భళా... భారత్ | Sakshi
Sakshi News home page

భళా... భారత్

Published Sat, Jul 16 2016 12:36 AM

భళా... భారత్

* రెండు సింగిల్స్‌లో రామ్‌కుమార్, సాకేత్ విజయం
* కొరియాపై 2-0తో ఆధిక్యం
* డేవిస్ కప్ మ్యాచ్

చండీగఢ్: సొంతగడ్డపై భారత టెన్నిస్ యువ ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని ఆకట్టుకున్నారు. దక్షిణ కొరియాతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు 2-0తో ఆధిక్యాన్ని అందించారు. రెండు మ్యాచ్‌ల్లో కొరియా ఆటగాళ్లు ఓటమి అంచుల్లో ఉన్న దశలో గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం.
 

డేవిస్ కప్‌లో తొలిసారి బరిలోకి దిగిన 21 ఏళ్ల రామ్‌కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్‌కుమార్‌ను విజేతగా ప్రకటించారు. యోంగ్‌కు లిమ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో కొరియా ప్లేయర్ గాయం కారణంగా తప్పుకున్నాడు.

కెరీర్‌లో తొలిసారి ఐదు సెట్‌ల మ్యాచ్‌ను ఆడిన సాకేత్ విజయం ఖాయం కాగానే ఆనందంతో తన జెర్సీని విప్పి గాల్లోకి విసిరేసి సంబరం చేసుకున్నాడు. మిగతా సహచరులు సాకేత్‌ను భుజాలపైకి ఎత్తుకొని అతణ్ని అభినందించారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న ద్వయం హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్ జోడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది.

Advertisement
Advertisement