గేల్, ధోని రికార్డు! | Sakshi
Sakshi News home page

గేల్, ధోని రికార్డు!

Published Thu, Mar 31 2016 10:07 AM

గేల్, ధోని రికార్డు!

ముంబై: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించి తుదిపోరుకు చేరాలని ఇరు జట్లు వ్యూహాలు పన్నుతున్నాయి. ఆరంభ మ్యాచ్ ఓడి, మిగతా మూడు మ్యాచుల్లో నెగ్గి టీమిండియా సెమీస్ చేరింది. విండీస్ తాను ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా మూడింట్లో గెలిచి, చివరి మ్యాచ్ లో అప్ఘానిస్తాన్ చేతిలో ఓడింది. ఈ నాలుగు మ్యాచుల్లో విండీస్ మొత్తం 550 పరుగులు చేయగా, భారత్ 505 పరుగులు సాధించింది. 
 
సెమీస్ సమరంలో ఇరు జట్లకు విజయవకాశాలు సమంగా ఉన్నాయి. విండీస్ టీమ్ లో అందరి దృష్టి క్రిస్ గేల్ పై నెలకొంది. 'సిక్సర పిడుగు'గా ఖ్యాతి గాంచిన ఈ విధ్వంసక బ్యాట్స్ మన్ చెలరేగితే విండీస్ విజయం ఖాయం. సెంచరీ సిక్సర్ల రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. ఇంకో రెండు సిక్సర్లు బాదితే టీ20ల్లో 100 సిక్సర్లు సాధించిన వీరుడవుతాడు. గేల్ ఇప్పటివరకు 48 మ్యాచుల్లో 98 సిక్సర్లు  బాదాడు. 
 
రెండు టీముల మధ్య అత్యధిక వ్యక్తిగత స్కోరు 98 పరుగులే కావడం విశేషం. 2010, మే నెలలో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో గేల్ 66 బంతుల్లో 98 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా రికార్డు ముంగిట నిలిచాడు. ఒక డిస్మిసల్ చేస్తే వికెట్ కీపింగ్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఘనత 'మిస్టర్ కూల్' సొంతమవుతుంది. ఇప్పటివరకు 60 మ్యాచులు ఆడిన ధోని 60 డిస్మిసల్స్ చేశాడు. ఇద్దరు స్టార్ క్రికెటర్లు రికార్డులు నెలకొల్పుతారో, లేదో చూడాలంటే ఈ రాత్రి వాంఖేడ్ మైదానంలో జరిగే మ్యాచ్ చూడాల్సిందే.

Advertisement
Advertisement