సింగిల్స్‌లో జిగేల్‌ | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌లో జిగేల్‌

Published Fri, Feb 3 2017 11:33 PM

సింగిల్స్‌లో జిగేల్‌

అలవోకగా నెగ్గిన యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌
భారత్‌కు 2–0 ఆధిక్యం
న్యూజిలాండ్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌


ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. అంతా ఏకపక్షమే. సొంతగడ్డపై భారత టెన్నిస్‌ ఆటగాళ్లు మరోసారి మెరిశారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 పోటీలో మొదటిరోజే భారత్‌ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లోనూ గెలిస్తే భారత్‌ విజయం ఖాయమవుతుంది.  

అపుణే: పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సంతరించుచున్న యూకీ బాంబ్రీ... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రామ్‌కుమార్‌ రామనాథన్‌ డేవిస్‌కప్‌లో భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 తొలి రౌండ్‌లో భాగంగా తొలి రోజు శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు జయభేరి మోగించారు. తొలి సింగిల్స్‌లో యూకీ 6–4, 6–4, 6–3తో ఫిన్‌ టియర్నీపై గెలుపొందగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6–3, 6–4, 6–3తో జోస్‌ స్థాతమ్‌ను ఓడించాడు. ఈ విజయాలతో భారత్‌ 2–0తో ఆధిక్యాన్ని సంపాదించింది. శనివారం డబుల్స్‌ మ్యాచ్‌లో లియాండర్‌ పేస్‌–విష్ణువర్ధన్‌ జంట బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే భారత్‌ ఏప్రిల్‌లో ఆసియా ఓసియానియా రెండో రౌండ్‌ పోటీలకు అర్హత పొందుతుంది.
ఫిన్‌ టియర్నీతో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో యూకీ ఆరంభంలో 1–3తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 5–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. తొమ్మిదో గేమ్‌లో టియర్నీ సర్వీస్‌ నిలబెట్టుకోగా, పదో గేమ్‌లో యూకీ తన సర్వీస్‌ను కాపాడుకొని తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌ మొదట్లో యూకీ మళ్లీ తడబడి వెంటనే పుంజుకున్నాడు. మూడో సెట్‌లో టియర్నీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసిన యూకీ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో యూకీ ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసి, తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు.

మరోవైపు జోస్‌ స్థాతమ్‌తో గంటా 52 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ ఏకంగా 15 ఏస్‌లు సంధించాడు. అయితే సర్వీస్‌లో కాస్త తడబడి ఎనిమిది డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. కానీ తన సర్వీస్‌లో ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా ఇవ్వని రామ్‌... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసి తన డేవిస్‌ కప్‌  కెరీర్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement