నమ్మకం పెరిగింది | Sakshi
Sakshi News home page

నమ్మకం పెరిగింది

Published Sun, Jan 10 2016 2:25 AM

నమ్మకం పెరిగింది

♦  ప్రాక్టీస్ వన్డేలోనూ భారత్ విజయం
♦   రాణి ంచిన రోహిత్, మనీశ్ పాండే

ఏడాది క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఎవరూ కనీసం ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి కూడా సరిగ్గా అలాంటి పేస్ పిచ్‌ల మీదే సిరీస్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లను భారత్ సద్వినియోగం చేసుకుంది. తొలుత ప్రాక్టీస్ టి20లో నెగ్గిన ధోని సేన... శనివారం జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
 

పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ టి20లో నెగ్గిన భారత్... వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. శనివారం ‘వాకా’ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని సేన 64 పరుగుల తేడాతో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 49.1 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ (82 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫామ్‌లోకి రాగా... మనీశ్ పాండే (59 బంతుల్లో 58; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అజింక్య రహానే (53 బంతుల్లో 41; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (25 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్సర్) కీలక సమయంలో బాగా ఆడారు. డ్రూ పోర్టర్ ఐదు వికెట్లు తీసుకోగా... మూర్‌హెడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

 వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు 49.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటయింది. కార్డర్ (73 బంతుల్లో 45; 2 ఫోర్లు), మోర్గాన్ (66 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో రిషి ధావన్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
 
 కీలక భాగస్వామ్యం
 టి20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన ధావన్, కోహ్లి ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. దీంతో భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్, రహానే సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే 24 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు గుర్‌కీరత్ కూడా అవుటయ్యాడు. మనీశ్ పాండే... ధోనితో కలిసి ఆరో వికెట్‌కు 40 పరుగులు, జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
 
 సమష్టిగా రాణించిన బౌలర్లు
 ఓ మాదిరి లక్ష్యమే అయినా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ కార్డర్ ఓ ఎండ్‌లో నిలబడ్డా రెండో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ నుంచి సరైన సహకారం లభించలేదు. ఓ దశలో ఈ జట్టు 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. మోర్గాన్ పోరాడటంతో ఇన్నింగ్స్ ముందుకు సాగింది. భారత స్పిన్ త్రయం అక్షర్, అశ్విన్, జడేజా కలిసి ఆరు వికెట్లు తీయడం విశేషం. పేసర్లు ఉమేశ్, శరణ్, రిషి ధావన్ కొత్త బంతితో చక్కగా బౌలింగ్ చేశారు. ఇదే మైదానంలో జరిగే తొలి వన్డేకు ముందు భారత బౌలర్ల ప్రదర్శన బాగుంది. అయితే బౌన్స్ బాగా ఎక్కువగా ఉండే వాకా మైదానంలో స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీయడం విశేషం.
 
 స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) షార్ట్ (బి) మూర్‌హెడ్ 67; శిఖర్ ధావన్ (సి) మూర్‌హెడ్ (బి) పోర్టర్ 4; కోహ్లి ఎల్బీడబ్ల్యు (బి) పోర్టర్ 7; రహానే (బి) మూర్‌హెడ్ 41; గుర్‌కీరత్ (సి) ఇంగ్లిస్ (బి) పోర్టర్ 6; మనీశ్ పాండే (సి) కార్డర్ (బి) మూడీ 58; ధోని (స్టం) ఇంగ్లిస్ (బి) ఓకానర్ 15; జడేజా (సి) కార్డర్ (బి) పోర్టర్ 26; అక్షర్ పటేల్ నాటౌట్ 8; రిషి ధావన్ రనౌట్ 0; అశ్విన్ (సి) ఇంగ్లిస్ (బి) పోర్టర్ 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్) 249.

 వికెట్ల పతనం: 1-4; 2-19; 3-107; 4-125; 5-131; 6-171; 7-231; 8-243; 9-244; 10-249.
 బౌలింగ్: డేవిడ్ మూడీ 6-1-24-1; పోర్టర్ 9.1-0-37-5; టర్నర్ 5-0-33-0; బెవిలాక్వ 9-0-37-0; మూర్‌హెడ్ 10-0-55-2; ఓకానర్ 6-0-37-1; బోసిస్టో 4-0-25-0.

 వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇన్నింగ్స్: బోసిస్టో (సి) ధోని (బి) ఉమేశ్ 13; కార్డర్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 45; షార్ట్ (బి) అశ్విన్ 10; హాబ్సన్ (సి) ధోని (బి) రిషి 4; ఇంగ్లిస్ (బి) అక్షర్ 17; పోర్టర్ (సి) ధోని (బి) అశ్విన్ 10; జారన్ మోర్గాన్ (సి) రోహిత్ (బి) రిషి 50; మూర్‌హెడ్ (సి) గుర్‌కీరత్ (బి) జడేజా 11; మూడీ (సి) అండ్ (బి) అక్షర్ 8; టర్నర్ నాటౌట్ 2; ఓకానర్ (సి) ఉమేశ్ (బి) గుర్‌కీరత్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 185.

 వికెట్ల పతనం: 1-39; 2-61; 3-70; 4-96; 5-98; 6-127; 7-154; 8-182; 9-183; 10-185.
 బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 7-0-29-1; బరీందర్ శరణ్ 7-1-22-0; రిషి ధావన్ 7-1-28-2; జడేజా 10-0-38-2; అశ్విన్ 10-1-32-2; అక్షర్ పటేల్ 8-0-29-2; గుర్‌కీరత్ 0.2-0-1-1.
 

Advertisement
Advertisement