Sakshi News home page

వారివల్లే గెలిచాం: రోహిత్ శర్మ

Published Mon, Oct 30 2017 11:13 AM

Bumrah, Kumar are world's best death bowlers, says Rohit Sharma

కాన్పూర్:న్యూజిలాండ్ తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా గెలిచి సిరీస్ ను 2-1 తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మ(147 )భారీ సెంచరీతో కదం తొక్కగా, విరాట్ కోహ్లి(113) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ను ఆడాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 337 పరుగులను స్కోరు బోర్డుపై ఉంచింది. అయితే ఆపై భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఉత్కంఠభరితంగా కడవరకూ సాగిన మ్యాచ్ లో కివీస్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రధానంగా నాలుగు ఓవర్లలో కివీస్ విజయానికి 35 పరుగులు కావాల్సిన తరుణంలో భారత గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. కాగా, ఆ తరుణంలో వరల్డ్ అత్యుత్తమ డెత్ ఓవర్ల స్పెషలిస్టులుగా మన్ననలు అందుకుంటున్న భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రాలు మరోసారి తమపై పెట్టుకున్న అంచనా నిజం చేసి భారత్ కు చక్కటి విజయాన్ని అందించారు. వీరిద్దరి బౌలింగ్ పై మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. చేజారిపోయిందనుకున్న మ్యాచ్ ను భువనేశ్వర్ కుమార్, బూమ్రాలు తిరిగి నిలబెట్టారంటూ కొనియాడాడు.


' నిజంగా చెప్పాలంటే మ్యాచ్ ను గెలిచామంటే వారిద్దరే కారణం.  భువీ, బూమ్రాలు వరల్డ్ బెస్ట్ డెత్ బౌలర్లని మరోసారి నిరూపించుకున్నారు. వీరిద్దరూ కచ్చితంగా అత్యుత్తమ డెత్ బౌలర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కివీస్ తో మూడో వన్డేలో మరోసారి దాన్ని వారు రుజువు చేశారు. నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఈ వికెట్ పై ఏమాత్రం కష్టం కాదు. మరొకవైపు న్యూజిలాండ్ కూడా మంచి దూకుడుగా ఆడుతుంది. ఆ తరుణంలో మ్యాచ్ ను బూమ్రా, భువనేశ్వర్ లు నిలబెట్టారు. కివీస్ ను కట్టడి చేసి మళ్లీ గేమ్ ను మావైపుకి తీసుకొచ్చారు'  అని రోహిత్ శర్మ విశ్లేషించాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో వీరిద్దరూ 28 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ ను నిలబెట్టుకుంది.  తద్వారా భారత్సిరీస్ ను సొంతం చేసుకుంది.
 

Advertisement
Advertisement