Sakshi News home page

చిలీ చిందేసింది

Published Sun, Jun 21 2015 12:14 AM

చిలీ చిందేసింది

బొలివియాపై 5-0తో గెలుపు  
 కోపా అమెరికా కప్ క్వార్టర్స్‌లోకి ప్రవేశం

 
 సాంటియాగో: సొంతగడ్డపై చిలీ ఫుట్‌బాల్ జట్టు చెలరేగిపోయింది. కోపా అమెరికా కప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బొలివియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో చిలీ 5-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. చార్లెస్ అరాన్‌గుయిజ్ రెండు గోల్స్ (3వ, 66వ నిమిషాల్లో) చేయగా... అలెక్సిస్ శాంచెజ్ (37వ ని.లో), గ్యారీ మెడల్ (79వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. బొలివియా ప్లేయర్ రొనాల్డ్ రాల్డెస్ (86వ ని.లో) సెల్ఫ్ గోల్ చేయడంతో చిలీకి తిరుగులేని విజయం దక్కింది. ఈ గెలుపుతో గ్రూప్ ‘ఎ’లో అజేయంగా నిలిచిన చిలీ ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చిలీ లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచిన జట్టు (ఉరుగ్వే లేదా పరాగ్వే)తో తలపడుతుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ బొలివియా జట్టు కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో ఈక్వెడార్ 2-1 గోల్స్ తేడాతో మెక్సికోను ఓడించడంతో 18 ఏళ్ల తర్వాత బొలివియా జట్టుకు ఈ టోర్నీలో క్వార్టర్స్ బెర్త్ ఖాయమైంది. రెండు ‘డ్రా’లు, ఒక ఓటమితో ఈ గ్రూప్‌లో చివరిస్థానంలో నిలిచిన మెక్సికో ఇంటిముఖం పట్టింది.
 
 కోపా అమెరికా కప్‌లో నేడు
 కొలంబియా ఁ పెరూ
 అర్ధరాత్రి గం. 12.30 నుంచి

 బ్రెజిల్ ఁ వెనిజులా
 తెల్లవారుజామున గం. 3.00 నుంచి
 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

Advertisement

తప్పక చదవండి

Advertisement