పసిడి లేని ‘పంచ్’ | Sakshi
Sakshi News home page

పసిడి లేని ‘పంచ్’

Published Sun, Aug 3 2014 1:56 AM

పసిడి లేని ‘పంచ్’

బాక్సింగ్‌లో నాలుగు రజతాలు
 అన్ని ఫైనల్స్‌లోనూ భారత
 బాక్సర్ల ఓటమి
 1998 తర్వాత స్వర్ణం
 లేకపోవడం ఇదే తొలిసారి
 
 గ్లాస్గో: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలపై ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్లు పసిడి మెట్టుపై బోల్తా పడ్డారు. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించిన నలుగురూ రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. పురుషుల విభాగంలో లైష్రామ్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు), మన్‌దీప్ జాంగ్రా (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు)... మహిళల విభాగంలో లైష్రామ్ సరిత దేవి (60 కేజీలు) టైటిల్ పోరులో ఓడిపోయి రజత పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల సెమీఫైనల్లో ఓడిన పింకీ రాణికి కాంస్యం లభించిన సంగతి తెలిసిందే. మొత్తానికి 1998 కౌలాలంపూర్ గేమ్స్ తర్వాత తొలిసారి భారత బాక్సర్లు ‘పసిడి పతకం’ లేకుండా స్వదేశానికి తిరిగి రానున్నారు. 2002, 2006, 2010 కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు కనీసం ఒక స్వర్ణమైనా గెలిచారు. ఫైనల్స్‌లో దేవేంద్రో 0-3 (28-29, 27-30, 28-29)తో డిఫెండింగ్ చాంపియన్ ప్యాడి బార్నెస్ (నార్తర్న్ ఐర్లాండ్) చేతిలో; సరిత దేవి 0-3 (37-39, 37-39, 37-39)తో షెల్లీ వాట్స్ (ఆస్ట్రేలియా) చేతిలో; మన్‌దీప్ 0-3 (27-30, 27-29, 26-30)తో స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ (ఇంగ్లండ్) చేతిలో; విజేందర్ 0-3 (27-29, 28-29, 28-29)తో ఆంటోనీ ఫౌలెర్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు.
 
 గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన మన్‌దీప్ ఫైనల్లో తేలిపోయాడు. ఫిట్జ్‌గెరాల్డ్ పంచ్‌ల ధాటికి ఈ హర్యానా బాక్సర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. రెండో రౌండ్‌లోనైతే ఇంగ్లండ్ బాక్సర్ సంధించిన పంచ్‌కు మన్‌దీప్ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత తేరుకున్నా ఆత్మరక్షణకే ప్రాధాన్యమిచ్చి ఓటమిని ఖాయం చేసుకున్నాడు.
 
 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు నెగ్గిన బార్నెస్ అనుభవం ముందు దేవేంద్రో పోరాటపటిమ అతనికి స్వర్ణాన్ని అందించలేకపోయింది. తొలి, చివరి రౌండ్లలో కేవలం పాయింట్ తేడాతో వెనుకబడిన దేవేంద్రో రెండో రౌండ్‌లో మాత్రం బార్నెస్ ధాటికి జవాబివ్వలేకపోయాడు.
 
  షెల్లీ వాట్స్ (ఆస్ట్రేలియా)తో జరిగిన ఫైనల్లో సరిత రెండు నిమిషాల వ్యవధిగల నిర్ణీత నాలుగు రౌండ్లలో తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం కనబరిచింది. అయితే చివరి రెండు రౌండ్లలో షెల్లీ వాట్స్ దూకుడు ముందు సరిత ఎదురునిలువడంలో విఫలమైంది. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన ఆస్ట్రేలియా తొలి మహిళా బాక్సర్‌గా షెల్లీ వాట్స్ గుర్తింపు పొందింది.
 

Advertisement
Advertisement