బాలీవుడ్ హిట్ ఫార్ములా

22 Dec, 2015 01:27 IST|Sakshi
బాలీవుడ్ హిట్ ఫార్ములా

ఎప్పుడో 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ నాలుగో స్థానంలో నిలిచాడనే విషయం ఈతరంలో ఎంత మందికి తెలుసు. ఆ ఘనత వెనక ఉన్న శ్రమ, పట్టుదల చదివినా అర్థం కాదు. అదే సినిమాగా చూపిస్తే చరిత్ర కళ్ల ముందు కనిపిస్తుంది.
 
మ్యాచ్ గురించి, వ్యూహాల గురించే తప్ప... మధ్యతరగతి నుంచి ‘మహాన్’గా ఎదిగిన క్రమంపై ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడని మహేంద్ర సింగ్ ధోని గురించి సినిమాలో చెబితే అది ఎంత ఆసక్తికరంగా ఉంటుంది.
 
‘ఆడపిల్లలకు కుస్తీ ఏమిటి’ అనే సమాజంలో స్వయంగా తండ్రి తన ఇద్దరు కూతుళ్లను అంతర్జాతీయ రెజ్లర్లుగా తీర్చిదిద్దిన గాథలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయి. అలాంటి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తే జనం విరగబడి చూడరూ!
 
సరిగ్గా ఇలాంటి లెక్కలతోనే ఇప్పుడు బాలీవుడ్ కోట్ల రూపాయలను కొల్లగొట్టడంపై దృష్టి పెట్టింది. అందుకే సినీ పరిశ్రమ ఆటగాళ్ల జీవిత గాథలపై దృష్టి పెట్టింది. మన దేశంలో దశాబ్దాలుగా ఆట, సినిమా చాలా సందర్భాల్లో అడుగులో అడుగు వేసి కలిసే నడిచాయి. ఇప్పుడు ఆ బంధం బయోపిక్‌ల రూపంలో మరింత బలపడినట్లు కనిపిస్తోంది.

 
* కాసుల వర్షం కురిపిస్తున్న క్రీడాకారుల కథలు
* నటించేందుకు సూపర్‌స్టార్ల ఉత్సాహం

సాక్షి క్రీడా విభాగం: క్రీడాకారుల జీవితంలో సగటు ఫార్ములా సినిమాకు పనికొచ్చే మసాలా అంశాలు ఉంటాయా? హీరో, హీరోయిన్, విలన్, యాక్షన్ ఘట్టాలు, కామెడీ సీన్లు కనిపిస్తాయా? అయినా సరే నిర్మాతలు, నటులు వీటిపై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? సాధారణ సినిమా ప్రేక్షకుడిని వీరు ఏ రకంగా ఆకట్టుకోగలరు? ఇన్ని సందేహాలు ఉన్నా సరే ఇటీవల ‘బయోపిక్’లపై ఆసక్తి పెరిగింది. కొన్ని సినిమాలు విజయవంతం కావడం కూడా సినీ ప్రపంచం క్రీడా కథనాల వైపు మళ్లేందుకు కారణమైంది.
 
నేపథ్యం ఎలాంటిదైనా సహజంగానే ఒక ఆటగాడు అత్యున్నత స్థాయికి చేరాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎంతో అంకితభావం, పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఈ క్రమంలో వారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. వరుస విజయాలతో శిఖరాన నిలిచిన క్షణాలే కాదు... ఓటములతో నైరాశ్యంతో కుంగిపోయే సందర్భాలూ ఉంటాయి. ఆకాశానికెత్తినవారే పాతాళానికి కూడా పడేస్తారు. పరిస్థితులతో, గాయాలతో, సహచర ఆటగాళ్లతో, అధికారులతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇదంతా ఒక సినిమా స్టోరీకి సరిగ్గా సరిపోయే కథలాంటిదే. ఇక్కడ పరిస్థితులే విలన్లు. హీరో దీనిపై పోరాడి విజయం సాధించడమే రూపకర్తలకు, ప్రేక్షకులకు కావాల్సింది.
 
నాటకీయత జోడిస్తే...
ఇప్పటి వరకు బాలీవుడ్‌లో వచ్చిన, రాబోయే బయోపిక్‌లను చూస్తే దర్శక, నిర్మాతలు సినీ సౌలభ్యం కోసం కథలో మార్పులు చేర్పులు కచ్చితంగా చేస్తున్నారని అర్థమవుతోంది. కేవలం ఆటగాడి కెరీర్ ఆరంభం నుంచి విజయాల వరకు తీస్తే అది డాక్యుమెంటరీనే అవుతుంది తప్ప సినిమా కాదు. భావోద్వేగాలు పండించాలంటే, మ్యాచ్ ఫలితం ముందే ఊహించేసే ప్రేక్షకులను కూడా అందులో లీనం చేయాలంటే ఎంతో నాటకీయత అవసరం.

కాబట్టి సందర్భానుసారం దానిని జోడిస్తూ సినిమాలు రూపొందిస్తున్నారు. దీని వల్ల కొన్ని అవాస్తవాలు చొప్పిస్తున్నా... సినిమా అంటే ఈ మాత్రం ఉండాలి అన్నట్లుగా సర్దుకుపొమ్మని ముందే సిద్ధం చేస్తున్నారు. సదరు ఆటగాడితో మాట్లాడకుండా అందుబాటులో ఉన్న సమాచారంతోనే సినిమా తీస్తే వివాదాలు, సమస్యలు వచ్చేవేమో గానీ... ఇటీవల ఆ క్రీడాకారుల అనుమతితోనే సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేకుండా పోయింది. సినీ సౌలభ్యం కోసం అంటూ చేస్తున్న మార్పుల్లోనే మొత్తం ‘డ్రామా’ను నింపేసి అసలు కథకంటే కొసరు ఎక్కువగా చూపిస్తున్నా అభిమానుల ఆమోద ముద్ర ఉంటోంది.
 
చక్‌దే’తో మొదలు...
ఇక ఈ తరహా సినిమాలకు బీజం వేసింది, ప్రేక్షకులకు చేరువైంది అంటే కచ్చితంగా అది షారుఖ్ ఖాన్ సినిమా ‘చక్‌దే ఇండియా’. 2007లో షిమిత్ అమీన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టైటిల్ పాట ప్రేక్షకుల్లో నరనరాన ఉద్వేగం రేపింది. పూర్తిగా అతని జీవిత గాథే కాకపోయినా... హాకీ కోచ్ మీర్ రంజన్ నేగికి సంబంధించి ఒక ఘటనను దీనికి కథావస్తువుగా ఎంచుకొని సాధారణంగా పురుషుల హాకీలో కనిపించే అంశాలతోనే నాటకీయత జోడించారు. ప్రపంచ మహిళల హాకీలో భారత జట్టును ప్రపంచ చాంపియన్‌గా చూపించడం సినిమాటిక్ వినోదమే.
 
సూపర్ హిట్
గత రెండేళ్లలో రెండు బయోపిక్‌లు సహజత్వానికి దగ్గరగా ఉంటూ, ఆటగాళ్ల గొప్పతనాన్ని కూడా ప్రదర్శించాయి. మిల్కాసింగ్ గాథతో ఫర్హాన్ అఖ్తర్ నటించిన ‘భాగ్ మిల్కా భాగ్’.... బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా ప్రియాంక చోప్రా నటించిన ‘మేరీకోమ్’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వారు ఆశించిన డ్రామా, ఉద్వేగాలు అన్నీ ఇందులో బాగా పండాయి. ఫలితంగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచాయి.

రెగ్యులర్ స్టార్ నటులతో కాకుండా ఇర్ఫాన్ ఖాన్‌తో తీసిన ‘పాన్‌సింగ్ తోమర్’ కూడా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఏడు సార్లు జాతీయ స్టీఫుల్‌చేజ్ చాంపియన్‌గా నిలిచి 1958 ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ అథ్లెట్... పరిస్థితుల కారణంగా బందిపోటుగా మారి చివరకు పోలీసుల చేతిలో హతం కావడం వరకు దర్శకుడు తిగ్మాంషు ధూలియా ప్రతిభ మొత్తం కనిపిస్తుంది.
 
నిర్మాణంలో ఫోగట్ జీవితం
రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ‘దంగల్’ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇందులో మహావీర్ ఫోగట్ పాత్ర పోషిస్తున్నారు. మాజీ రెజ్లర్ తన ఇద్దరు అమ్మాయిలను అంతర్జాతీయ రెజ్లర్లుగా ఎలా తీర్చి దిద్దాడనేదే ఈ కథ. ఫోగట్ పాపులర్ కాకపోయినా ఆమిర్ నటిస్తుండటంతో ఒక్కసారిగా ఈ సినిమా స్థాయి పెరిగిపోయింది. నితీశ్ తివారి దీనికి దర్శకుడు.
 
