యువరాజ్‌ సింగ్ గోల్‌ అదే! | Sakshi
Sakshi News home page

యువరాజ్‌ సింగ్ గోల్‌ అదే!

Published Fri, Apr 22 2016 3:47 PM

యువరాజ్‌ సింగ్ గోల్‌ అదే! - Sakshi

వన్డే క్రికెట్ దిగ్గజం యువరాజ్‌ సింగ్ ఈ మధ్యకాలంలో స్థిరత్వం కోల్పోయాడు. అడపాదడపా జట్టులోకి వచ్చి అరకొరగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ 34 ఏళ్ల ఈ స్టైలిష్ బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్‌ అప్పుడే ముగిసిపోలేదని బలంగా విశ్వసిస్తున్నాడు. 18 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యువీ అద్భుతమైన క్రికెట్‌తో అభిమానుల మనస్సులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ద్వారా క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ ఆల్‌రౌండర్‌.. ఈ 16 ఏళ్లకాలంలో భారత క్రికెట్‌ జట్టుకు తనదైన సేవలను అందించాడు. 2007లో దక్షణాఫ్రికాలో జరిగిన టీ20 తొలి వరల్డ్‌ కప్‌లో తన అద్భుతమైన బ్యాంటింగ్‌తో జట్టుకు ఈ మెగా కప్‌ను అందించాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన 2011లో వన్డే వరల్డ్‌ కప్‌లోనూ యూవీ అద్భుతంగా రాణించాడు. విరోచితమైన బ్యాటింగ్‌తో భారత్‌కు రెండో వరల్డ్ కప్‌ అందించిన యూవీ.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంటు పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే తన ఒంట్లో క్రికెట్‌ ఆడే సత్తా ఇంకా తగ్గలేదని, ఇంగ్లండ్‌లో జరిగే 2019 వరల్డ్‌ కప్‌లోనూ ఆడాలన్నదే తన లక్ష్యమని యూవీ చెప్తున్నాడు. ఆ మధ్య తన ఊపిరితిత్తుల్లో గోల్ఫ్ బాల్ పరిమాణంలో కాన్సర్‌ ట్యూమర్‌ ఉందని తేలినా.. యువీ చెదరలేదు. కాన్సర్‌పై పోరాటంలో విజయం సాధించిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టి తనదైన రీతిలో అభిమానులను అలరిస్తున్నాడు.

క్రికెట్ మీద ఉన్న ఇష్టమే తనను ముందుకు నడిపిస్తున్నదని, ఆ ఇష్టం వల్లే 16 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగగలిగానని యువీ తాజా చెప్పాడు. 'ఇంకొంత క్రికెట్ ఆడి ఉంటే బాగుండేది అనుకునే కాలం భవిష్యత్‌లో రాకూడదనే నేను భావిస్తున్నా. ఇక్కడితో ముగించాలని నాకు అనిపించిన రోజు నేను తప్పకుండా క్రికెట్ నుంచి తప్పుకుంటా. కానీ ఇంకొంత నేను ఆడగలననే అనుకుంటున్నా' అని యువీ ఇష్టాగోష్టిగా విలేకరులకు తెలిపాడు. 2019 వరల్డ్‌ కప్‌లో ఆడటమే ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్నానని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్ తరఫున ఆడుతున్న యూవీ.. 2019 వరల్డ్‌ కప్‌లో ఆడితే.. అది తనకు గొప్ప విషయం అవుతుందని చెప్పాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement