వార్నర్ 'సెంచరీ'ల రికార్డు! | Sakshi
Sakshi News home page

వార్నర్ 'సెంచరీ'ల రికార్డు!

Published Fri, Dec 9 2016 11:41 AM

వార్నర్ 'సెంచరీ'ల రికార్డు!

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో వార్నర్ వరుసగా రెండో శతకం సాధించాడు. ఇప్పటికే రెండో వన్డేలో సెంచరీ సాధించిన వార్నర్.. మూడో వన్డేలో కూడా శతకం నమోదు చేశాడు. 95 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ చేశాడు. ఇది వార్నర్ కెరీర్లో 11వ వన్డే సెంచరీ కాగా ఒక క్యాలెండర్ ఇయర్లో ఏడో శతకం కావడం విశేషం. దాంతో ఒక ఏడాదిలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఏకైక ఆస్ట్రేలియా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా తరపున ఒక క్యాలెండర్ ఇయర్ లో ఐదు వన్డే సెంచరీలు మించి చేసిన క్రికెటర్లు లేరు. అంతకముందు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్లు ఒక ఏడాదిలో ఐదు వన్డే సెంచరీలు మాత్రమే చేశారు.  పాంటింగ్ 2003, 2007 సంవత్సరాల్లో ఐదేసి వన్డే సెంచరీలు సాధించగా, 2007 లో హేడెన్ ఐదు సెంచరీలు నమోదు చేశాడు.


ఇదిలా ఉండగా, వార్నర్ మరో మైలురాయిని కూడా సొంతం చేసుకున్నాడు.ఒక క్యాలండర్ ఇయర్లో ఏడు వన్డే శతకాల సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తద్వారా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరసన నిలిచాడు. 2000లో గంగూలీ ఒక ఏడాదిలో ఏడు వన్డే సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఒక క్యాలెండర్ ఇయర్లో ఓవరాల్గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముందంజలో ఉన్నాడు.1998 లో సచిన్ టెండూల్కర్ 9 వన్డే శతకాలు సాధించి తొలిస్థానంలో ఉన్నాడు.
 

Advertisement
Advertisement