ఆంధ్రాబ్యాంక్ గెలుపు | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్ గెలుపు

Published Fri, Mar 14 2014 12:01 AM

ఆంధ్రాబ్యాంక్ గెలుపు - Sakshi

 ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మన్ అర్జున్  యాదవ్ (135 బంతుల్లో 101 నాటౌట్; 4 ఫోర్లు,1 సిక్స్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ జట్టు ఇన్నింగ్స్ 59 పరుగుల తేడాతో ఈఎంసీసీ జట్టుపై గెలుపొందింది.

మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 424/4తో బరిలోకి దిగిన ఆంధ్రాబ్యాంక్... అర్జున్ చెలరేగడంతో ఇన్నింగ్స్‌ను  581/8 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అమోల్ షిండే (43) ఫర్వాలేదనిపించాడు. ఈఎంసీసీ బౌలర్ రవితేజ 3 వికెట్లు తీసుకున్నాడు.అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈఎంసీసీ జట్టుకు ఆంధ్రా బ్యాంక్ బౌలర్లు అమోల్ షిండే (5/46), కనిష్క్ యాదవ్ (4/38)  ముచ్చెమటలు పట్టించారు.

దీంతో ఈఎంసీసీ 192 పరుగుల వద్ద ఆలౌటైంది. సూర్యతేజ (60), ఆకాశ్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకుముందు ఈఎంసీసీ తన తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ విజయంతో ఆంధ్రా బ్యాంక్ 15 పాయింట్లను దక్కించుకోగా... ఈఎంసీసీ 4 పాయింట్లతో సరిపెట్టుకుంది.
 

షాదాబ్ కదంతొక్కినా...

ఎస్‌బీహెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్‌మన్ షాదాబ్ తుంబి (142 బంతుల్లో 111 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు. ఎస్‌బీహెచ్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 197/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ 309 పరుగుల వద్ద ఆలౌటైంది.

సందీప్ రాజన్ (72) అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో డెక్కన్ 155 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్‌బీహెచ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. సుమన్ (83 నాటౌట్), అనూప్ (63 నాటౌట్) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్‌తో ఎస్‌బీహెచ్‌కు 12 పాయింట్లు, డెక్కన్ క్రానికల్‌కు 4 పాయింట్లు దక్కాయి.
 

Advertisement
Advertisement