ప్రకటనతో సరి...
మరికొంత మంది క్రీడాకారుల గురించి సినిమాలు తీస్తున్నట్లు ప్రకటనలైతే వచ్చాయి కానీ వాటి గురించి పెద్దగా పురోగతి లేదు. ‘ధ్యాన్‌చంద్’ కథ చెప్పే హక్కులు నాకు దక్కినందుకు సంతోషం. ఎంతో గర్వపడుతున్నా... అంటూ గత ఏడాది అగ్ర దర్శకుడు కరణ్ జొహర్ ట్వీట్ చేశాడు కానీ దాని గురించి పెద్దగా మళ్లీ వార్త రాలేదు. ‘గామా పహిల్వాన్’ అనే మరో దిగ్గజ రెజ్లర్ గురించి సినిమా తీస్తామంటూ సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహాం ఒకేసారి ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. క్రికెటర్ యువరాజ్ సింగ్‌గా తాను నటించి, సినిమా నిర్మిస్తానని ఒకసారి అభిషేక్ బచ్చన్ వెల్లడించాడు. కానీ కార్యరూపం దాల్చలేదు.
 
బ్యాడ్మింటన్ నేపథ్యంలో...
తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కెరీర్‌పై కూడా సినిమా వస్తున్నట్లు ప్రకటించారు. ‘తారే జమీన్ పర్’లాంటి భావోద్వేగ సినిమాకు కథ అందించిన అమోల్ గుప్తే దీనికి దర్శకుడు. ‘ఆడపిల్ల పుడితే అశుభం’ అనే కుటుంబం నుంచి వచ్చి ఒలింపిక్ పతక విజేతగా నిలవడం వరకు సైనా కెరీర్ కూడా స్ఫూర్తిదాయకం. మధ్యలో కోచ్, విభేదాలులాంటి డ్రామా కూడా ఎలాగూ ఉంది.

ప్రధాన పాత్ర ఎవరు అనేది ఇంకా తెలియకపోయినా... గతంలో ఒకసారి సైనా మాత్రం దిగ్గజం ప్రకాశ్ పడుకొనే కూతురు కాబట్టి బ్యాడ్మింటన్ తెలిసిన దీపికా పడుకొనే తగిన చాయిస్ అని ప్రకటించింది. ఇక తెలుగు తేజం పుల్లెల గోపీచంద్ జీవితంపై కూడా బయోపిక్ రానున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టత లేకపోయినా యువ హీరో సుధీర్ బాబు మాత్రం చేస్తే గీస్తే ఆ పాత్ర తానే చేయాలి అంటున్నాడు.
 
సానియా మీర్జాపై కూడా...
మరోవైపు ఆటలో వరల్డ్ నంబర్‌వన్ మాత్రమే కాకుండా ఆదరణలో బాలీవుడ్ తారలకు ఏ మాత్రం తగ్గని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితంపై కూడా సినిమా వస్తోందని చాలాసార్లు వినిపించింది. కానీ సానియా అధికారికంగా వాటిని కొట్టిపారేసింది. అయితే ఇటీవల ఒక టీవీ షోలో తన బయోపిక్ తీస్తే పరిణీతి చోప్రా తన పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పడం...

ఇటీవల వారిద్దరు కలిసి ప్రపంచం మొత్తం విహారం చేస్తుండటం కాస్త ఆసక్తిని రేపింది. ఇదే ప్రోగ్రాంలో కూర్చున్న ఆమె అమ్మ నసీమా మాత్రం సానియానే సినిమా చేయాలి అని చెప్పడం కొసమెరుపు.
 
త్వరలో విడుదల...
వచ్చే ఏడాది రెండు క్రికెట్ బయోపిక్ సినిమాలు ఎక్కువగా ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో మొదటిది భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ జీవితంపై తీస్తున్న ‘అజహర్’. ఈ హైదరాబాదీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటిస్తుండగా ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. అమెరికాలో పుట్టి పెరిగిన టోనీ డిసౌజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. కెరీర్ అత్యుత్తమ దశ నుంచి ఫిక్సింగ్ వరకు అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు.

ఇక ‘ధోని-ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో ధోని బయోపిక్ వస్తోంది. మైదానం బయట ధోని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు కాబట్టి ఇందులో కొత్తగా, ఆసక్తికర అంశాలు ఉండవచ్చు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘ఎ వెడ్నస్ డే’ డెరైక్టర్ నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. నిర్మాణంలో ధోని కూడా సహ భాగస్వామి కాబట్టి ఎక్కువగా నిజాలే ఉండవచ్చు.

>
మరిన్ని వార్తలు