‘డెత్’లో పడేస్తాడు... | Sakshi
Sakshi News home page

‘డెత్’లో పడేస్తాడు...

Published Wed, Mar 30 2016 12:11 AM

‘డెత్’లో పడేస్తాడు...

 పదునెక్కుతున్న బుమ్రా బౌలింగ్
 చివరి ఓవర్లలో భారత్ ఆయుధం
 ఫలితం వెనుక కఠోర శ్రమ

 
 ఏంట్రా నీ అల్లరి... బయటకి వెళ్లి ఆడు కో... కొద్దిసేపు నిద్రపోవాలి... శబ్దం రాకుం డా ఆడు... 12 ఏళ్ల వయసులో బుమ్రా ఇంట్లో బౌలింగ్ చేస్తుంటే అతడి తల్లి మందలింపు ఇది. ఓవైపు ఆడాలని కోరిక... మరోవైపు అమ్మ నిద్రపోతోందనే ఆలో చన... ఏం చేయాలి..? శబ్దం రాకుండా గోడకు బంతి విసరడం ఎలా..? ఆ చిట్టి బుర్రకు ఓ ఆలోచన వచ్చింది. గోడ, గచ్చు కలిసే చోటకు బంతి విసిరితే పెద్దగా శబ్దం రాదు. అంతే... అదే పనిగా అక్కడే బంతులు వేయడం విసరడం మొదలుపెట్టాడు. నిజానికి అప్పుడు బుమ్రాకు తెలియదు. ఈ ఆలోచన తనని యార్కర్లు వేయడంలో నిష్ణాతుడిని చేస్తుందని... భారత్‌కు ‘డెత్’ ఓవర్లలో ఓ స్పెషలిస్ట్‌గా మారతానని..!
 
 ముంబై నుంచి సాక్షి క్రీడాప్రతినిధి :  గతంతో పోలిస్తే భారత క్రికెట్‌లో వచ్చిన ఓ పెద్ద సానుకూల మార్పు... బుమ్రా. గతంలో ఎక్కడ ఏ టోర్నీ ఆడినా డెత్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చే బౌలర్లతో ధోని తలపట్టుకునేవాడు. కానీ బుమ్రా వచ్చిన తర్వాత కెప్టెన్‌కు పెద్ద తలనొప్పి తగ్గింది. చివరి ఓవర్లలో ప్రత్యర్థులను కదలనీయకుండా యార్కర్లు వేస్తూ బుమ్రా ఇప్పుడో సంచలనంగా మారాడు. బుమ్రా బలమంతా అతని బౌలింగ్ యాక్షన్‌తోనే ప్రారంభమవుతుంది. ఇది అతను ఎవరినో చూసి నేర్చుకున్నది కాదు. సహజంగానే తన ప్రయత్నం లేకుండా ఇదే తరహాలో అతను బౌలింగ్ మొదలు పెట్టాడు. అదృష్టం ఏమిటంటే స్కూల్ స్థాయినుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు కాస్త భిన్నంగా కనిపిస్తోంది అనే మాటే తప్ప ఏ కోచ్ కూడా యాక్షన్‌ను మార్చుకోమని సలహా ఇవ్వలేదు.
 
 ఎంఆర్‌ఎఫ్ పేస్ అకాడమీలో దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్  కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో బుమ్రాకు తనపై నమ్మకం ఏర్పడింది. ఇక తన బలమైన యార్కర్లను మరింతగా పదునెక్కించేందుకు అతను తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన తర్వాత అతను మలింగకు శిష్యుడిగా మారిపోయాడు. తనలాగే భిన్నమైన యాక్షన్ ఉండటం, ఈతరంలో అతనిలాగా యార్కర్లు వేసేవారు లేకపోవడంతో బుమ్రా నేర్చుకునేందుకు సరైన వేదిక లభించింది.
 
 చిన్న సందేహం మొదలు పెద్ద ఆలోచన వరకు అన్నీ అతనికి మలింగతోనే. ఐపీఎల్‌లో జట్టు మారమని కొందరు సలహా ఇచ్చినా మలింగ కోసమే బుమ్రా అక్కడే ఉండిపోయాడు. స్లో బంతులు, బౌన్సర్లు కూడా బాగానే వేస్తున్నా, నీకంటూ ఒక ప్రత్యేక బలం ఉండాలనే మలింగ సూచనతో పూర్తిగా యార్కర్లపైనే దృష్టి పెట్టాడు. టాప్ బౌలర్ల యార్కర్ల వీడియోలన్నీ సేకరించి తనను తాను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో ధోనిని అద్భుత యార్కర్‌తో బౌల్డ్ చేయడం... ఆ తర్వాత తనకు అలాంటి బౌలర్ కావాలని కెప్టెన్ కోరడమే బుమ్రాకు ఆసీస్ పర్యటన అవకాశం ఇప్పించింది.
 
 ప్రత్యర్థిపై ఆధిపత్యం
 బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే మిస్‌ఫీల్డ్, తర్వాత మరో సునాయాస క్యాచ్ వదిలేయడం, ఆ తర్వాత అదే బ్యాట్స్‌మన్ చేతిలో ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు బాదుడు... ఇంత జరిగాక ఒక 22 ఏళ్ల బౌలర్ స్థైర్యం దెబ్బ తింటుంది. కానీ బుమ్రా తన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 13 పరుగులే ఇచ్చాడు. ఇందులో ఏకంగా ఆరు యార్కర్లు ఉన్నాయి. అంటే సగం బంతులు అతను యార్కర్లను ఉపయోగిస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన అద్భుతం గురించే అంతా చర్చ జరిగింది కానీ అంతకుముందు ఓవర్లో బుమ్రా కేవలం 6 పరుగులే ఇవ్వడం అసలు విజయానికి పునాది వేసింది.
 
 ఆసీస్‌తో మ్యాచ్ కూడా అతని బౌలింగ్‌కు రీప్లేలా కనిపించింది. తొలి ఓవర్లోనే ఖాజా నాలుగు ఫోర్లు బాదడంతో 17 పరుగులు ఇచ్చేశాడు. అయితే తర్వాతి మూడు ఓవర్లలో బుమ్రా 3, 3, 9 పరుగులు ఇచ్చాడు. కీలకమైన సమయంలో మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్ చేశాడు. ఎంతటి ఒత్తిడిలోనూ నియంత్రణ తప్పకుండా బౌలింగ్ చేయడమే బుమ్రాపై కెప్టెన్ ప్రశంసలు కురిపించేలా చేస్తోంది.
 
 అవకాశం ఇవ్వకూడదు
 సాధారణంగా ప్రపంచ క్రికెట్‌లో భిన్నమైన శైలితో వచ్చిన ఆటగాళ్లు తొందరగానే ఆ ప్రభను కోల్పోవడం, ప్రత్యర్థులు వారిని పట్టేయడం చాలా సందర్భాల్లో జరిగింది. వైవిధ్యం కనబర్చలేక ఎంతో మంది సాధారణ క్రికెటర్లుగానే మిగిలిపోతే, కొంత మంది మాత్రమే ఎప్పటికప్పుడు తమని తాము అప్‌డేట్ చేసుకుంటూ నిలబడ్డారు. బుమ్రా ఇప్పటికి 15 టి20లతో పాటు ఒక వన్డే ఆడాడు. కానీ అంత సులభంగా ఎవరికీ లొంగలేదు.
 
 ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్‌లోని మైదానాల్లో అతని ప్రదర్శన ఆకట్టుకుంది. టి20 ప్రమాణాల ప్రకారం మంచి సగటు, ఎకానమీతో అతను బౌలింగ్ చేస్తున్నాడు. గత 3 నెలల వ్యవధిలోనే కీలక సభ్యుడిగా ఎదిగిన అతను ప్రపంచకప్ విజేత జట్టులో భాగం అయ్యేందుకు మరో రెండు మ్యాచ్‌ల దూరంలోనే ఉన్నాడు. ఆ కోరిక నెరవేరాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా సత్తా చాటాలి.
 

Advertisement
Advertisement