‘ఏబీ రిటైర్‌ అయ్యాడు.. ఇక భయం లేదు’

3 Jul, 2020 14:32 IST|Sakshi

న్యూఢిల్లీ: తనదైన రోజున ఏ బౌలర్‌పైనైనా విరుచుకుపడటంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌కు సాటి మరొకరు ఉండరు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన డివిలియర్స్‌,.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగుంటే డివిలియర్స్‌ పునరాగమనం షురూ అయ్యేది.  ఈ మేరకు ఏబీతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సంప్రదింపులు జరిపింది కూడా. అయితే వరల్డ్‌కప్‌ జరిగే అవకాశం లేకపోవడంతో ఏబీ రీఎంట్రీ అనేది డైలమాలో పడింది. ఇదే విషయాన్ని డివిలియర్స్‌ కూడా స్పష్టం చేశాడు. కరోనా వైరస్‌ తర్వాత చోటు చేసుకుని పరిస్థితుల్ని బట్టి, తన వయసు ఎంతవరకూ సహకరిస్తుందో అనే అంశాలపై తన రీఎంట్రీ ఉంటుందన్నాడు.(యూనిస్‌ జోక్‌ చేస్తే.. సీరియస్‌ వ్యాఖ్యలా?)

కాగా, ఏబీ డివిలియర్స్‌పై భారత చైనామన్‌ స్పిన్నర్‌(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌) కుల్దీప్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం మంచి పరిణామం అని వ్యాఖ్యానించాడు. లేకపోతే తనలాంటి బౌలర్లు ఎంతోమంది బలయ్యే వాళ్లమని పేర్కొన్నాడు. ఇలా తాను కూడా ఏబీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌ జోరు ముందు తేలిపోయిన బౌలర్‌నేనని చెప్పకనే చెప్పేశాడు. ‘ వన్డేల్లో ఏబీ ఎంతో విలువైన ఆటగాడు. అతనిది ప్రత్యేకమైన స్టైల్‌. ఇప్పుడు అతని బెంగలేదు... రిటైర్‌ అయిపోయాడు. ఇదొక మంచి పరిణామమే. మిగతా వారితో పోలిస్తే ఏబీ చాలా డేంజర్‌. నాకు డివిలియర్స్‌కు బౌలింగ్‌ చేయడమంటే కత్తిమీద సాములా ఉండేది. నన్ను అత్యంత భయపెట్టిన బ్యాట్స్‌మన్‌ ఏబీ. నా బౌలింగ్‌లో ఎదురుదాడి చేసి ఏబీ భారీగా పరుగులు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి’ అని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో నిర్వహించిన క్రికెట్‌బాజీ లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తాతో పలు విషయాల్ని కుల్దీప్‌ షేర్‌ చేసుకున్నాడు. (రాంచీలో ధోని ఏదో చేశాడు.. లేకపోతే ఎలా?)

ఈ క్రమంలోనే డివిలియర్స్‌ బ్యాటింగ్‌కు భయపడ్డ పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో టెస్టుల్లో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ చాలెంజింగ్‌ ఉంటుందన్నాడు. ఎక్కవ బ్యాక్‌ ఫుట్‌లో ఆడటమే కాకుండా చాలా ఆలస్యంగా బంతిని ఆడటం తనకు సవాల్‌గా ఉండేదన్నాడు. ఇక 2019 ఐపీఎల్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, మొయిన్‌ అలీలు తనను చితక్కొట్టిన విషయాన్ని కూడా కుల్దీప్‌ గుర్తు చేసుకున్నాడు. కేకేఆర్‌ 10 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆ మ్యాచ్‌లో కుల్దీప్‌ ఒక ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకున్నాడు. కోహ్లి, మొయిన్‌ల ధాటికి భారీగా పరుగులిచ్చాడు. అయితే ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే 2019 వరల్డ్‌కప్‌కు సిద్ధమైన విషయాన్ని కుల్దీప్‌ ప్రస్తావించాడు. ఐపీఎల్‌లో తాను చూసిన వైఫల్యాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో వరల్డ్‌కప్‌కు సిద్ధమయ్యానన్నాడు.  దాంతోనే వరల్డ్‌కప్‌లో ఎక్కువ వికెట్లు సాధించకపోయినా, బౌలింగ్‌లో పరుగులు ఇవ్వకుండా ఆకట్టుకునే ప్రదర్శన చేశానన్నాడు.

మరిన్ని వార్తలు