అదంతా విధి రాత : క్రిస్‌ గేల్‌ | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 30 2018 4:41 PM

Chris Gayle Says Destined to Play for Kings XI Punjab - Sakshi

మొహాలీ : కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడాలని రాసిపెట్టుండటంతోనే చివర్లో ఆ జట్టు తనను తీసుకుందని విధ్వంసకర బ్యాట్స్‌మన్‌, వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ అభిప్రాయపడ్డాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గేల్ పలు ఆసక్తికరవిషయాలను పంచుకున్నాడు. గేల్‌ నిరూపంచుకున్నాడనే వ్యాఖ్యలను ఈ విండీస్‌ క్రికెటర్‌ తప్పుబట్టాడు. తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తన రికార్డులే తనేంటో తెలియజేస్తాయన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్‌ వేలంలో చివరి రౌండ్‌లో ఎంపికయ్యాని, తనపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదని తెలిసిన తరువాత కూడా తానేమి బాధపడలేదన్నాడు.

జీవితమంటే ఒక క్రికెట్‌ మాత్రమే కాదని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో ఒక కొత్త ఫ్రాంచైజీకి ఎంపికవ్వడం సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకంతో కొనగోలు చేసిన జట్టకు సేవలందించడమే ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యమని తెలిపాడు. తాను ఏ జట్టుకు ఆడుతున్నా, ఆ జట్టు గెలవాలనే కోరుకుంటానని చెప్పుకొచ్చాడు. మిగతా ఫ్రాంచైజీలు వేలంలో ఆసక్తి కనబర్చకపోవడంపై స్పందిస్తూ, తానేమీ తప్పుగా ప్రవర్తించలేదని, ప్రతి మ్యాచ్ లోనూ రాణించడం ఎవరి వల్లా కాదని, కెరీర్‌లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమేనని గేల్ అభిప్రాయపడ్డాడు.

38 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌ గురించి స్పందిస్తూ.. ‘‘  నా శరీరాకృతి మారకుండా కొనసాగిస్తున్నాను. నేను స్ప్రింగ్‌ చికెన్‌లా ఉండనని నాకు తెలుసు. కానీ శరీరాకృతి కోసం ఎలాంటి కసరత్తులు చేయను. నాది సహజసిద్దమైన శరీరాకృతి. 38 ఏళ్ల వయసులో కూడా నా శరీర ఆకృతి బానే ఉంది’’ అని తెలిపాడు.

ఆ రెండే నా లక్ష్యం.. ‘‘ఈ సీజన్‌ ఐపీఎల్‌ టైటిల్‌, 2019 ప్రపంచకప్‌ గెలవడమే నా లక్ష్యం. ప్రపంచకప్‌ గెలిచే అవకాశం వెస్టిండీస్‌కు ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నా. మా జట్టు క్వాలిఫైయర్స్‌లో ఇబ్బంది పడ్డ విషయం నాకు తెలుసు. కానీ మేం టైటిల్‌ సాధించేలా సిద్దమయ్యాం. ప్రస్తుతం ఖచ్చితంగా ఐపీఎల్‌ టైటిల్‌ గెలువాలి. కింగ్స్‌ పంజాబ్‌ ఇప్పటివరకు గెలవలేదు. మా యజమాని ప్రితీజింతా అద్భుతం. ఆమె ఆటగాళ్లికిచ్చె మద్దతు అత్యద్భుతం. ఈ ఏడాది టైటిల్‌ను ఆమె అందుకోవడం ఎంతో అవసరమని నేను భావిస్తున్నా.’’ అని చెప్పాడు. 

ఇక గేల్‌ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆడింది నాలుగు మ్యాచ్లే అయినప్పటికీ, 252 పరుగులు చేసి, పొట్టి క్రికెట్ లో తానెంత ముఖ్యమో నిరుపించుకున్నాడు. తనను వదిలేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు, తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని మిగతా ఫ్రాంచైజీలకు తన విధ్వంసక బ్యాటింగ్తో సమాధానం చెబుతున్న విషయం తెలిసిందే. ఇక గేల్ ఆడిన మ్యాచ్‌ ఓ శతకం, రెండు అర్థ సెంచరీలు సాధించి పంజాబ్‌కు సునాయస విజయాలందించాడు.

Advertisement
Advertisement