చెన్నైకి చెక్ | Sakshi
Sakshi News home page

చెన్నైకి చెక్

Published Fri, May 1 2015 12:54 AM

Check to the chennai

కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయం
ఉతప్ప, రస్సెల్ మెరుపులు
రాణించిన బ్రాడ్ హాగ్

 
చెన్నై చేతిలో గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి కోల్‌కతా వెంటనే తేరుకుంది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో జూలు విదిల్చింది. వెటరన్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ‘స్పిన్’జాలం...ఆ తర్వాత రాబిన్ ఉతప్ప, రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు చెక్ పెట్టారు.
 
కోల్‌కతా : నైట్‌రైడర్స్ విజయ లక్ష్యం 166 పరుగులు... తొలి 10 ఓవర్లలో జట్టు స్కోరు 66/3. ఇక మ్యాచ్ గెలవాలంటే చివరి 10 ఓవర్లలో సరిగ్గా 100 పరుగులు చేయాల్సిన దశలో కోల్‌కతా బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప (58 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రస్సెల్ (32 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 112 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.

దీంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో  చెన్నైని చిత్తు చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. మెకల్లమ్ (12 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), బ్రేవో (32 బంతుల్లో 30; 4 ఫోర్లు), పవన్ నేగి (13 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (30 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్)లు తలా కొన్ని పరుగులు జత చేశారు. తర్వాత కోల్‌కతా 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి నెగ్గింది. రస్సెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.  

పవర్‌ప్లేలోనే జోరు...
ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ (0) అవుటైనా... మెకల్లమ్ ఎదురుదాడి చేశాడు. వరుస ఫోర్లు, భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. రైనా (10 బంతుల్లో 8; 2 ఫోర్లు)తో కలిసి ఓవర్‌కు దాదాపు 11కు పైగా రన్‌రేట్ సాధించడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. అయితే ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌లో రైనా... హాగ్ వేసిన ఆరో ఓవర్‌లో మెకల్లమ్, డు ప్లెసిస్‌లు అవుట్‌కావడంతో పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 4 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది.

రైనాతో కలిసి రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించిన మెకల్లమ్... డు ప్లెసిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 21 పరుగులు జత చేశాడు. తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ ధోని (1)ని చావ్లా బోల్తా కొట్టించినా... బ్రేవో, జడేజా నిలకడగా ఆడారు. దీంతో తొలి 10 ఓవర్లలో చెన్నై 5 వికెట్లకు 88 పరుగులు చేసింది. ఈ దశలో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ ద్వయం సింగిల్స్‌కు పరిమితమైంది. ఆరో వికెట్‌కు 9.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక బ్రేవో వెనుదిరిగాడు.

తర్వాత వచ్చిన నేగి నాలుగు ఫోర్లు బాదాడు. కానీ హాగ్ వేసిన 19వ ఓవర్‌లో మూడు బంతుల తేడాలో ఈ ఇద్దరూ వెనుదిరిగారు. దీంతో ఏడో వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓవరాల్‌గా చెన్నై చివరి 10 ఓవర్లలో కేవలం 77 పరుగులు చేసింది. హాగ్ 4, రస్సెల్ 2 వికెట్లు తీశారు.

శుభారంభం లేకపోయినా..
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతాకు ఓపెనర్లు ఉతప్ప, గంభీర్ (16 బంతుల్లో 19; 2 సిక్సర్లు) సరైన శుభారంభాన్ని అందించలేకపోయారు. రెండు సిక్సర్లు బాదిన గౌతీ తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత మనీష్ పాండే (3), సూర్యకుమార్ (2) వరుస విరామాల్లో వెనుదిరగడంతో నైట్‌రైడర్స్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లకు 66 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత రస్సెల్ కాసేపు నెమ్మదిగా ఆడినా.. తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఉతప్ప కూడా రెండో ఎండ్‌లో బ్యాట్ ఝుళిపించడంతో రన్‌రేట్ తగ్గుముఖం పట్టింది. 16వ ఓవర్‌లో ఓ సిక్స్, ఓ ఫోర్ బాదిన రస్సెల్.. బ్రేవో వేసిన తర్వాతి ఓవర్‌లో మరో రెండు సిక్సర్లు సంధించాడు. ఈ క్రమంలో రస్సెల్ కేవలం 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. చివరి 12 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఉతప్ప ఫోర్ సాయంతో ఐదు పరుగులు రాబట్టాడు. దీంతో కోల్‌కతా విజయ సమీకరణం ఆరు బంతుల్లో ఆరు పరుగులుగా మారింది. ఉతప్ప 4 పరుగులు చేయగా... రస్సెల్ ఐదో బంతికి మ్యాచ్‌ను ముగించాడు.

స్కోరు వివరాలు

చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ (సి) టెన్ డస్కెట్ (బి) కమిన్స్ 0; మెకల్లమ్ ఎల్బీడబ్ల్యు (బి) హాగ్ 32; రైనా (సి) చావ్లా (బి) ఉమేశ్ 8; డు ప్లెసిస్ (స్టంప్డ్) ఉతప్ప (బి) హాగ్ 20; బ్రేవో (బి) రస్సెల్ 30; ధోని (బి) చావ్లా 1; జడేజా (సి) కమిన్స్ (బి) హాగ్ 24; పవన్ నేగి (బి) హాగ్ 27; మోహిత్ (సి) ఉతప్ప (బి) రస్సెల్ 0; నెహ్రా నాటౌట్ 1; మోరె నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165.
వికెట్ల పతనం : 1-0; 2-43; 3-64; 4-69; 5-72; 6-129; 7-154; 8-160; 9-160.
బౌలింగ్ : కమిన్స్ 4-0-54-1; ఉమేశ్ 2-0-16-1; చావ్లా 4-0-21-1; హాగ్ 4-0-29-4; యూసుఫ్ 2-0-11-0; రస్సెల్ 4-0-20-2.

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : ఉతప్ప నాటౌట్ 80; గంభీర్ (సి) మోరె (బి) మోహిత్ 19; మనీష్ పాండే (సి) జడేజా (బి) నేగి 3; సూర్యకుమార్ (సి) బ్రేవో (బి) మోరె 2; రస్సెల్ నాటౌట్ 55; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (19.5 ఓవర్లలో 3 వికెట్లకు) 169.
వికెట్ల పతనం : 1-33; 2-54; 3-57. బౌలింగ్ : మోహిత్ 4-0-22-1; నెహ్రా 4-0-36- 0; నేగి 4-0-23-1; మోరె 3.5-0-31-1; జడేజా 2-0-25-0; బ్రేవో 2-0-27-0.

Advertisement
Advertisement