కమ్మేసిన పొగమంచు:మ్యాచ్లు రద్దు! | Sakshi
Sakshi News home page

కమ్మేసిన పొగమంచు:మ్యాచ్లు రద్దు!

Published Sun, Nov 6 2016 1:13 PM

కమ్మేసిన పొగమంచు:మ్యాచ్లు రద్దు! - Sakshi

న్యూఢిల్లీ: గతకాలంగా ప్రపంచ కాలుష్యనగరాల్లో ప్రధానంగా నిలిచిన ఢిల్లీలో.. గత మూడ్రోజులుగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. దుమ్ము, ధూళి, పొగ,  రసాయనాలు  ప్రమాదస్థాయిని మించిపోయాయి. దాంతో ఢిల్లీ ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ సెగ క్రికెట్ మ్యాచ్లనూ వీడలేదు. పొగమంచు కారణంగా నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో, కర్నైల్ సింగ్ స్టేడియంలో శనివారం జరగాల్సిన మ్యాచ్లు రద్దయ్యాయి. ఈ వాయు కాలుష్యం ఊపిరిత్తుల సమస్యతో పాటు, కంటి చూపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆటగాళ్లు మ్యాచ్లు ఆడటానికి వెనకడుగు వేశారు.

గ్రూప్-ఎలో భాగంగా బెంగాల్-గుజరాత్ జట్ల మధ్య ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఒక మ్యాచ్, గ్రూప్-సిలో త్రిపుర-హైదరాబాద్ జట్ల మధ్య కర్నైల్ సింగ్ స్టేడియంలో మరో మ్యాచ్ తొలి రోజు ఆట రద్దయ్యింది. వాహనాలు వెదజల్లుతున్న వాయువులతోపాటు నగరం చుట్టుపక్కలున్న పరిశ్రమలనుంచి వస్తున్న కాలుష్యం ఢిల్లీ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతుంటే, ఇటీవల జరిగిన దీపావళి పండగ కూడా వాయు కాలుష్యానికి ఆజ్యం పోసింది.

 

స్టేడియాల్లో కనుచూపు మేర ఏమీ కనిపించక పోగా, గాలిలో కూడా నాణ్యత లోపించడంతో తొలి రోజు మ్యాచ్ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం నాలుగు గంటల వరకూ వాతావరణాన్ని పలుమార్లు పరీక్షించిన తరువాత మ్యాచ్ లను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే ఆదివారం రెండో రోజు ఆట కూడా సాగే అవకాశం దాదాపు కనబడుట లేదు. ఇప్పటికే త్రిపుర-హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన రెండో రోజు ఆటను రద్దు చేశారు.

Advertisement
Advertisement