ఫెడరర్ X నాదల్ | Sakshi
Sakshi News home page

ఫెడరర్ X నాదల్

Published Thu, Dec 10 2015 2:51 AM

ఫెడరర్  X నాదల్

నేటి నుంచి ఢిల్లీలో ఐపీటీఎల్
 న్యూఢిల్లీ:
ఓవైపు ఫెడరర్... మరోవైపు నాదల్.. ఇంకోవైపు సానియా, పేస్‌లాంటి దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా తిలకించేందుకు రంగం సిద్ధమైంది. వీళ్లందరూ బరిలోకి దిగుతున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) మూడో అంచె పోటీలకు నేడు (గురువారం) తెరలేవనుంది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతోన్న డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు తొలి మ్యాచ్‌లో ఫిలిప్పిన్ మావెరిక్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో జపాన్ వారియర్స్‌తో తలపడుతుంది. అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) మ్యాచ్ మాత్రం శనివారం జరగనుంది. ఏసెస్ తరఫున నాదల్, రాయల్స్ తరఫున ఫెడరర్‌లు పురుషుల సింగిల్స్‌లో తలపడనున్నారు.
 ఔ
  సొంత గడ్డపై సానియా, బోపన్నలు మరోసారి సత్తా చాటాలని భావిస్తున్నారు. మరోవైపు వారియర్స్ తరఫున బరిలోకి దిగుతున్న లియాండర్ పేస్ కూడా పూర్తిస్థాయి ఆటతీరును చూపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అలసట కారణంగా సింగపూర్ స్లామర్స్ ఆటగాడు జొకోవిచ్ ఈ పోటీలకు దూరమైనా... ఆండీ ముర్రే, వావ్రింకా, సఫిన్, కార్లోస్ మోయాలు తమ రాకెట్ మ్యాజిక్‌ను చూపెట్టేందుకు రెఢీగా ఉన్నారు. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏసెస్ మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫిలిప్పిన్స్ ఐదింటిలో నాలుగు నెగ్గి రెండో స్థానంలో నిలిచింది.
 
  యూఏఈ రాయల్స్, సింగపూర్ స్లామర్స్, జపాన్ వారియర్స్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత సీజన్‌లో టిక్కెట్లు ధరలు భారీగా పెట్టి విమర్శలపాలైన నిర్వాహకులు ఈసారి కూడా వాటిని మార్చే ప్రయత్నం చేయలేదు. టికెట్ కనిష్ట ధర రూ. 4 వేలు కాగా, గరిష్ట ధర 48 వేలుగా నిర్ణయించారు. గతేడాది సగం స్టేడియం ఖాళీగా దర్శనమిచ్చినా... ఈసారి పూర్తిగా నిండుతుందని ఏసెస్ సహ యజమాని గుల్షన్ జురాని అన్నారు.
 
 ఫెడరర్ కొత్త కోచ్‌గా లుబిసిచ్
 2016 సీజన్‌కు ఫెడరర్ కొత్త కోచ్‌ను నియమించుకున్నాడు. స్టెఫాన్ ఎడ్‌బర్గ్ స్థానంలో ఇవాన్ లుబిసిచ్ (క్రొయేషియా)కు బాధ్యతలు అప్పగించాడు. దీంతో ఎడ్‌బర్గ్‌తో రెండేళ్ల కోచింగ్ బంధానికి తెరపడింది. అయితే ప్రధాన కోచ్‌గా సెవెరిన్ లూతీ కొనసాగుతాడని స్విస్ స్టార్ వెల్లడించాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement