పుజారా... అడ్డుగోడలా... | Sakshi
Sakshi News home page

పుజారా... అడ్డుగోడలా...

Published Sun, Mar 19 2017 1:53 AM

పుజారా... అడ్డుగోడలా...

అజేయ శతకంతో ఆదుకున్న ‘నయా వాల్‌’ 
దీటుగా బదులిస్తున్న భారత్‌
తొలి ఇన్నింగ్స్‌లో 360/6 
నాలుగు వికెట్లు తీసిన కమిన్స్‌  


మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే మూడో రోజు ఆటను పూర్తిగా తమ అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి.. భారత క్రికెట్‌లో నయా ‘వాల్‌’గా పిలుచుకునే చతేశ్వర్‌ పుజారా ఈ అవసరాన్ని గుర్తించడమే కాకుండా ఆస్ట్రేలియా బౌలర్ల దాడికి అడ్డుగోడలా నిలబడి తమ ఆశలను సజీవంగా ఉంచాడు. కమిన్స్‌ ప్రమాదకర బంతులు విసురుతున్నా.. పరుగులు అంత సులువుగా రాకపోయినా.. సహచరులు వెనుదిరుగుతున్నా... దాదాపు ఏడు గంటల పాటు క్రీజులో పాతుకుపోయి తను ఆడిన టాప్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ అద్భుతం..

అసలు సిసలు టెస్టు క్రికెట్‌ ఆటను చూపుతూ అజేయ సెంచరీతో తుదికంటా నిలవడంతో పాటు తొలిసారిగా టెస్టు జరిగిన నాలుగు వేదికల్లోనూ సెంచరీలు సాధించిన అరుదైన ఘనత సాధించాడు. అటు ఓపెనర్‌ మురళీ విజయ్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడి సహకరించడంతో భారత్‌ ప్రస్తుతం ఆసీస్‌కన్నా 91 పరుగులు వెనకబడి ఉంది. అటు తొలి రెండు సెషన్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆసీస్‌ చివరి సెషన్‌లో పుంజుకుంది. 31 ఓవర్లలో 57 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగలిగింది.

స్టార్క్‌ స్థానంలో ఐదేళ్ల అనంతరం జట్టులోకి వచ్చిన పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ పాత, కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో పాటు కోహ్లి, రహానే, అశ్విన్‌ వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశాడు. అయితే నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ ఏ మేరకు పరుగులు సాధిస్తారు... ఆసీస్‌ బౌలర్లు ఎంత తక్కువ సమయంలో భారత్‌ను ఆలౌట్‌ చేస్తారనే అంశాలపైనే ఈ మ్యాచ్‌లో ఫలితంఆధారపడి ఉంది.  

రాంచీ: మూడో రోజు ఆటలోనూ భారత్‌ అదే జోరును ప్రదర్శించింది. అంతులేని ఏకాగ్రతకు తోడు ఒత్తిడిని తట్టుకుంటూ చతేశ్వర్‌ పుజారా అజేయ సెంచరీ (328 బంతుల్లో 130 బ్యాటింగ్‌; 17 ఫోర్లు)తో భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఈ సిరీస్‌లో భారత్‌కిదే తొలి సెంచరీ కావడం విశేషం. అతడికి ఓపెనర్‌ మురళీ విజయ్‌ (183 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక సహకారం అందించడంతో మూడో టెస్టులో శనివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 130 ఓవర్లలో ఆరు వికెట్లకు 360 పరుగులు చేసింది. పుజారా, విజయ్‌ రెండో వికెట్‌కు 102 పరుగులు జోడించారు.

ఇక గాయం కారణంగా రెండో రోజు పెవిలియన్‌కే పరిమితమైన కెప్టెన్‌ కోహ్లి (23 బంతుల్లో 6) బ్యాటింగ్‌కు దిగినా... మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. కరుణ్‌ నాయర్‌ (47 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పుజారాకు తోడుగా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా (42 బంతుల్లో 18 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) ఉన్నాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌కన్నా భారత్‌ మరో 91 పరుగులు వెనకబడి ఉండగా, చేతిలో నాలుగు వికెట్లున్నాయి. ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ చక్కటి వైవిధ్యంతో బంతులు వేసి నాలుగు వికెట్లు తీయగా... హేజల్‌వుడ్, ఒకీఫ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది.

సెషన్‌–2: కోహ్లి మళ్లీ విఫలం
విరామం తర్వాత ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య క్రీజులోకి వచ్చిన కోహ్లి క్తాస ఇబ్బందిగానే కనిపించాడు. 23 బంతులు ఎదుర్కొన్నా ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు. 80వ ఓవర్‌ అనంతరం కొత్త బంతి తీసుకున్న ఆసీస్‌ ఫలితం సాధించింది. కమిన్స్‌ ఆఫ్‌ సైడ్‌కు ఆవల వేసిన బంతిని కోహ్లి కవర్‌ డ్రైవ్‌లో ఆడాలని చూశాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్‌ చేతుల్లోకి వెళ్లడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత రహానే (33 బంతుల్లో 14; 2 ఫోర్లు)తో కలిసి అడపాదడపా ఫోర్లు బాదుతూ పుజారా స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. అయితే కమిన్స్‌ బౌన్సర్‌కు రహానే కీపర్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే 214 బంతుల్లో పుజారా ఓ ఫోర్‌తో కెరీర్లో 11వ శతకాన్ని సాధించాడు. మరో వికెట్‌ పడకుండా పుజారా, కరుణ్‌ జోడి టీ విరామానికి వెళ్లింది.
ఓవర్లు: 28.2, పరుగులు: 110, వికెట్లు: 2

సెషన్‌–3: పుంజుకున్న ఆసీస్‌
టీ బ్రేక్‌ అనంతరం పిచ్‌ నుంచి అందిన సహకారాన్ని ఆసీస్‌ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. అటు పరుగులు తీయడం భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా మారింది. ఈ దశలో కరుణ్‌ నాయర్‌ను హేజల్‌వుడ్‌ బౌల్డ్‌ చేశాడు. కొద్దిసేపటికే కమిన్స్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకు వెళ్లిన ఆసీస్‌ ఫలితం సాధించింది. అతడు వేసిన బౌన్సర్‌ అశ్విన్‌ గ్లౌజ్‌కు తాకుతూ వెళ్లినట్టు తేలింది. ఆ తర్వాత సాహా, పుజారా ఎలాంటి రిస్కీ షాట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు.
ఓవర్లు: 31, పరుగులు: 57, వికెట్లు: 2

సెషన్‌–1: పుజారా, విజయ్‌ నిలకడ
ఓవర్‌నైట్‌ స్కోరు 120/1తో భారత్‌ మూడో రోజును ప్రారంభించింది. ఈ సెషన్‌ మొత్తం పుజారా, విజయ్‌ ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. రెండో ఓవర్‌లోనే క్రీజును వదిలి ఒకీఫ్‌ బౌలింగ్‌లో విజయ్‌ భారీ సిక్స్‌ను బాదాడు. అటు పుజారా కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో అలరించాడు. కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న విజయ్‌ 129 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 58వ ఓవర్‌లో పుజారా ఎల్బీ కోసం స్మిత్‌ రివ్యూ కోరగా... బంతి ముందుగా బ్యాట్‌ను తాకినట్టుగా టీవీ అంపైర్‌ నిర్ధారించి నాటౌట్‌గా ప్రకటించాడు. మరుసటి ఓవర్‌ తొలి బంతికే విజయ్‌ ఎల్బీకి గట్టిగా అప్పీల్‌ చేసినా అంపైర్‌ స్పందించలేదు. అయితే సెంచరీ వైపు పయనిస్తున్న విజయ్‌ లంచ్‌ విరామానికి ముందు ఓవర్‌లో ఒకీఫ్‌ బౌలింగ్‌లో క్రీజు వదిలి ఆడి స్టంపౌట్‌ అయ్యాడు.
ఓవర్లు:
30.4, పరుగులు: 73, వికెట్‌: 1

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 451; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) వేడ్‌ (బి) కమిన్స్‌ 67; మురళీ విజయ్‌ (స్టంప్డ్‌) వేడ్‌ (బి) ఒకీఫ్‌ 82; పుజారా (బ్యాటింగ్‌) 130; కోహ్లి (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 6; రహానే (సి) వేడ్‌ (బి) కమిన్స్‌ 14; కరుణ్‌ నాయర్‌ (బి) హేజల్‌వుడ్‌ 23; అశ్విన్‌ (సి) వేడ్‌ (బి) కమిన్స్‌ 3; సాహా (బ్యాటింగ్‌) 18; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం: (130 ఓవర్లలో ఆరు వికెట్లకు) 360
వికెట్ల పతనం: 1–91, 2–193, 3–225, 4–276, 5–320, 6–328.
బౌలింగ్‌: హేజల్‌వుడ్‌ 31–9–66–1; కమిన్స్‌ 25–8–59–4; ఒకీఫ్‌ 43–11–117–1; లయన్‌ 29–2–97–0; మ్యాక్స్‌వెల్‌ 2–0–4–0.

7 ఈ సీజన్‌లో పుజారాకిది ఏడో సెంచరీ. 1999–2000లో లక్ష్మణ్‌ అత్యధికంగా 8
సెంచరీలు చేశాడు.


6 రెండో వికెట్‌కు పుజారా, విజయ్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించడం ఈ సీజన్‌లో ఇది ఆరోసారి. పాంటింగ్, హేడెన్‌ (2005–06లో ఏడు సార్లు) వీరికన్నా ముందున్నారు.

46 ఇప్పటిదాకా ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కోహ్లి చేసిన పరుగులు. ఐదు లేక అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్‌లో ఒకటి నుంచి ఏడు స్థానాల్లో బరిలోకి దిగిన భారత కెప్టెన్లలో ఇదే అత్యంత చెత్త రికార్డు.

Advertisement
Advertisement