ఐసీసీ కొత్త రూల్ ను ఉల్లంఘించిన తొలి క్రికెటర్! | Sakshi
Sakshi News home page

ఐసీసీ కొత్త రూల్ ను ఉల్లంఘించిన తొలి క్రికెటర్!

Published Sat, Sep 30 2017 11:26 AM

ICC

సిడ్నీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెట్ లోని పలు నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు కొన్ని కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఉన్న అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను ట్వంటీ 20ల్లో కూడా ప్రవేశపెడుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.  అలాగే టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో 80 ఓవర్ల తరువాత అదనపు రివ్యూలు ఇవ్వడానికి ఐసీసీ ముగింపు పలికింది.టెస్టుల్లో రివ్యూ చేసిన సమయంలో ‘అంపైర్‌ నిర్ణయం’ సరైనదిగా డీఆర్‌ఎస్‌ చూపించినప్పుడు జట్టు ఒక రివ్యూను కోల్పోదు. దీని వల్ల ఇకపై ఇన్నింగ్స్‌కు 2 రివ్యూలు మాత్రమే ఉంటాయి. 80 ఓవర్ల తర్వాత అదనంగా మరో 2 రివ్యూలు చేరడం ఉండదు.

మరొకవైపు రనౌట్ అవుట్ విషయంలో కీలక మార్పుకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఒక బ్యాట్స్ మన్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్ ను ముందుగా ఒకసారి గ్రౌండ్ ను తాకి ఉంచి ఆ తరువాత అదే బ్యాట్ గాల్లో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. అంటే అదే సమయంలో వికెట్ల పడ్డప్పటికీ బ్యాట్స్ మన్ ముందుగా ఒకసారి క్రీజ్ లో బ్యాట్ ను ఉంచడం వల్ల నాటౌట్ గా సేఫ్ అవుతాడు. అలాగే ఫీల్డర్ తన ప్రవర్తనతో బ్యాట్స్ మన్ ను తప్పుదోవ పెట్టించే యత్నం చేయకూడదనేది ఐసీసీ కొత్త రూల్ లో భాగం చేశారు. అయితే ఐసీసీ పలు నిబంధనలకు సవరణ చేసి 24 గంటలు గడవకపోముందే దాన్ని ఒక ఫీల్డర్ అతిక్రమించాడు. బ్యాట్స్ మన్ బంతిని హిట్ చేసిన తరువాత అది ఫీల్డర్ చేతిలో లేకపోయినా 'ఫేక్ త్రో'తో  భయపెట్టే యత్నం చేశాడు. ఇలా చేయడం ఐసీసీ నిబంధనల్లోని కొత్త చట్టం 41.5 ప్రకారం చేయడం విరుద్ధం. దాంతో సదరు ఆటగాడి జట్టుకి ఐదు పరుగులు కోత విధించారు.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్ లో భాగంగా జేఎల్టీ వన్డే కప్ లో క్వీన్ లాండ్స్ బుల్స్ -క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా ఎలెవన్ బ్యాట్స్ మన్ పరామ్ ఉప్పల్ బంతిని మిడాఫ్ మీదుగా తరలించాడు. కాగా,  మార్నస్ లాబుస్కాంజ్ బంతిని ఆపే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కాగా, ఆ క్రమంలో చేతిలో బంతి ఉన్నట్లు బ్యాట్స్ మన్ ను భ్రమించే యత్నం చేశాడు. ఇది తాజా నిబంధనలకు విరుద్ధం కావడంతో సదరు జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడింది. అయితే ఐసీసీ నిబంధనల్లో మార్పులు చేసిన తరువాత దాన్ని అతి క్రమించిన తొలి క్రికెటర్ గా మార్నస్ లాబుస్కాంజ్ నిలిచాడు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

'క్రికెట్' కాస్త కొత్తగా...

Advertisement

తప్పక చదవండి

Advertisement