ఉంది కాబట్టి గేల్ సింగిల్ తీస్తున్నాడు తప్ప లేదంటే అక్కడే ఉండిపోయేవాడు’... హర్షా భోగ్లే మాటల చాతుర్యానికి ఈ వ్యాఖ్యలు మచ్చుతునకలు. అతను గవాస్కర్‌లా ఆటలో అణువణువు విశ్లేషించే రకం కాదు. శాస్త్రిలా మైక్ బద్దలయ్యేలా అరవడు. చెప్పదల్చుకున్న అంశంలో స్పష్టత ఉంటుంది. విఫలమైన ఆటగాడిని కూడా ఏకిపారేయకుండా సున్నితమైన మందలింపు తరహాలోనే వ్యాఖ్య చేస్తాడు. ఈ శైలే అతడిని అందరిలోకి ప్రత్యేకంగా నిలబెట్టింది. క్రికెటర్ కాని కామెంటేటర్లలో నంబర్‌వన్‌ను చేసింది.


 భారత క్రికెట్‌లో భాగం
 క్రికెట్‌ను అభిమానించే అందరికీ హర్షా భోగ్లే గొంతు సుపరిచితం. ఆటగాడిగా మైనర్ స్థాయి క్రికెట్‌కే పరిమితమైనా... మాటగాడిగా పలువురు దిగ్గజాలతో పోటీ పడుతూ తనదైన ముద్ర వేసిన అతను, కామెంటరీ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. దూరదర్శన్‌ను దాటి క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారం ఈఎస్‌పీఎన్‌లో మొదలైనప్పుడు తొలి కామెంటరీ బృందంలో సభ్యుడిగా అడుగు పెట్టిన తర్వాత... నాటినుంచి నేటి వరకు అతని మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇన్నేళ్లలో భారత క్రికెట్‌లో భాగంగా మారిపోయాడు. చాలా మంది ఆటగాళ్లకంటే అతనికి పాపులార్టీ ఎక్కువ. పెప్సీ, హోండా, ఎయిర్‌టెల్‌లాంటి ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్లో మిలియన్‌కు పైగా ఫాలోయర్లు ఉన్న ఏకైక బ్రాడ్‌కాస్టర్ కావడం అతని పాపులార్టీకి నిదర్శనం.


 అవార్డులు, రివార్డులు
 క్రికెట్‌లో గణాంకాలు, రికార్డులకు ఉండే విలువే వేరు. ఆ రకంగా చూస్తే హర్ష కూడా ఎన్నో ఘనతలు సాధించాడు. 100కు పైగా టెస్టులు, 400కు పైగా వన్డేలకు కామెంటరీ చేసిన అతను టి20 క్రికెట్ పుట్టిన దగ్గరినుంచి దాదాపు ప్రతీ చోట, అన్ని ప్రపంచ కప్‌లలో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కూడా ఆరంభంనుంచి ఉన్న అతడిని ఈ సీజన్‌కు మాత్రం అనూహ్యంగా తొలగించారు. క్రికెట్ మాత్రమే కాదు, విద్యార్థుల కోసం క్విజ్ నిర్వహణ, ట్రావెలింగ్‌కు సంబంధించిన షో... ఇలా ఎన్నో కార్యక్రమాల్లో అతను రాణించాడు. ఇక వేర్వేరు చానల్స్, సైట్‌ల ద్వారా లెక్కలేనన్ని సార్లు ఫేవరేట్ కామెంటేటర్ అవార్డులు అందుకున్నాడు. క్రికెటర్ కాకుండానే క్రికెట్‌లో సూపర్ స్టార్ స్థాయికి అతను ఎదిగాడని చెప్పడంలో సందేహం లేదు.


 సీజన్ నుంచి అవుట్
ఐపీఎల్-9 ప్రచార వీడియోలో ఉన్నాడు, ఆ తర్వాత మ్యాచ్‌ల కోసం ఫ్లయిట్ టికెట్లు కూడా పంపించారు. కానీ భోగ్లేకు కారణం చెప్పకుండానే కామెంటరీ బృందంనుంచి తప్పిస్తున్నట్లు సమాచారం అందించారు. సరిగ్గా కారణమేమిటో బీసీసీఐ చెప్పలేదు. అతను కూడా తనకేమీ తెలీదని చెప్పుకున్నాడు. కానీ వరల్డ్ కప్ సందర్భంగా మన కామెంటేటర్లు ప్రత్యర్థి జట్లకు మద్దతుగా మాట్లాడుతున్నారని నటుడు అమితాబ్ బచ్చన్ బహిరంగంగా వ్యాఖ్యానించడం, ఈ అభిప్రాయానికి ధోని కూడా మద్దతు పలకడం కారణమని వినిపిస్తోంది. మరో వైపు నాగ్‌పూర్ మ్యాచ్ సందర్భంగా విదర్భ క్రికెట్ సంఘం అధికారితో వాదన జరగడం శశాంక్ మనోహర్ ఆగ్రహానికి కారణమైందని కూడా తెలిసింది. అయితే అతడిని తప్పించిన రోజున క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం భోగ్లేకు అండగా నిలిచారు.

రాజకీయాలతో ఒక మంచి వ్యక్తిని ఎలా తప్పిస్తారంటూ తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఒక కామెంటేటర్‌కు ఈ స్థాయిలో మద్దతు దక్కడం అనూహ్యం . అది భోగ్లే గొప్పతనం. ఈ ఐపీఎల్‌కు అతను దూరమైనా భోగ్లేలాంటి వ్యాఖ్యాతను ఏ చానల్ కూడా కావాలని పక్కన పెట్టదు. కాబట్టి ఇక ముందు సిరీస్‌లలో అతని గొంతు మళ్ళీ వినిపించడం ఖాయం.
 
 మన హైదరాబాదీయే...
మరాఠీ కుటుంబానికి చెందిన 55 ఏళ్ల హర్షా భోగ్లే స్వస్థలం హైదరాబాద్. బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో చదివిన అతను... నగరంలోనే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్‌లో పీజీ చేశాడు. అవకాశం వచ్చినప్పుడల్లా నగరంలో  వేర్వేరు కార్యక్రమాల నిర్వహణ ద్వారా  అతను భాగ్యనగరంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తుంటాడు. ‘చైల్డ్ ఆఫ్ డెస్టినీ’ పేరుతో అజహరుద్దీన్ జీవిత చరిత్రను రాసింది ఇతనే. ఆ తర్వాత అతని వ్యాసాల సంకలనం ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ పేరుతో పుస్తకంగా వచ్చింది. తన భార్యతో కలిసి ‘విన్నింగ్ వే’ అనే పుస్తకాన్ని కూడా రచించిన భోగ్లే... ప్రస్తుతం కామెంటరీతో పాటు పలు కార్పొరేట్ సంస్థల్లో మేనేజర్లకు క్రీడా పాఠాలు కూడా చెబుతుంటాడు.

మరిన్ని వార్తలు