Sakshi News home page

డయాస్... ది గ్రేట్

Published Sat, Sep 10 2016 12:38 AM

డయాస్... ది గ్రేట్

పారాలింపిక్స్‌లో ఇప్పటివరకూ 16 పతకాలు  
రియో డి జనీరో: డానియల్ డయాస్... బ్రెజిల్‌కు చెందిన ఈ స్టార్ స్విమ్మర్ పేరు ఇప్పుడు పారాలింపిక్స్‌లో మారుమోగుతోంది. ప్రధాన ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగితే చాలు స్వర్ణం అందుకునే అమెరికా దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్‌తోనే ఇప్పుడు అతడిని పోలుస్తున్నారు. మొత్తం 28 పతకాలతో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచి కెరీర్‌ను ముగించిన ఫెల్ప్స్ లాగే డయాస్ కూడా పారాలింపిక్ చరిత్రలో నిలిచేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటిదాకా అతడు బీజింగ్ గేమ్స్‌లో 4 స్వర్ణాలు, 4 రజతాలు, ఓ కాంస్యంతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలతో కలిపి మొత్తం 15 పతకాలు సాధించాడు.

తాజాగా రియో పారాగేమ్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 200 మీ. ఫ్రీస్టయిల్ ఎస్5లో తను 2 నిమిషాల 27.88 సెకెన్ల టైమింగ్‌తో స్వర్ణం అందుకున్నాడు. ఆరేళ్ల క్రితం ఇదే ఈవెంట్‌లో ప్రపంచ రికార్డును సృష్టించిన డయాస్ అమెరికా ప్రఖ్యాత స్విమ్మర్ రాయ్ పెర్కిన్‌‌స కన్నా పది సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇది తనకు 16వ పతకం కావడం విశేషం. అందుకే తమ హీరో స్వర్ణం అందుకునే సమయంలో గ్యాలరీలోని స్వదేశీ ప్రేక్షకులంతా ముక్తకంఠంతో ‘డయాస్.. చాంపియన్’ అంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో తాను ఊహించినదానికన్నా ఎక్కువ భావోద్వేగానికి గురయ్యానని డయాస్ తెలిపాడు.
 
మరో ఎనిమిది ఈవెంట్లలో పోటీ
రెండు భుజాలు, కుడి కాలు వైకల్యంతో జన్మిం చిన 28 ఏళ్ల డయాస్ మరో ఎనిమిది ఈవెంట్స్‌లో తలపడనున్నాడు. దీంట్లోనూ పతకాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో డయాస్‌ను అంతా ఫెల్ప్స్‌తో పోలుస్తున్నారు. గతంలో ఈ గేమ్స్ పురుషుల విభాగంలో మాథ్యూ కౌడ్రే (ఆస్ట్రేలియా) అత్యధికంగా 23 పతకాలతో టాప్‌లో ఉన్నాడు. మరోవైపు తనను ఫెల్ప్స్‌తో మాత్రం పోల్చవద్దని, తనకంటూ ఓ నేపథ్యం ఉందని స్పష్టం చేశాడు. ‘నాపేరు డానియల్ డయాస్.

నాకంటూ సొంత చరిత్రను లిఖించాలనుకుంటున్నాను. కానీ ఫెల్ప్స్‌లాంటి అద్భుత అథ్లెట్‌తో పోల్చడం ఓరకంగా సంతోషంగానే ఉంది’ అని డయాస్ అన్నాడు. ఈగేమ్స్‌లో తను పాల్గొనే మిగతా పోటీల్లో పతకాలు సాధించడంతో పాటు టోక్యో పారాగేమ్స్‌లోనూ బరిలోకి దిగితే ఫెల్ప్స్ రికార్డును కూడా అధిగమించే అవకాశాలున్నాయి. డయాస్ పాల్గొనే  ఈవెంట్స్ టిక్కెట్లన్నీ హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement