ధావన్ అజేయ సెంచరీ | Sakshi
Sakshi News home page

ధావన్ అజేయ సెంచరీ

Published Sun, Sep 27 2015 11:48 PM

ధావన్ అజేయ సెంచరీ

భారత్ ‘ఎ’ 161/1
 బంగ్లాదేశ్ ‘ఎ’తో టెస్టు మ్యాచ్

 
బెంగళూరు: కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు ఓపెనర్ శిఖర్ ధావన్ (112 బంతుల్లో 116 బ్యాటింగ్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) గాడిలో పడ్డాడు. బంగ్లాదేశ్ ‘ఎ’తో ఆదివారం ప్రారంభమైన అనధికార టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది. ధావన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అభినవ్ ముకుంద్ (34) ఓ మాదిరిగా ఆడినా... ధావన్ మాత్రం బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి వికెట్‌కు 153 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చాడు. ప్రస్తుతం టీమిండియా ఇంకా 67 పరుగులు వెనుకబడి ఉంది. ధావన్ 97 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.

రాణించిన ఆరోన్, జయంత్: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. పేసర్ వరుణ్ ఆరోన్ (4/45), స్పిన్నర్ జయంత్ యాదవ్ (4/28) బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. ఆరంభంలో పేసర్ ఆరోన్ నిప్పులు చెరగడంతో ఓ దశలో బంగ్లా 6 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షబ్బీర్ రెహమాన్ (131 బంతుల్లో 122; 23 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు.  నాసిర్ హుస్సేన్ (32)తో కలిసి ఐదో వికెట్‌కు 44; షువుగత (62)తో కలిసి ఆరో వికెట్‌కు 132 పరుగులు జోడించి బంగ్లాదేశ్ స్కోరును 200 దాటించాడు. చివర్లో జయంత్ స్పిన్ మ్యాజిక్ చూపెట్టడంతో బంగ్లా లోయర్ ఆర్డర్ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. 46 పరుగుల తేడాలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.
 
 

Advertisement
Advertisement