‘కరోనా చాలా నేర్పింది.. వ్యవసాయం చేస్తా’ | Sakshi
Sakshi News home page

‘వ్యవసాయం చేస్తా.. ఉచితంగా పంచుతా’

Published Sun, Jun 14 2020 1:58 PM

Coronavirus Has Brought The Human Inside Me Alive Says Harbhajan - Sakshi

సాక్షి, ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందకు దేశంలో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌లో వలస కూలీల కష్టాలు వర్ణనాతీతం. ఎంతో మంది దయార్ద్రహృదయులు వలస కూలీల కష్టాలను చూసి చలించిపోయి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా వలస కూలీలకు తనవంతు సాయాన్ని అందించాడు. అతడి స్నేహితులు, సన్నిహితులతో కలిసి పేదలకు నిత్యావసర వస్తువులు అందజేయడంతో పాటు వలస కూలీలు తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే తాజాగా ఇండియా టుడే సలాం క్రికెట్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న భజ్జీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (వాటే ప్లాన్‌ చైనా: భజ్జీ)

‘కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, వలసకూలీల బాధలు, కష్టాలు చూసి చలించిపోయాను. కరోనా ఎన్నో విషయాలను నేర్పింది. నాలోని మానవత్వాన్ని తట్టిలేపింది. దేవుడి దయతో నేను మంచి స్థితిలో ఉన్నా. ఇప్పటివరకు నాకు చేతనైనంత సహాయం చేశాను. ఇక సొంతూరిలో కొంత పొలం కొని పేదల కోసం పంటలు పండించాలని అనుకుంటున్నాను. పండించిన పంటలను పేదలకు ఉచితంగా పంచిపెడతా. కేవలం మనం డబ్బు సంపాదించడానికి బతకడం లేదు. కష్టకాలంలో ఇతరులకు సాయం చేయడం మన కనీస బాధ్యత’ అని భజ్జీ ఉద్వేగంగా మాట్లాడాడు. (ఇంట్లో వాళ్లు మొబైల్‌ బిల్‌ కట్టలేదు)

ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సురేశ్‌ రైనా మాట్లాడాడు. ‘పీఎం కేర్స్‌ ఫండ్‌కు నేను విరాళం ప్రకటించగానే మా కుటుంబసభ్యులు ఎంతో గర్వంగా ఫీలయ్యారు. కరోనా కష్టకాలంలో సహాయం చేసు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. క్రికెట్‌ మ్యాచ్‌ ఆడేటప్పుడు భారత్‌ గెలవాలని వారు ప్రార్థనలు చేసేవారు.. ఇప్పుడు వారు కష్ట కాలంలో ఉన్నప్పుడు చేతనైనంతా సాయం చేయాలని అనుకున్నా’ అని రైనా పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement